Sunday, July 25, 2010

మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌


మొదటిభాగం

గత నాలుగు నెలలుగా ఈక్విటీ స్కీమ్‌లోని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాలు గణనీయమైన సంఖ్యలో విరమించుకోవడం క్యాపిటల్‌ మార్కెట్‌ వర్గాలలో కలవరాన్ని లేపింది. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, ద్రవ్య ఉత్పత్తులలోనే అత్యధిక ఆదరణను పొందాయి. కానీ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన ఫైనాన్షియల్‌ రంగంతోపాటు మ్యూచువల్‌ ఫండ్‌ రంగం నేలకొరిగింది. తదనంతర కాలంలో మన దేశంలో మార్కెట్‌ వేగంగా పుంజుకున్న నేపథ్యంలో తాజా పరిణామం మార్కెట్‌ వర్గాలకు అశనిపాతంలా ఉంది.

మ్యూచువల్‌ ఫండ్‌ అంటే

వివిధ మదుపుదారుల నుండి మదుపు సొమ్మును ఒక నిధిగా పోగుచేస్తారు. ప్రతిగా మదుపు దారులకు వారి మదుపు సొమ్ము నిష్పత్తిలో యూనిట్‌లుగా విక్రయిస్తారు. ఈ నిధిని మ్యూచువల్‌ ఫండ్‌ లేదా పరస్పర నిధి అంటారు. యూనిట్ల రూపంలో సేకరించిన నిధి సొమ్ము మొత్తాన్ని ఆ నిధి లక్ష్యాలకనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులు వివిధ రంగాలు, పరిశ్రమలలో వైవిధ్యంగా పెట్టటం వల్ల ''రిస్క్‌'' అదుపు చేయబడుతుంది. మ్యూచువల్‌ ఫండ్‌ మదుపుదారులను ''ఫండ్‌ హోల్డర్లు'' అని పిలుస్తారు. ఈ పెట్టుబడులపై వచ్చే డివిడెండ్లు గాని, వడ్డీ ఇతర ఆదాయాలు ఆ నిధికి జమ చేస్తారు. యూనిట్లగా విభజించిన నిధి సొమ్ముతో పెట్టుబడి పెట్టిన ద్రవ్య ఉత్పత్తుల విలువపై, యూనిట్‌ విలువ ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌ లోని పరిణామాలతో యూనిట్‌ విలువ ప్రతి రోజు మారుతుంటుంది. ఏరోజుకారోజు యూనిట్‌ విలువను లెక్కిస్తారు. ఈ విలువ నుండి యూనిట్‌ నిర్వహణకై అయ్యే ఖర్చును మినహాయించిన విలువను నికర ఆస్థి విలువ లేదా నెట్‌ ఎస్సెట్‌ వ్యాల్యూ, క్లుప్తంగా యన్‌.ఏ.వి అంటారు. నిర్వహణ ఖర్చులు తగ్గిన మేరకు యూనిట్ల కేటాయింపు పెరుగుతుంది. నిధి మొత్తం మార్కెట్‌ విలువను యాజమాన్యంలోని ఆస్థుల విలువ (ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) అంటారు. ఒక నిర్ణీత కాలంలోని కంపెనీలన్నింటి యాజమాన్యంలోని ఆస్తుల సగటు విలువను ''యాజమాన్యంలోని సగటు ఆస్తుల విలువ లేదా యావరేజ్‌ ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌'' అంటారు.

మ్యూచువల్‌ ఫండ్‌ - ప్రత్యేకతలు

మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ తప్పనిసరిగా సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) దగ్గర నమోదు చేసుకొని ఉండాలి. భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల నియంత్రణ 1993లోనే సెబీకి అప్పగించబడింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టటానికి అవసరమైన అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యం, తీరిక లేని మదుపుదారులు మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాలను పొందవచ్చు ఈ రంగంలో అనుభవం, దక్షత కలిగిన నిపుణులు ఫండ్‌ మేనేజర్‌లుగా ఉంటారు. ఉన్నత మధ్య తరగతి వర్గం ఈ రంగంలో గణనీయంగా మదుపు చేస్తున్నారు.

మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి మార్గాలు

ప్రతియూనిట్‌ హోల్డరు తన నిధిని, ఏదో ఒక స్కీమ్‌ను ఎన్నుకొని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సామాన్యంగా మూడు పద్ధతులలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు ఉంటాయి.

1. గ్రోత్‌ లేదా ఈక్విటీ స్కీమ్‌

ఈ స్కీమ్‌ని ఎంచుకున్న నిధులలో అత్యధిక భాగం షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టబడతాయి. షేర్‌ మార్కెట్‌ ఒడుదుడుకుల రిస్క్‌ ఇందులో అధికంగా ఉంటుంది. అదే సమయంలో లాభాలు /నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. మధ్య/దీర్ఘకాలిక పెట్టు బడులతో మూల ధనాన్ని గణనీయంగా పెంచడం ఈ స్కీమ్‌ ఉద్దేశ్యం.

2. డెట్‌/ఇన్‌కమ్‌ స్కీం

మదుపుదారులకు నిర్ణీత వ్యవధిలో, క్రమ పద్ధతిలో ఆదాయాన్ని అందిచటం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ స్కీమ్‌ లోని నిధులను స్థిరమైన ఆదాయాన్నిచ్చే బాండ్లు, కార్పొరేట్‌ డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మనీ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదుడుకులు ఈ పథకంపై ఉండవు. కానీ వడ్డీ రేట్లలో వచ్చే మార్పులు ఈ పథకంపై ప్రభావాన్ని కల్గిస్తాయి. రిస్క్‌ తక్కువ. ఆదాయం కూడా అదే పద్ధతిలో ఉంటుంది.

3. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌

మదుపుదారులకు ఈక్విటీ మార్కెట్‌ ప్రయోజనాలతో పాటు క్రమబద్ధమైన ఆదాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. సాధారణంగా ఈక్విటీ, డెట్‌ (ఋణ) సాధనాలలో 40:60 నిష్పత్తిలో ఈ పథకంలో పెట్టుబడి పెడతారు. గ్రోత్‌ ఫండ్‌ కంటే ఈ పథకంలో రిస్క్‌ తక్కువగా ఉంటుంది. ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది.

ఇవికాక కేవలం ప్రభుత్వం సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే గిల్ట్‌ఫండ్‌, ప్రత్యేకమైన రంగాలు/పరిశ్రమలలో పెట్టుబడి పెట్టే సెక్టార్‌ఫండ్‌, సరుకులు, రియల్‌ ఎస్టేట్‌, బులియన్‌ ఫండ్స్‌ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌లో లాభనష్టాలన్నింటిని యూనిట్‌ హోల్డర్‌ భరించాల్సి ఉంటుంది. పథకాల గత ఫలితాల ఆధారంగా భవిష్యత్‌ అంచనాలు మ్యూచువల్‌ ఫండ్‌లో వేసికోకూడదు. ఎప్పటి పరిస్థితుల్ని అప్పుడే బేరీజు వేసుకోవాలి.

భారతదేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌

భారతదేశంలోని మొట్టమొదటి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యుటిఐ)ని చెప్పుకోవాలి. 1963లో ఈ సంస్థ ప్రభుత్వరంగంలో రిజర్వ్‌ బ్యాంకు నియంత్రణతో ఏర్పాటు చేయబడినది. ఈ సంస్థ చేపట్టిన మొదటి పథకం యూనిట్‌-1964 (యు.యస్‌-64). 1987 నుండి 1993 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగంలో ప్రవేశించిన మొదటి బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (1987). 1989లో ఎల్‌.ఐ.సి, 1990లో జి.ఐ.సి ఈ రంగంలో అడుగుపెట్టాయి. నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత 1993 నుండి ఈ రంగంలో ప్రయివేటు కంపెనీలను అనుమతించారు. కొఠారి పయనీర్‌ (ప్రస్తుతం ఈ కంపెనీ ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తో విలీనమైంది) 1993లో ప్రయివేటు రంగంలో ప్రారంభించబడిన మొదటి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ. 1993 నుండి ఈ రంగం నియంత్రణను సెబీకి అప్పచెప్పారు. 2003వ సంవత్సరంలో యు.యస్‌-64 పధకాన్ని నిర్వహించే బాధ్యతను పూర్తిగా యుటిఐకి అప్పచెప్పి, యుటిఐ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ ఏర్పాటు చేయబడింది. యుటిఐ మటుకు సెబీ నియంత్రణ పరిధిలో ఉండదు. ప్రభుత్వ ఆధీనంలో ప్రారంభమైన భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో అత్యధిక భాగం ప్రస్తుతం ప్రయివేట్‌ రంగంలో ఉండటం గమనించాల్సిన అంశం.

Sunday, July 18, 2010

యూనిట్‌ లింక్డ్‌ బీమా మార్కెట్లు- ఒక పరిశీలన

రెండవ భాగం

నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో జీవిత బీమా రంగం మునుపటి లక్ష్యాలకు దూరమౌతున్నది. భారతీయ జీవిత బీమా సంస్థ సైతం ఆ ప్రభావాలకు లోను కావల్సి వచ్చింది. 2003 నుండి 2008 వరకు స్టాక్‌ మార్కెట్‌ విజృంభణ మోజులో పడి స్వల్ప కాల ప్రయోజనాలకు ''యూలిప్‌''లను విక్రయించడం అధికమైంది. ఆ తదనంతర కాలంలో సంభవించిన ప్రపంచ వ్యాప్త పరిణామాలతో దెబ్బతిన్న ''యూలిప్‌''ల ప్రతిఫలం (ఈల్డ్‌)పైమ్మర చర్చ ముమ్మరమైంది.

''యూలిప్‌''లలో గమనించాల్సిన కొన్ని అంశాలు

సామాన్యంగా జీవిత బీమాలో ఊహించని ఘటనల నేపథ్యంలో కుటుంబానికి కావలసిన బీమా రక్షణ కోసం పాలసీదారుడు తన వ్యక్తిగత రిస్క్‌ను ఉమ్మడి రిస్క్‌కు బదిలీ చేస్తాడు. కానీ ''యూలిప్‌'' పధకంలో మార్కెట్‌ రిస్క్‌ మొత్తాన్ని వ్యక్తి భరించాల్సి ఉంటుంది. అందుకోసం ''యూలిప్‌'' ఉత్పత్తులకు సంబంధించిన వివరాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం బీమా కంపెనీ సాధికారికంగా ప్రచురించే ప్రాస్పెక్టస్‌ను తప్పనిసరిగా చదవడం అవసరం.

అత్యధిక ఖర్చులతో తగ్గే యూనిట్ల కేటాయింపు

''యూలిప్‌'' పథకంలో పాలసీ దారుడు చెల్లించాల్సిన ప్రీమియం అలకేషన్‌ ఛార్జీలు, ఫండ్‌ నిర్వహణ ఖర్చులు, పాలసీ నిర్వహణ ఖర్చులు, బీమా రక్షణకు అవసరమయ్యే రిస్క్‌ ప్రీమియం తదితర ఛార్జీలను మినహాయించి మిగిలిన సొమ్మును బీమా కంపెనీలు యూనిట్లలో పెట్టుబడి పెడతారని చెప్పుకున్నాం. ప్రీమియంలో ఈ ఖర్చుల మోతాదు ఏ మేరకు పెరిగితే ఆ మేరకు కేటాయించగల యూనిట్లు తగ్గుతాయి. ఖర్చులు తగ్గితే, యూనిట్లు పెరుగుతాయి. అంటే ''యూలిప్‌'' ఉత్పత్తుల నాణ్యత ఆ పథకాన్ని నిర్వహించటానికి అయ్యే ఖర్చులపై ఆధారపడి ఉంటుందన్న సూత్రాన్ని పాలసీదారుడు తప్పనిసరిగా గమనించాలి. అందుకోసంగా బీమా కంపెనీల వివిధ ప్రాస్పెక్టస్‌ను పోల్చి చూసుకోవాలి. ఇప్పటివరకు వివిధ జీవిత బీమా కంపెనీలు ''యూలిప్‌''లలో మొదటి సంవత్సరం ఖర్చుల క్రింద 15% నుండి 70% వరకు వసూలు చేస్తున్నారు. రెండవ సం|| నుండి ఆ ఖర్చులు తగ్గుతుంటాయి. స్పల్ప కాల ప్రయోజనాల కోసం ''యూలిప్‌''లలో మూడు సం||ల పాటు ప్రీమియంలు (లాక్‌-ఇన్‌ పిరియడ్‌) చెల్లించిన పాలసీదారుడు ఆ తరువాతి కాలంలో ప్రీమియంలు చెల్లించక నిష్క్రమిస్తే, అత్యధిక ఖర్చుల మినహాయింపుతో పాటు సరండర్‌ చార్జీల విధింపుతో ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ నష్టం ఆ సొమ్మును పెట్టుబడి పెట్టిన ''ఫండ్‌''ను బట్టి మారుతుంటుంది. అందుకే ''యూలిప్‌''పథకాలు స్వల్పకాలం కంటే దీర్ఘకాలంగానే లాభదాయకాలు.

స్విచ్చింగ్‌

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల కంటే ''యూలిప్‌'' పథకాలలో ఉన్న మెరుగైన సదుపాయం స్విచ్చింగ్‌. ''యూలిప్‌'' పెట్టుబడులను గ్రోత్‌ ఫండ్‌, సెక్యూరిటి ఫండ్‌, బాండ్‌ ఫండ్‌, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లలోని ఏదో ఒక నిధి ద్వారా పాలసీదారుడు పెట్టుబడి పెట్టాలి. ''యూలిప్‌'' దీర్ఘకాలిక ఒప్పందం కాబట్టి, ఒప్పందకాల పరిమితిలో పాలసీదారుడు ఒక రకం ఫండ్‌ నుండి మరొక రకం ఫండ్‌కు మారటం స్విచ్చింగ్‌ అంటారు. ఉదాహరణకు గ్రోత్‌ ఫండ్‌లో ఈక్విటీలలో పెట్టుబడుల కోసం ఎన్నుకున్న పాలసీదారుడు తదనంతర కాలంలో ఈక్విటీ మార్కెట్‌ ఆరోగ్యకరంగా లేనప్పుడు మరో రకం ఫండ్‌కు మారి ''యూలిప్‌'' ప్రయోజనాలను రక్షించుకోవచ్చు. చాలా బీమా కంపెనీలు కొన్ని సార్లుగా ఉచితంగా స్విచ్చింగ్‌ సదుపాయాన్ని కల్పించాయి. మార్కెట్‌ ఒడిదుడుకులలో స్విచ్చింగ్‌ను వినియోగించుకొనే పరిజ్ఞానాన్ని పొందటం ''యూలిప్‌'' పాలసీదారునికి శ్రేయస్కరం.

ఐ.ఆర్‌.డి.ఎ తాజా మార్గదర్శకాలు


1. ''యూలిప్‌''పథకాల లాక్‌ఇన్‌ పిరియడ్‌ను ''యూలిప్‌''లపై వెల్లువెత్తిన వివిధ విమర్శల నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆర్డివెన్స్‌ తదనంతరం, ఐ.ఆర్‌.డి.ఎ (ఇన్యూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలెప్‌మెంట్‌ అధారిటి) ''యూలిప్‌'' పథకాలలో కొన్ని మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టి, సెప్టెంబర్‌ 1, 2010 నుండి అమలయ్యేటట్లు నూతన మార్గదర్శకాల్ని ప్రకటించింది. ఇవి నూతన ''యూలిప్‌'' పథకాలకు వర్తిస్తాయి. వాటిల్లో కొన్నింటిని పరిశీలిద్దాం.

(ప్రీమియం చెల్లించాల్సిన కనీస కాలం) 3 సం||రాల నుండి 5 సం||రాలకు పెంచి, ''యూలిప్‌''లు దీర్ఘకాల పెట్టుబడిగా ఐ.ఆర్‌.డి.ఎ రూడీ చేసింది.

2. ''యూలిప్‌'' పథకం మొత్తం కాలంలో విధించే ఖర్చులన్నీ (రిస్క్‌ ప్రీమియం మినహా) 10 సం||ల కాలపరిమితి గల పథకాలలో 3% మించరాదని, 10 సం|| పైబడ్డ పథకాలలో 2.25%నికి మించరాదని, పథకం ఖర్చులపై పరిమితిని విధించింది. ఈ చర్య అమలు జరిగితే నిర్వహణ ఖర్చులు తగ్గి, కేటాయించగల యూనిట్లు పెరుగుతాయి పాలసీదారులు లాభం పొందుతారు. ఈ ఖర్చుల పరిమితులపై కొన్ని జీవిత బీమా కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

3. అన్ని ''యూలిప్‌'' పాలసీల ప్రీమియం చెల్లింపు కాల పరిమితి కనీసం 5 సం||లు ఉండాలి (సింగిల్‌ ప్రీమియం మినహా)

4. పెన్షన్‌, యాన్యూటి పథకాలు మినహా మిగిలిన ''యూలిప్‌'' ఉత్పత్తులపై సం|| ప్రీమియంకు 10 రెట్లు (45సం||లలోపు వయస్సు) జీవిత బీమా రక్షణను అందించాలి. గతంలో ఇది 5 రెట్లు మాత్రమే ఉంది.

5. పెన్షన్‌, యాన్యూటి పథకాలపై ఏడాదికి 4.5% కనీస ప్రతిఫల హామి ఉండాలి. ''యూలిప్‌''లలో కనీస గ్యారంటీని మార్కెట్‌ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. కనీస గ్యారంటీతో ఆ పథకాలలో పాలసీదారులకు రాదగ్గ ప్రతిఫలం ఉండదనేది వాళ్ళ వాదన.

6. బీమా ప్రీమియంపై ఎటువంటి ''టాప్‌అప్‌'' అయినా సింగిల్‌ ప్రీమియంగానే భావిస్తారు. టాప్‌అప్‌ మొగ్గుచూపినప్పుడు అదనపు బీమాను కలిగి ఉండాలి.

7. ''యూలిప్‌'' ఉత్పత్తులన్నింటిలో బీమా రక్షణ తప్పనిసరి. ఇన్సూరెన్స్‌ పరిధిని దాటి ''యూలిప్‌'' పథకాలున్నాయన్న సెబీ విమర్శల నేపధ్యంలో పై రెండు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.

ముగింపు

కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ముగిసిందనుకున్న ''యూలిప్‌''లపై వివాదం, తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభ్యంతరాలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ వివాదంతో సంబంధం ఉన్న రెగ్యులేటరీ ఎజెన్సీల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా తీసుకొనే ప్రభుత్వ చర్యలు, ఆ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయనేది అభ్యంతరాల సారాంశంగా తెలుస్తుంది. మార్కెట్‌ శక్తుల మార్గం నుండి వైదొలగరాదన్నది ఈ అభ్యంతరాలలో దాగున్న హెచ్చరిక కూడా.జాతీయ జీవిత బీమా రంగం ఆర్థిక రంగంతో పాటు సామాజిక రంగ అభివృద్ధికి కూడా తన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఐ.ఆర్‌.డి.ఏ చేపట్టిన పై చర్యలు ఏ విధంగాను ఆ లక్ష్యాల సాధనకు ఉపకరించేవి కావు.భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవాలన్న లక్ష్యంతో గతంలో పొదుపు భావన ముందుకొచ్చింది. నేడు చిన్న మొత్తాల పొదుపు గ్రామీణ ఆర్థిక జీవనంలో అంతర్భాగమైంది. ఈ పద్దతులలో మదుపు చేయబడుతున్న లక్షల కోట్ల నిధులను పాలకవర్గాలు భవిష్యత్తు భధ్రతకు కాక, మార్కెట్ల నడకకు అవసరమైన కందెనగా మార్చుతున్నారు. ''యూలిప్‌''లు అందులో భాగమే.

Sunday, July 11, 2010

యూనిట్‌ లింక్డ్‌ బీమా మార్కెట్లు - ఒక పరిశీలన

యూనిట్‌ లింక్డ్‌ బీమా మార్కెట్ల నియంత్రణపై గత మూడు నెలలుగా సెబి(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా), ఐ.ఆర్‌.డి.ఎ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరి అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి) మధ్య వివాదం నెలకొన్నది. యూనిట్‌ లింక్డ్‌ బీమా పథకాలు ఉమ్మడి పెట్టుబడుల (కలెక్టివ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌) రూపంలో ఉన్న కారణంగా వాటిపై సంపూర్ణ అదుపు తమదేనని సెబి వాదిస్తుండగా, ఈ పథకాలు బీమారంగ ఉత్పత్తులైనందున వీటిపై నియంత్రణ మాదే నంటూ ఐ.ఆర్‌.డి.ఎ ప్రతివాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో యూనిట్‌ లింక్డ్‌ బీమా మార్కెట్లపై నియంత్రణ పూర్తిగా ఐ.ఆర్‌.డి.ఎ దేనని చట్టపరమైన ఏర్పాటు జరిగింది. అయినప్పటికీ యూనిట్‌ లింక్డ్‌ బీమా పథకాలపై చర్చ కొనసాగుతున్నది.

యూనిట్‌ లింక్డ్‌ బీమా పథకాలు

(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌-యూలిప్‌)

యూనిట్‌ లింక్డ్‌ బీమా పథకాలను క్లుప్తంగా ''యూలిప్‌'' అంటారు. మూలధన మార్కెట్ల (క్యాపిటల్‌ మార్కెట్‌) ప్రయోజనాల్ని అందించే జీవిత బీమా పాలసి ''యూలిప్‌''గా చలామణి అవుతున్నది. జీవిత బీమా పథకాలలో బీమా రక్షణను అందించే పాలసీలు (రిస్క్‌ కవర్‌ పాలసీలు), బీమా రక్షణ, పొదుపులను ఉమ్మడిగా అందించే పాలసీలు (ఎండోమెంట్‌ తరహా పాలసీలు), పూర్తిగా పొదుపునందించే పాలసీలు (ప్యూర్‌ ఎండోమెంట్‌ పాలసీలు) వివిధ రకాలుగా ఉన్నాయి. ''యూలిప్‌''పాలసీ స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాలు, బీమా రక్షణలను ఉమ్మడిగా ఒకే పాలసీలో అందిస్తుంది. స్టాక్‌ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టకుండా, అనుభవం, సామర్థ్యం కలిగిన ఫండ్‌ మేనేజర్ల ద్వారా స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాలను పొందే మ్యూచివల్‌ ఫండ్‌ లాంటిది. పోలికలున్నా మ్యూచ్‌వల్‌ ఫండ్‌లు, ''యూలిప్‌''లు ఒకటి కాదు. మ్యూచ్‌వల్‌ ఫండ్‌లు స్వల్ప కాలిక ప్రయోజనాల్ని ఇవ్వగలిగేవి. ''యూలిప్‌''లు దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అందిస్తాయి. ఈ పథకంలో ''యూనిట్‌ నిధి'' ఏర్పాటు చేయబడుతుంది. ఈ నిధిని జీవిత బీమా కంపెనీలు నిర్వహిస్తాయి. ''యూలిప్‌''పాలసీ పై చెల్లించే ప్రీమియంల నుండి నిధి నిర్వహణకు కావలసిన వివిధ ఖర్చులైన ప్రీమియం యాలకేషన్‌ చార్జీలు, ఫండ్‌ నిర్వహణ ఖర్చులు, పాలసీ/కార్యనిర్వహణ ఖర్చులతో పాటు, పాలసీదారునకు బీమా రక్షణ వర్తించటానికి అవసరమయ్యే ''రిస్క్‌'' ప్రీమియంలను మినహాయించగా మిగిలిన సొమ్మును యూనిట్‌ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని గ్రోత్‌ ఫండ్‌ (ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి), బాండ్‌ ఫండ్‌ (కార్పొరేట్‌ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్థిరమైన వడ్డీని అందించే వివిధ పధకాలు), క్యాష్‌ ఫండ్‌ (మనీ మార్కెట్‌లో పెట్టుబడి), బ్యాలెన్స్‌ ఫండ్‌ (కొంత ఈక్విటీ, కొంత బాండ్‌ మార్కెట్‌లలో పెట్టుబడి)లలో పెట్టుబడి పెడతారు. ఐ.ఆర్‌.డి.ఎ లైసెన్సు పొందిన జీవిత బీమా కంపెనీలు ఏ కంపెనీకి ఆ కంపెనీ, ఏ యూనిట్‌కు ఆ యూనిట్‌ నిధులను నిర్వహిస్తాయి. ప్రతి 'నిధి'ని వివిధ యూనిట్లుగా విభజిస్తారు. ప్రతిరోజూ యూనిట్‌ విలువను లెక్కిస్తారు. ఈ విలువను నికర ఆస్థి విలువ (నెట్‌ ఎస్సెట్‌ వ్యాల్యూ-యన్‌.ఎ.వి) అంటారు. యన్‌.ఎ.వి స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ ప్రాతిపదికన మారుతుంటుంది.

పూర్వరంగం

బ్రిటన్‌లో యూనిట్‌ ట్రస్ట్‌లచే 1950లో ''యూలిప్‌''లు ప్రారంభింపబడ్డాయి. ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, కెనడాలలో ఈ ఉత్పత్తులు విజయవంతంగా అమలయిన తరువాత 1976లో అమెరికాలో ''యూలిప్‌''లు ప్రవేశపెట్టబడ్డాయి. 1980లో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో జీవిత బీమా కంపెనీలు ''యూలిప్‌''లను సొంతం చేసుకున్నాయి. ద్రవ్య పెట్టుబడి ప్రపంచీకరణ వేగానికి అనుగుణంగా ఆయా దేశాలలో ఈ మార్పులు జరిగినాయి.

మనదేశంలో

బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనుమతిస్తూ ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్థాపన తరువాత బీమా ఉత్పత్తులలో వచ్చిన వివిధ మార్పులలో భాగంగా 2003 నుండి ''యూలిప్‌'' వ్యాపారం మన దేశంలో గణనీయంగా అభివృద్ధి అయ్యింది. అంతకు పూర్వం యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలో ''యూలిప్‌'' వ్యాపారం ఉన్నా, అది నామమాత్రంగా ఉండేది. 2003 నుండి 2008 వరకు సెన్సెక్స్‌ 3,391 పాయింట్ల నుండి 20,301 పాయింట్లకు పెరిగింది. ఈ పెరుగుదల ప్రతి సంవత్సరం సగటున 43% గా ఉన్నది (అప్పుడప్పుడు ఉండే ఒడిదుడుకుల్ని పరిగణలోకి తీసుకుంటే) ఈ పెరుగుదలకు ప్రధానంగా ''యూలిప్‌'' నిధులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా దోహదపడ్డాయి. ఆ కాలంలోని సెన్సెక్స్‌ పెరుగుదలతో పాటు వడ్డీ రేటు తగ్గుదల ''యూలిప్‌'' నిధుల సమీకరణపైతీవ్రమైన ప్రభావాన్ని కల్గించాయి. ''యూలిప్‌''ల ప్రాధాన్యతను పెంచాయి. ఆ తరువాతి కాలంలో అమెరికా గృహరుణాల సంక్షోభంతో మూలధనమార్కెట్లు కుప్పకూలాయి. తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవటం ఇంతవరకు సాధ్యపడలేదు.

సంప్రదాయ జీవిత బీమా పధకాలు నిర్లక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా ''సంప్రదాయ జీవిత బీమా పధకాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఈ పథకాలలో అత్యధిక పెట్టుబడుల రిస్క్‌ను బీమా కంపెనీలు భరించాల్సి ఉంటుంది. కాని వారికొచ్చే లాభం 10%నికి మించ''దని యాక్చ్యూరియల్‌ నిపుణులు ఆర్‌. రామకృష్ణన్‌ పేర్కొంటున్నారు. కానీ ''యూలిప్‌''లలో పెట్టుబడుల ''రిస్క్‌'' నంతా పూర్తిగా పాలసీదారుడే భరిస్తారు. లాభాలను జీవితబీమా కంపెనీలు అనుభవిస్తాయి. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా జీవిత బీమా కంపెనీలు ''యూలిప్‌'' వ్యాపారాన్ని ఆదరిస్తూ, సంప్రదాయ బీమా వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి.

భారతదేశంలో బీమా రంగంలో ప్రయివేటు పెట్టుబడులు అనుమతించిన తరువాత ప్రయివేటు జీవిత బీమా కంపెనీలు ''యూలిప్‌''ల వ్యాపారం మీదనే కేంద్రీకరించాయి. ఆ కాలంలో పెరిగిన స్టాక్‌ మార్కెట్‌ పై మోజు, సెన్సెక్స్‌ విజృంభణ వారి వ్యూహాలకు తోడైనాయి. వారు చేసే జీవిత బీమా వ్యాపారంలో ''యూలిప్‌''లు 80%గా ఉన్నాయి. జాతీయం చేసినప్పటి నుండి (1956) బీమా రక్షణతోపాటు పొదుపును ప్రోత్సహించే ఎండోమెంట్‌ తరహా పాలసీలను భారతీయ జీవిత బీమా సంస్థ మన్నికగా నిర్వహించి, లక్షల కోట్ల రూపాయల నిధుల్ని వివిధ ప్రణాళికలకు అందించింది. దానితోపాటు పాలసీదారుల అత్యంత విశ్వాసనీయతను చూరగొన్నది. దేశీయ పొదుపు ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతగా ఉన్నప్పుడు భారతీయ జీవితబీమా సంస్థ నిర్వహించిన మహౌన్నత కర్తవ్యమిది. కాని నయాఉదారవాద విధానాల నేపధ్యంలో ఆర్థిక వ్యవస్థ చోదకులుగా మార్కెట్‌ శక్తులైనాయి, మారిన ప్రాధాన్యతలలో మూలధన మార్కెట్‌ (క్యాపిటల్‌ మార్కెట్‌) ముందుకొచ్చింది. ప్రయివేటు జీవిత బీమా కంపెనీల ప్రచార ప్రభా వాలతో, దేశంలో నెలకొన్న మారిన పరిస్థితులలో భారతీయ జీవిత బీమా సంస్థ సైతం ''యూలిప్‌''ల వ్యాపారంపై కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈ సంస్థ వ్యాపారంలో ''యూలిప్‌''లు 65%గా ఉండి, సంప్రదాయ జీవిత బీమా వ్యాపారం తగ్గింది. భారత దేశంలోని 23 జీవిత బీమా కంపెనీల ఉమ్మడి యూనిట్‌ నిధులు రూ. 2,00,000 ల కోట్లుగా ఉంది. మొత్తం దేశంలోని జీవితబీమా వ్యాపారంలో ''యూలిప్‌''లు 60%గా ఉన్నాయి. అందువల్ల ''యూలిప్‌'' పాలసీ దారుల ప్రయోజన రక్షణ, ''యూలిప్‌'' వ్యాపారంలో అనారోగ్య పోకడల నివారణ ఐ.ఆర్‌.డి.ఎ తక్షణ కర్తవ్యమైంది.

Sunday, July 4, 2010

సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా వడ్డీ రేట్ల సరళీకరణ - చర్చ

''కాదేదీ సరళీకరణ కనర్హం'' అంటూ ''సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాపై వడ్డీ రేట్ల సరళీకరణ''పై చర్చకు రిజర్వు బ్యాంకు తాజాగా తెరతీసింది. రుణాల వడ్డీ రేట్ల పై జూలై 1వ తేది నుండి ''బేస్‌ రేటు'' విధానాన్ని అమలు చేస్తున్న నేపధ్యంలో రిజర్వ్‌ బ్యాంకు ఉద్దేశ్యపూర్వకంగా ప్రవేశ పెట్టిన చర్చ ఇది. బేస్‌ రేటు విధానం అమలుతో సేవింగ్స్‌ బ్యాంకు ఖాతావడ్డీ రేట్లు మినహా మిగిలిన అన్ని రకాల రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్ల నిర్ణయాల్ని మార్కెట్‌ శక్తులకు వదిలివేస్తూ సరళీకరించబడ్డాయి.
సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా

బ్యాంకులు ప్రజల నుండి సమీకరించే నిధులను ''డిపాజిట్లు'' అంటారు. ఈ డిపాజిట్లు కరెంటు ఖాతా డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లు, టెరమ్‌ డిపాజిట్లుగా అమలులో ఉన్నాయి. కరెంటు ఖాతా డిపాజిట్లలో కుదవ పెట్టిన డబ్బును ఖాతాదారుడు కోరినంత మొత్తాన్ని, కోరినన్ని సార్లు, కోరిన సమయంలో బ్యాంకు నుండి తిరిగి తీసుకోవచ్చును. దీన్ని ఎక్కువగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలు ఉపయోగించుకుంటాయి. ఈ ఖాతాలోని నగదు నిల్వపై ఏ విధమైన వడ్డీ చెల్లించబడదు. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ దారుడు దాచుకున్న డబ్బును తిరిగి తీసుకోవటంలోను, తీసుకొనే మొత్తం పైన, సంఖ్య పైన, సమయం పైన బ్యాంకులు కొన్ని పరిమితుల్ని విధిస్తాయి. ఈ ఖాతాలోని నగదు నిల్వపై బ్యాంకులు మూడు నెలలకొకసారి నామామాత్రపు వడ్డీని కూడా చెల్లిస్తాయి. వీటిని వినియోగించుకొనే వారిలో కార్మికులు, ఉద్యోగులు, వృత్తిదారులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు, సంపన్నవంతులు ఉంటారు. బ్యాంకింగ్‌ విస్తరణ తగినంతగా లేని మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్‌ రంగాన్ని వినియోగించుకోలేనివారి సంఖ్య అధికంగా ఉంది. టెరమ్‌ డిపాజిట్ల ఖాతాలో దాచుకున్న సొమ్మును నిర్ణీత సమయానికి నిర్ణీత వడ్డీరేటుపై మాత్రమే చెల్లిస్తారు.

సేవింగ్స్‌ బ్యాంకు వడ్డీరేటు

సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో వడ్డీరేట్లను నియంత్రిత వడ్డీరేట్ల పేర రిజర్వ్‌ బ్యాంకు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాకు 3.5% వడ్డీరేటు చెల్లిస్తున్నారు. ఈ వడ్డీని 3 నెలల కొకసారి డిపాజిట్‌ దారుడి ఖాతాకు జమచేస్తారు. ప్రతి కేలండర్‌ నెలలో 10వ తేది నుండి నెలాఖరు వరకు ఖాతాలో ఉన్న రోజువారి నికర నగదు మొత్తంలోని కనీస మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకొని వడ్డీని లెక్కిస్తారు. స్థూలవడ్డీ రేటు 3.5% ఐనా, అమలులో ఇది 2.8%నికి మించి ఉండదు. ఆ ఖాతాలో మిగిలిన రోజులలో ఎంత గరిష్ట మొత్తం ఉన్నా, కనీస మొత్తంపై వడ్డీ లెక్కించడం ఈ పద్దతిలో ఉన్న ప్రధాన బలహీనత. ఈ పద్దతి డిపాజిట్‌ దారులకు నష్టంగా ఉందని, ఈ పద్ధతిని మార్చమని అనేక సంవత్సరాలుగా డిపాజిటర్లు చేస్తున్న ఆందోళనలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక అంచనా ప్రకారం 31 మార్చి, 2005 నాటికి బ్యాంకు డిపాజిట్‌ ఖాతాలలో 69% సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలు 32 కోట్లుగా ఉన్నాయి. అదే సందర్భంలో షెడ్యూల్డ్‌ బ్యాంకుల దగ్గర ఉన్న డిపాజిట్ల మొత్తంలో 26% అంటే రూ. 4,72,147 కోట్లు సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలలో 77% అంటే రూ. 3,64,869 కోట్లు ''వ్యక్తుల'' (ఇండివ్యూడ్య్‌వల్స్‌) పరంగా ఉన్నాయి. వీటిపై నిర్ణయించిన 3.5% వడ్డీరేటు అమలులో 2.8%నికి(ఎఫెక్ట్‌వ్‌రేటు) మించడం లేదు. ఇంత పెద్ద మొత్తాలలో ఉన్న సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్లలో కనీసం మొత్తంపై లెక్కించే వడ్డీ డిపాజిట్‌ దారులకు నామమాత్రంగానే లభ్యమవుతూ, బ్యాంకులకు అత్యధిక లాభాలను సంపాదించిపెడుతున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో సేవింగ్స్‌ బ్యాంకు వడ్డీరేటు లెక్కింపు పద్ధతిని మార్చాలనే డిమాండ్‌ కూడా బహుకాలంగా బలంగా ఉంది.

సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా వడ్డీరేట్ల సంస్కరణలు

ఈ నేపధ్యంలో 1.4.2010 నుండి సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా వడ్డీ రేట్లను ''ప్రతిరోజువారి వడ్డీ చెల్లించే పద్ధతి'' (డైలీ ప్రోడక్ట్‌ బేసిస్‌) లో గణించాలని రిజర్వ్‌ బ్యాంకు వివిధ బ్యాంకులను ఆదేశించింది (ఈ పద్దతి ప్రకారం సేవింగ్స్‌ ఖాతాలోని రోజువారి నగదు నిల్వపై వడ్డీ లెక్కిస్తారు). ఈ ఆదేశాలను జారీచేసిన కొద్ది వారాల తరువాత సేవింగ్స్‌ బ్యాంకు వడ్డీ రేటును నియంత్రిత వడ్డీ రేటు పద్ధతి నుండి తొలగించి సరళీకరించాలనే ప్రతిపాదనపై ప్రజా చర్చకు రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ స్వయంగా శ్రీకారం చుట్టారు. వివిధ వర్గాల స్పందనలు మిక్కుటంగా మొదలయ్యాయి. సేవింగ్స్‌ బ్యాంకు వడ్డీరేటు లెక్కింపులో తెచ్చిన మార్పుతో వడ్డీ రేట్ల సరళీకరణ డిపాడిట్‌ దారులకు అత్యధిక ప్రయోజనకరమన్న ప్రచారం హౌరుగా మొదలైంది.
స్పందనలలోని వివిధ కోణాలు

1. ఈ చర్య సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ దారులకు అత్యంత ప్రయెజనకరమైంది. వడ్డీరేట్ల సరళీకరణతో ఏర్పడ్డ ''పోటీ''తో వివిధ బ్యాంకులు పోటీ పడి అత్యధిక వడ్డీరేట్లను ప్రకటిస్తాయి. 2. ఈ చర్య బ్యాంకుల నికర లాభాలను దెబ్బతీస్తుంది. కార్యనిర్వహణ వ్యయంపై అదుపు కలిగిన బ్యాంకులకు మాత్రమే ఈ చర్య ప్రయోజనకరం.

3. అధిక డిపాడిట్లను ఆకర్హించాలనే ఆరాటంతో బ్యాంకులు డిపాజిట్‌ మొత్తాల పరిమాణాల్ని బట్టి వివిధ రకాల వడ్డీరేట్లను నిర్ణయించే అవకాశం ఉంది. ఆచరణలో అత్యధిక మొత్తాలు డిపాజిట్‌ చేయగల డిపాజిట్‌ దారులే ప్రయోజనం పొందగలుగుతారు సామాన్య డిపాజిట్‌ దారులకు ప్రయోజనం అంతంతమాత్రమే. 4. ఈ డిపాజిట్లపై బ్యాంకులు ప్రకటించే వడ్డీరేట్లు ఆ బ్యాంకులకున్న నిధుల లభ్యత (లిక్విడిటి), మార్కెట్లో అమలులో ఉన్న కాల్‌ మనీ రేట్లు, రివర్స్‌ రెపో రేట్లు, సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా నిర్వహణ వ్యయాలపై ఆధారపడి ఉంటుంది. ఏ పరిస్థితులలో నైనా ఈ వడ్డీ రేటు రెపో రేటును (ప్రస్తుతం 5.5%) మించి ఉందడు. 5. ఈ డిపాజిట్లపై వడ్డీరేటు మార్కెట్లో ఏ మేరకు పెరిగితే ఆ మేరకు రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. నయాఉదారవాద విధానాలు అత్యధిక వడ్డీరేట్ల వాతావరణాన్ని అంగీకరించవు. అందువల్ల ఈ వడ్డీరేట్లపై సహజమైన పరిమితులు నెలకొని ఉన్నాయి. 6. నయాఉదారవాద విధానాలతో ఆర్థిక వ్యవస్థ ఒడుదుడుకులు తీవ్రంగా ఉంటుంటాయి. వీటి దుష్ప్రభావాలు సామాన్య, మద్య తరగతి డిపాడిట్‌ దారులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. వడ్డీరేట్లపై కనీస గ్యారంటీ ఉండదు.

ముగింపు

వడ్డీ లెక్కింపు పద్దతిలో తీసుకొచ్చిన మార్పు వల్లనే ప్రధానంగా డిపాజిట్‌ దార్లకు ప్రయోజనం కలుగుతుంది కానీ సరళీకరణ వల్ల కాదు. 2002 సం|| ముందు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాపై 4% వడ్డీరేటు ఉంటే, ఆ తరువాత 3.5%నికి ప్రభుత్వం కుదించింది. వినియోగదారుల ధరల సూచి సంవత్సరానికి 13-14% పెరుగుతూ, హౌల్‌సేల్‌ ధరల సూచి 10% పెరిగిన నేపధ్యంలో వాస్తవంలో సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాపై చెల్లించే నిజ వడ్డీ విలువ కుంచించుకుపోయినప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన ప్రభుత్వానికి అకస్మాత్తుగా సేవింగ్‌ ఖాతా డిపాజిట్‌ దార్లపై పెరిగిన ప్రేమ ఎందుకో శేషప్రశ్నే. వడ్డీరేటు లెక్కింపు పద్దతి మార్చే ముసుగులో వడ్డీ రేట్లను సరళీకరించడం అందులోని ఆంతర్యం. వడ్డీరేట్ల సరళీకరణతో ముడిపడ్డ బ్యాంకింగ్‌ రంగ సరళీకరణ సమాజానికి అనర్ధదాయకమని ఆసియా, అమెరికా, యూరప్‌ దేశాల ద్రవ్య సంక్షోభాలు రుజువు చేసాయి. ఈ చర్చలోని లోతుల్ని మేధావులు విద్యావంతులు క్షణ్ణంగా పరిశీలించాలి. డిపాజిట్‌ దార్ల ప్రయోజనాల్ని శాశ్వతంగా రక్షించే చర్యలు అభిలషణీయం.

Friday, July 2, 2010

బేస్ రేట్ వడ్డీ విధానం - పరిచయం

భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే వివిధ ఋణాలపై వసూలు చేసే వడ్డీ రేటు బి. పి. యల్‌. ఆర్‌. (బెంచ్‌ మార్క్‌డ్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు - నిర్దేశిత ప్రాధాన్యతా ఋణరేటు) ప్రాతిపదికగా ఉన్నది. ఈ బేస్‌ రేటు తొలుత ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్‌బిఐ ప్రకటించింది. కానీ శుక్రవారం (05.03.2010) సాయంత్రం విడుదలైన ఆర్‌బిఐ ప్రకటనలో బేస్‌రేట్‌ జూన్‌ ఒకటి నుంచి అమల్లోకి వుంటుందని సవరించింది. బేస్‌ రేటు విధాన అమలులో ఋణాలపై విధించే వడ్డీ రేటు పారదర్శకంగాను, శాస్త్రీయంగాను ఉండి, వివిధ ఋణ గ్రహీతలకు ప్రయోజన కరంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంకు అభిప్రాయపడింది. అదే సందర్భంలో మన దేశంలో ఫైనాన్షియల్‌ రంగ సంస్కరణల సాఫల్యతకు వడ్డీ రేట్ల సరళీకరణ అనివార్యమని రఘురాజన్‌ కమిటి నివేదికతో పాటు బేస్‌ రేటు విధానంపై రిజర్వ్‌ బ్యాంకు నియమించిన దీపక్‌ మొహంతి నాయకత్వంలోని కార్యనిర్వాహక బృందం సిఫార్సు చేసింది.

వడ్డీ రేట్ల సరళీకరణ ప్రక్రియ -


దీపక్‌ మొహంతి కమిటి పరిశీలనలు- ముఖ్యాంశాలు

బేస్‌ రేటు విధాన రూపకల్పనపై జూన్‌ 2009లో రిజర్వ్‌ బ్యాంకు నియమించిన దీపక్‌ మొహంతి నాయకత్వంలోని కమిటి అక్టోబర్‌ 2009లో తన నివేదికను సమర్పించింది. దాని పరిశీలనలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1. బి.పి.యల్‌.ఆర్‌ - అనుభవం -

1. గత సం|| మొదటి భాగంలో ఆర్ధిక మాంద్య ప్రభావం నుండి ఆర్ధిక వ్యవస్ధను బయట పడవేయటానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టింది. కరెన్సీ చర్యలకు (మానిటరీ మెజర్స్‌) అనుగుణంగా స్పందించడంలో బి.పి.యల్‌.ఆర్‌ పద్దతి విఫలమైందని పై కమిటి అభిప్రాయ పడింది. లిక్విడిటి లభ్యతను పెంచినా, రెపో రివర్స్‌ రెపో రేట్లలో గణనీయమైన మార్పులు చేపట్టినా, వినియోగదారులకు భారీ ఋణ మంజూరులకు బ్యాంకులు సిద్ధం కాకుండా తక్కువ వడ్డీ రేట్లు కలిగిన రిజర్వ్‌ బ్యాంకు సెక్యూరిటీలలో పెట్టుబడికి సిద్ధమయ్యాయి. దానితోపాటు తమ వడ్డీ రేట్లను తగినంతగా మార్చలేదు. ఆ సందర్భంగా బి.పి.యల్‌.ఆర్‌ పద్ధతి వైఫల్యంతో పాటు, ఆర్ధిక వ్యవస్ధపై బ్యాంకులకు ఏర్పడ్డ అవిశ్వాసం కూడా కీలకమైనది. కమిటి ఈ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించలేదు. 2. బి.పి.యల్‌.ఆర్‌ పద్ధతిలో పారదర్శకత లేని కారణంగా, వినియోగదారుడికి ఋణ వడ్డీరేట్ల తీరులో అవగాహన లేకుండా పోయింది. 3. సబ్‌ పి.యల్‌.ఆర్‌ రేటుకు అంటే పి.యల్‌.ఆర్‌ కంటే తక్కువ వడ్డీ రేట్లకు కార్పొరేట్‌ రంగానికి ఋణాలుఇచ్చే వెసులుబాటు ఇవ్వడంతో, బ్యాంకులు రూ. 2 లక్షలలోపు చిన్న ఋణ గ్రహీతలు, వ్యవసాయ దారులను నిర్లక్ష్యం చేశాయి. బ్యాంకు ఋణాలలో 65-70 శాతం ఋణాలు సబ్‌ పి.యల్‌.ఆర్‌ క్రింద మంజూరు చేసినవి. దీనితో బి.పి.యల్‌.ఆర్‌ అస్ధిత్వానికి అర్ధం లేకుండా పోయింది.

2. బేస్‌ రేట్‌ లెక్కింపు విధానం -

1. బేస్‌ రేట్‌ లెక్కింపులో డిపాజిట్‌లపై వ్యయం, రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించే లిక్విడిటి రెపో రేట్ల నిర్వహణకు అయ్యే ఖర్చు, బ్యాంకు నిర్వహణకు అయ్యే ఖర్చు, బ్యాంకు లాభాల మార్జిన్‌ పరిగణలోనికి తీసుకొని బేస్‌ రేట్‌ లెక్కిస్తారు. ఈ బేస్‌ రేట్‌కు ఒక్కొక్క తరహా రంగానికి అయ్యే నిర్వహణ ఖర్చులు అదనంగా చేర్చి వడ్డీ రేట్లను విధిస్తారు. ఈ బేస్‌ రేట్‌ కంటే తక్కువ వడ్డీ రేటుతో సాధారణంగా ఋణాలు మంజూరు చేకూడదు. సం||లోపు కాల పరిమిత గల ఋణాలు బేస్‌ రేట్‌ పరిధిలో ఉండవు. విద్యాభ్యాస ఋణాలకు నియంత్రిత రేట్లు అమలవుతాయి. ఈ రేటు 5 ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు బేస్‌ రేటుకు 200 బేసిస్‌ పాయింట్‌లు కలిపి వడ్డీ రేటును నిర్ణయిస్తారు. 3. రూ. 2 లక్షలకు పైబడ్డ సబ్‌ పి.యల్‌.ఆర్‌. ఋణాలు, రూ. 2 లక్షలలోపు బి.పి.యల్‌.ఆర్‌ సీలింగ్‌ రేటుకు లోబడిన ఋణాలు బేస్‌ రేటు పద్దతిలోనే మంజూరు చేయాలి. దీని వల్ల ఇదివరకు నిర్లక్ష్యం చేయబడ్డ చిన్న ఋణ లబ్ది దారులకు, వ్యవసాయ దారులకు ఋణ లభ్యత అవకాశాలు మొరుగుపడతాయి. 4. ఫ్లోటింగ్‌ రేటు ఋణాలు కూడా బేస్‌ రేటు ప్రాతిపదికనే నిర్వహింపబడాలి. 5. బేస్‌ రేటు పారదర్శకంగా ఉన్న కారణంగా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండే బ్యాంకు ఋణాలను ఎన్నుకొనే అవకాశం పెరుగుతుంది. 6.బేస్‌ రేటు పద్దతిలో వడ్డీ రేటు బి.పి.యల్‌.ఆర్‌ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. 7. సం||లో ప్రతి మూడు నెలలకు బ్యాంకులు బేస్‌ రేటు ప్రకటించాల్సి ఉంటుంది. 8. బేస్‌ రేటు విధానం నూతన ఋణాలకు మాత్రమే వర్తిస్తుంది. పాత ఋణాల రెన్యూవల్‌ సమయంలో వడ్డీ రేట్లపై వినియోగ దారులకు ఆఫ్షన్‌ ఉంటుంది.

ముగింపు - దీపక్‌ మొహంతి కమిటి సిఫార్సులను రిజర్వ్‌ బ్యాంకు అమోదించి అమలుకు పూనుకుంది. కార్పొరేట్‌ రంగానికి ఈ సిఫార్సులు ప్రయోజన కరంగా ఉంటాయి. దేశీయ పొదుపు పై వీటి దుష్ప్రభావం గణనీయంగా ఉండే అవకాశముంది. సామాన్య ప్రజానీకం ఈ సిఫార్సులతో ఏ మేరకు లబ్ది పొందగలరనేది వేచి చూడాలి. సామాన్య ప్రజల ప్రయోజనాలకంటే సమాజానికి హాని కల్గించే ఫైనాన్షియల్‌ రంగ సరళీకరణ ఈ సిఫార్సుల ప్రధాన లక్ష్యం.