Monday, December 21, 2015

'పారిస్‌' మన కొంప ముంచింది

 మేక్‌ ఇన్‌ ఇండియా కోసం ... దేశానికి హాని తెచ్చారు
- విజయం అమెరికాదే.. పేద దేశాలపైనే పెను భారం
- పారిస్‌ ఒప్పందంపై నీటి వనరుల సంరక్షకుడు, మెగాసెసే గ్రహీత రాజేంద్ర సింగ్‌ తీవ్ర అసంతృప్తి
 ప్రపంచ దేశాలను విపరీతంగా భయపెడుతున్న భూ తాపం, పర్యావరణ కాలుష్యం సమస్యలపై ఇటీవల ముగిసిన పారిస్‌ సదస్సులో కుదిరిన ఒప్పందంపై మన దేశంలో నీటి సంరక్షణ దీక్ష వహించిన రాజేంద్ర సింగ్‌ నిప్పులు కురిపించారు. నీటి నిల్వలను కాపాడే విషయంలో ఆయన చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా మెగాసెసే అవార్డు రాజేందర్‌ సింగ్‌ను వరించిన విషయం తెలిసిందే. పారిస్‌ ఒప్పందం వల్ల కాలుష్య ప్రమాదం కన్నా అందుకు ప్రధాన కారణమైన అమెరికాకు మాత్రం చాలా ఎక్కువ ప్రయోజనాలనే సాధించిపెట్టిందని ఆయన ఆరోపించారు. నిజానికి వాతావరణం ఇంత ప్రమాదకరంగా తయారుకావడానికి ప్రధాన బాధ్యత అమెరికాదే, అయినా, ఆ సమస్య పరిష్కారానికి పేద దేశాలతో సహా అన్ని ఇతర దేశాలను ఈ సదస్సు ఒకే స్థాయిలో పరిగణించిందని, బాధ్యతల బరువును అందరి నెత్తిన పడేసిందని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం పారిస్‌ ఒప్పందం అమెరికాకు ఘన విజయాన్నీ, భారత దేశానికి ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, నీటిని పవిత్రమైనదిగాను, అమూల్యమైనదిగాను ప్రేమించి, గౌరవించడం మన సంస్కృతి అన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించిందని తప్పుపట్టారు. 


ఈ సదస్సు జరుగుతున్న సమయంలో పారిస్‌లోనే ఉన్న రాజేందర్‌ సింగ్‌ సదస్సు జరిగిన తీరును పరిశీలించి, గతంలో రియో డీ జెనీరియో, కోపన్‌హాగన్‌, క్యోటో సదస్సుల స్ఫూర్తికి విరుద్ధంగా సాగిందని ఆన్నారు. అమెరికా తన నేరానికి ప్రాయశ్చిత్తంగా దాని పరిష్కారంలో ప్రధాన జవాబుదారీ బాధ్యతను స్వీకరిస్తుందని అందరూ ఆశించారు. కాని ఆ బరువు బాధ్యతలు చివరికి పేద దేశాల నెత్తిన కూడా పడింది. 


దాదాపు 40 వేల మంది పాల్గొన్న సదస్సులో పర్యావరణం గురించి మాట్లాడింది తక్కువ, వ్యాపారపరమైన అంశాలపై జరిగిన చర్చలే ఎక్కువ అని ఆయన అన్నారు. గట్టిగా 400 మంది కూడా లేని ప్రత్యేక బృందం అందరి తరఫున నిర్ణయాలు తీసేసుకుందని రాజేందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఇక ఇండియా విషయానికి వస్తే మన దేశంలోని పారిశ్రామిక రంగానికి చాలా ప్రధానమైన ఇంధనం కోసం బొగ్గు వినియోగానికి అనుమతి సంపాదించడమే లక్ష్యంగా చర్చల్లో పాల్గొన్నదని ఆయన ఎద్దేవా చేశారు. భూసారం గురించి కాని, నీటి వనరుల భద్రత గురించి కాని అక్కడ ప్రధానంగా చర్చ జరగనే లేదని ఆయన అన్నారు. ఇలా విద్యుత్‌ కోసం బొగ్గు వాడకం ప్రమాదకరం అనే విషయంలో ప్రపంచమంతా ఏకాభిప్రాయంతో ఉన్నా మన పాలకులు దానికోసమే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని ఆయన విమర్శించారు.

(21.12.2015 నవ తెలంగాణ పత్రిక నుండి స్వీకరణ)

Tuesday, December 15, 2015

పారిస్‌ ఒప్పందం

పారిస్‌లో నవంబరు29న ప్రారంభమై డిసెంబరు12న ముగిసిన ప్రపంచ వాతావరణ సమావేశం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దాని ప్రకారం 196 సభ్య దేశాలు ఏ ఒక్క కార్యాచరణకూ కట్టుబడనవసరం లేదు. ప్రతి దేశం తను విడుదల చేస్తున్న ఉద్గారాల నియంత్రణ గురించి స్వచ్ఛందంగా నివేదించేలా కట్టుబడనవసరంలేని లక్ష్యాలను నిర్దేశించారు. పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలతో మునక ప్రమాదాన్ని, తీవ్రస్థాయిలో చెలరేగుతున్న తుపానులతో పెను విధ్వంసాలను ఎదుర్కొంటున్న పసిఫిక్‌ మహాసముద్రంలోని 20 ద్వీప దేశాలను, అదనంగా నిధులను ఏర్పాటుచేసి మోసపుచ్చారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో నియంత్రించ వలసిన తాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు బదులు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించాలని గత సమావేశాలలో చేసిన ఈ దేశాల డిమాండ్‌ను చర్చల చివరి దశలో విస్మరించారు. 

పారిస్‌ వాతావరణ సమావేశం ప్రకటించిన ఒప్పందాన్ని సామ్రాజ్యవాద దేశాల నాయకులు అతిగా కీర్తిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌ మీడియా బాకా వూదుతోంది. చారిత్రకంగా భూగోళాన్ని కాలుష్యంతో నింపింది ఈ దేశాలే. అమెరికా అధ్యక్షుడు ఒబామా పారిస్‌ ఒప్పందాన్ని ఒక గొప్ప 'మలుపు'గా అభివర్ణించాడు. 'భూగోళం చరిత్రలో డిసెంబర్‌ 12, 2015 ఒక గొప్ప దినంగా మిగులుతుంది. అనేక శతాబ్దాల కాలంలో పారిస్‌లో అనేక విప్లవాలు జరిగాయి. ఈ రోజు వాతావరణ మార్పుకోసం సంభవించిన విప్లవం అన్నింటికంటే సుందరమైనది, అన్నిటికంటే శాంతియుతమైనది' అని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హోల్లాండ్‌ పేర్కొన్నాడు. ఒకవైపు 'శాంతియుత విప్లవం' గురించి మాట్లాడుతూనే మరోవైపు పర్యావరణ నిరసనకారులపై పోలీసు, మిలిటరీ బలగాలను ఉపయోగించి హోల్లాండ్‌ తన ఉక్కుపాదం మోపాడు.

'ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. కానీ రోగి మరణించాడు' అన్నచందంగా పారిస్‌లో రెండు వారాలపాటు వాతావరణ సదస్సు జరిగిందని చెప్పవచ్చు. హోల్లాండ్‌, ఒబామా, ఇతర పెట్టుబడిదారీ దేశాల నాయకులు పారిస్‌ సమావేశాన్ని రాజకీయంగా నిర్వహించినతీరు గొప్పగా విజయవంతం అయింది. 'మనకున్న ఒకేఒక గ్రహం' భవిష్యత్తు కోసం శ్రమించే పర్యావరణ వాదులుగా ఈ దేశాల నాయకులు పోజుపెట్టటానికి పారిస్‌ సమావేశం ఉపయోగపడింది. అయితే రోగగ్రస్తమైన భూగ్రహం భవిష్యత్తు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో బందీగా ఉన్నంతకాలం ఆందోళనకరంగానే వుంటుంది. ప్రధాన దేశాల నాయకులకు ఏమి కావాలో అది పారిస్‌ సమావేశంలో దొరికింది. ప్రపంచ వాతావరణ క్షీణతను ఏమాత్రం అరికట్టకుండా కొంచెం ఖర్చుతోనే వాతావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్టుగా నటించే అవకాశం ఈ సమావేశం కల్పించింది. స్థూలంగా చెప్పాలంటే పారిస్‌ వాతావరణ సదస్సు ప్రకటించిన ఒప్పందం వాతావరణ మార్పును, భూతాపాన్ని అరికట్టేందుకు చేసింది చాలా స్వల్పం. అనివార్యంగా తీసుకోవలసిన చర్యల గురించి దీనిలో ఆదేశాలు ఏమీలేవు. ఏ ప్రభుత్వమైనా, ఏ కంపెనీ అయినా తప్పనిసరిగా చేయవలసింది ఏమీలేదు.

పారిస్‌ వాతావరణ సదస్సు సాధించిన 'విజయం' ఏమంటే అది 2009లో జరిగిన కోపెన్‌హాగెన్‌ వాతావరణ సమావేశంలాగా బహిరంగంగా విఫలం కాకపోవటమే. అప్పటి సదస్సులో సామ్రాజ్యవాద దేశాలకు, చైనా, ఇండియా, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలకు మధ్య ఏర్పడిన విభేదాలవల్ల అది పూర్తిగా విఫలమైంది. కోపెన్‌హాగెన్‌లో నేర్చుకున్న 'పాఠం'తో సామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాల ఆకాంక్షలను ముందుగానే పసిగట్టి ఎంత బలహీనమైనదైనప్పటికీ ఒక ఒప్పందాన్ని రూపొందించి దానిని ఒక పెద్ద ముందడుగుగా ప్రకటించింది. ఉద్గారాల విడుదలను తగ్గించుకునేందుకు సభ్యదేశాల స్వయం ప్రకటిత లక్ష్యాల ఆధారంగా ఒబామా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని 'అమలు'కు గల ఏకైక యంత్రాంగం ప్రపంచ ప్రజాభిప్రాయమే.

పారిస్‌ ఒప్పందానికి కట్టుబడనవసరంలేని స్వచ్ఛంద స్వభావం వుండటం సానుకూల అంశం అనే అభిప్రాయం కొందరిలో ఉన్నది. ఎందుకంటే అది ప్రయివేటు పెట్టుబడిని, ప్రయివేటు వాతావరణ పరిరక్షణా ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది గనుక. వాతావరణం నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను తొలగించగలిగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి సహకరిస్తామని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వంటి బిలియనీర్స్‌ చేసిన వాగ్దానాన్ని ఒబామా ప్రభుత్వం ప్రశంసించింది. 'మానవ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు మార్కెట్లకు ఈ ఒప్పందం ఒక సూచికవంటిది'అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ-మూన్‌ వ్యాఖ్యానించాడు.
నిజానికి పెట్టుబడిదారీ లాభాల వ్యవస్థకు మారుపేరైన 'మార్కెట్లు' మానవ ప్రగతికి ప్రధాన అడ్డంకిగా వున్నాయి. విధ్వంసకర 'అభివృద్ధి' ద్వారా భూతాపాన్ని ప్రమాదకర స్థాయికి తెచ్చిన అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలే ప్రపంచ సంపదంతా కొద్దిమంది పెట్టుబడిదారీ బిలియనీర్ల చేతుల్లో పోగేసి పెట్టాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికీకరణ కోసం చేసే ప్రతి ప్రయత్నాన్నీ ధనిక దేశాలు భూతాపం పేరుతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూతాపాన్ని పెంచిన దేశాలే ఇప్పుడు తగ్గించేందుకు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ఇందుకు ప్రజల నుండి వత్తిడి పెంచటం తప్ప మరో మార్గం లేదు.


(నవతెలంగాణ -16.12. 2015 తేదీ సంపాదకీయం)

Friday, December 4, 2015

చైనాలో గూగుల్‌ మనగలుగుతుందా?

-(డా.కొండూరి రవీంద్రబాబు)
ప్రస్తుతం చైనాలో విజయం అన్నది ఏ ఒక్కరి సొంతం కాదు. గత కొన్ని దశాబ్దాలుగా లాభార్జనలో వున్న పశ్చిమదేశాల కంపెనీలు ఇప్పుడు వేగంగా మారు తున్న చైనా వాణిజ్య వాతావరణంలో మనుగడకోసం నానా తంటాలుపడుతున్నా యి. గతంలో మాదిరిగా విదేశీ పెట్టుబడిదారులకు తలుపులు తెరచి వుంచేందుకు చైనా ఇప్పుడు సిద్ధంగా లేదు. గతంలో చైనా తన సమాజాభివృద్ధి కోసం అవసర మైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అర్రులు చాస్తున్న రోజుల్లో ఎవరైనా సరే చైనా ప్రభుత్వ విశ్వాసం చూరగొంటే వారికి లాభాల పంట పండిందన్న మాటే. ప్రస్తు తం పరిస్థితి మారింది. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతృప్తికరంగా అందిం చని విదేశీ కంపెనీలు చైనా మార్కెట్‌ నుండి లాభాలను ఆర్జించటానికి ఆయన ఏ మాత్రం అంగీకరించటం లేదు. అనేక అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీలు అండర్‌కవ ర్‌ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు విఫలప్రయత్నం చేశాయి. గూగుల్‌ ఎనలిటిక్స్‌ మినహా ఇతర గూగుల్‌ అప్లికేషన్స్‌ అన్నింటిని చైనా ప్రధాన భూభాగంలో నిలిపివేసింది. గూగుల్‌ అనలిటిక్స్‌ చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా వున్న వెబ్‌సై ట్‌ ఆపరేటర్లందరికీ ఉచిత సేవలను అందిస్తుండటంతో అది మాత్రం మనుగడ కొనసాగించగలుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా మార్కెట్‌ను చేజి క్కించుకునే ప్రయత్నంలో గూగుల్‌ 2006లో చైనీస్‌ సెర్చ్‌ వ్యాపారం ప్రారంభిం చిన నాటినుండి అక్కడి కమ్యూనిస్టు సిద్ధాంతాలను వంటపట్టించుకునేందుకు అత్యధికంగా శ్రమించింది. ఈ ప్రయత్నంలోనే చైనా చట్టాలకు వ్యతిరేకమైన అనేక అక్రమాలకు తెరతీసింది. అశ్లీలత, ఇతర నిషిద్ధాంశాలతో కూడిన పశ్చిమదేశాల సంస్కృతిని చైనాలో ప్రవేశపెట్టటం లేదా గూఢచర్యానికి పాల్పడటం వంటి కార్యకలాపాలను చైనా చట్టాలు పూర్తిగా నిషేధించాయి. ఈ అక్రమాలకు తెరతీసిన గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ కనీసం స్థానికంగా అయి నా సెన్సారింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటంలో విఫలమైంది. ఇన్ని వైఫల్యాల నేపథ్యంలో 2010లో గూగుల్‌ చైనా నుండి నిష్క్రమించింది. 2010లో గూగుల్‌ మార్కెట్‌ షేర్‌ బైదు కన్నా దిగువ స్థాయిలోనేవుంది. 2006 నుండి 2010 మధ్య కాలంలో ఘోర తప్పిదాలకు పాల్పడి చైనా నుండి తప్పుకున్న గూగుల్‌ మరోసారి చైనా భూభాగంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నదన్న వార్తలు వెలువడుతున్నా యి. 2013లో అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థ (ఎన్‌ఎస్‌ఎ) చేపట్టిన మూకు మ్మడి నిఘా కుంభకోణం గుట్టు రట్టయిన నాటి నుండి ఐరోపాలో నియంత్రణ కట్టుదిట్టం కావటంతో గూగుల్‌ సంస్థ ఆదాయం మందగించింది. దీనితో 2016లో మరోసారి చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు ఈ సెర్చ్‌ ఇంజన్‌ ప్రయత్నిస్తోందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.
గూఢచర్యానికి నో ఛాన్స్‌!
చైనాలో గూగుల్‌ ఎనలిటిక్స్‌ ఇప్పటికీ మనుగడ సాగిస్తూ తన వ్యూహాత్మక విలువను పెంపొందించుకోవటం గూగుల్‌ పున్ణప్రవేశానికి కీలకంగా మారు తోంది. చైనా మార్కెట్‌లో ప్రవేశానికి సన్నాహక చర్యలుగా గూగుల్‌ సంస్థ గత ఏడాది చైనాలో చివర .సిఎన్‌ అన్న సంకేతంతో 18 డొమెయిన్‌ పేర్లను గత ఏడాది రిజిస్టర్‌ చేసింది.
(ప్రజాశక్తి 03/12/2015 సంచిక నుండి స్వీకరణ) 

Thursday, December 3, 2015

మోడీ సిలికాన్ పర్యటన, డిజిటల్ ఇండియా


డిబెన్ దాస్ 
ప్రపంచప్రఖ్యాత శాస్త్రసాంకేతిక కేంద్రంమైన  సిలికాన్ వ్యాలీలో  మోడీ పర్యటన, ఆ సందర్భంగా ఆయన ఐటి దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ కంపెనీలను కలవటం లాంటి అంశాలకు మీడియా విపరీతమైన ప్రచార హోరును  కల్పించాయి. ఈ పర్యటనతోనే మోడి భారతదేశ శాస్త్రసాంకేతిక పురోగతిని ఉన్నతసోపానాల నెక్కించినట్లు కార్పోరేట్ మీడియా చిత్రీకరించింది. భవిష్యత్తులో భారతీయులు మరిన్ని స్మార్ట్ ఫోన్లు, అత్యధిక సాంకేతికతపరిజ్ఞానంగల కార్లు, పరికరాలు వాడగలగడం లో సందేహంలేదు. దీనర్ధం భారత దేశం  శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని సాధించినట్లు కాదు. ఇక్కడ ప్రశ్న, ఈ అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులలో( సాఫ్ట్ వేర్ మరియు  హార్డ్ వేర్ రెండూ కలిపి)భారత్ లో తయారవుతున్న ఉత్పత్తులు ఎన్ని?- అని? దాదాపుగా ఏమీ లేదన్నది తక్షణ సమాధానం. ఈ దిశలో మోడీ పర్యటన వల్ల కించిత్తు ప్రయోజనం కలగటంలేదు.


సిలికాన్ వ్యాలీ గా పిలువబడే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో దక్షిణ భాగం, ప్రపంచంలోనే అతి పెద్ద అత్యాధునిక సాంకేతిక కార్పోరేషన్లకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అత్యధిక సంఖ్యలో పేరుగాంచిన సిలికాన్ చిప్ ఆవిష్కర్తలు, తయారీదార్ల ప్రాముఖ్యత తోనే ఆ ప్రాంతం సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది.  స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల కృషితో ఆవిష్కృతమైన నూతన ఉత్పత్తులు, వెంచర్ పెట్టుబడులు, అమెరికా రక్షణ శాఖ వ్యయాలు లాంటి అనేక అంశాలు కలగలిసి ఆ ప్రాంత ఉద్భావనకు కారణాలయ్యాయి. వేలాది శాస్త్ర సాంకేతిక అంకుర పరిశ్రమలు ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు పురుడు పోసికొని  ఇక్కడి నుండే తమ ప్రయాణాన్ని మొదలెట్టాయి. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక శ్రమజీవులు అత్యధికంగా కేంద్రీకరింపబడిన ప్రాంతం ఇదేనెమో! మోడి తన ఉపన్యాసాన్ని శ్రోతలను దృష్టిలో వుంచుకునే మాట్లాడతారన్న అంశం సిలికాన్ వ్యాలి లో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి విదిత మౌతుంది. సాంకేతిక మేధావులు హాజరైన ఆ సమావేశంలో ఆయన తనుగాని,తన పార్టీ గాని, ఆర్ఎస్ఎస్ గాని సామాన్యంగా బహిరంగ సభల్లో  మాట్లాడుతున్నట్లు మాట్లాడలేకపోయారు. ఉదాహరణకు జనవరి 3,2014లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నపుడు  అహమ్మదాబాద్ లో జరిగిన గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ ప్రారంభోత్సవ సమయంలో ప్రస్తావించిన అంశాలను మోడీ ఇక్కడ ప్రస్తావించలేదు. ఆయన అక్కడ ఇలా చెప్పారు,”మనం వినాయకుడిని పూజిస్తుంటాం. వినాయకుడి కాలంలో  మనిషి దేహానికి ఏనుగు తలను అతికించగల ప్లాసిక్ సర్జన్, తన వృత్తిని నిర్వహిస్తూ వుండి తీరాలి. కర్ణుడు తన తల్లి ఉదరం నుండి జన్మించలేదని మహాభారతం చెపుతుంది. అంటే జన్యు శాస్త్రం ఆ కాలానికే అభివృద్ది అయిందని అర్ధం’. విశ్వవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన పురోగతిని అపహాస్యం చేస్తూ, మోడీ బృందం ఈ శాస్త్ర సాంకేతిక పురోగతి వేదకాలం నాడే వుందని నమ్మబలుకుతున్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం వేదశాస్త్రం,జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి నిధులను సమకూరుస్తుందని సమర్ధించుకున్నారు .


కాని సిలికాన్ వ్యాలిలో చేసిన ప్రసంగంలో మోడీ ఈ అంశాలను ఏమీ ప్రస్తావించ లేదు. వేదకాలం నాటి శాస్త్ర సాంకేతిక పురోగమనాన్ని పోల్చుకుంటే, ఆధునిక శాస్త్రసాంకేతికరంగం సాధించలేని ఆవిష్కరణల వేటిని  ప్రస్తావించ లేకపోయారు. దానికి బదులు ఆయన ఇలా అన్నారు,”నూతన ఆలోచనలు ఇక్కడే(సిలికాన్ వ్యాలీలో)తొలి వెలుగును చూడకలిగాయి.” ఒక ప్రక్క, చరిత్రను వక్రీకరిస్తూ, పుక్కిటి పురాణాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ, ప్రజల్లో మత ఛాందసానలను  రెచ్చకొడుతూ,వేద కాలాన్ని కీర్తిస్తూ మోడీ తన దేశ ప్రజల చైతన్య స్థాయిని పురాతన కాలానికి చేర్చదలిచారు. మరోప్రక్క, అత్యాధునిక శాస్త్ర సాంకేతికపరిజ్ఞానం ద్వారా  ప్రజాసమూహాల్ని  సులువుగా చేరుకోగలగడంలో దాని ప్రాధాన్యతను గూర్చి ఆయన ప్రస్తుతిస్తారు.  


మౌలికరంగ ఆవశ్యకత
మోడీ తన ప్రసంగం లో భారత దేశాన్ని డిజిటలైజ్  చేయటంలో తన దార్శనికతను వ్యక్తపరిచారు. “125కోట్ల నా  దేశ పౌరులు   డిజిటల్ గా  అనుసంధిపబడాలని నేను కోరుతున్నాను.” భారత దేశంలో 25 కోట్ల ప్రజలు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. భారత జనాభాతో పోల్చుకుంటే దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువైనప్పటికీ(19శాతం) సంఖ్యా పరంగా చూస్తే అది అత్యధికంగా వుంది. ప్రపంచ దేశాల ఇంటర్నెట్ వినియోగంలో చైనా,అమెరికాల  తర్వాత భారత దేశం మూడవ స్థానంలో వుంది. చైనాలో 64కోట్ల ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తూ, వాళ్ళ జనాభాలో 46 శాతంగా వున్నారు. ప్రపంచ దేశాల మొబైల్ ఫోన్ల వినియోగంలో భారత దేశం చైనా తర్వాత రెండవ స్థానంలో వుంది. 125కోట్ల భారతీయులలో 96కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు వుండగా, 137కోట్ల చైనీయులలో 127కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు వున్నాయి. భారత దేశంలోని ప్రతివారికి మొబైల్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తేవాలంటే, మొదటగా మనకు  దేశ వ్యాప్తంగా విస్తరింపబడ్డ ఫైబర్ఆప్టిక్ సమాహారం,ఫోన్లను అనుసంధించటానికి  కొన్ని టవర్లు లాంటి  మౌలిక సదుపాయాలు కావాలి. ఈ సమాహారం సాధారణ రవాణా వ్యవస్థను పోలివుంటుంది. మనదేశంలో హైవేలు, రోడ్లు, లేన్లు, రైల్వే లైన్లు లాంటి వాటి ద్వారా బస్సులు, కార్లు,ట్రక్కులు, రైళ్ళు, వాహనాలుగా ఉపయోగపడుతూ  ప్రజలను ఒకచోటి నుండి మరోచోటికి చేరుస్తున్నాయి. అదే రకంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ లు డేటాను/సమాచారాన్ని ఒక చోట నుండి మరోచోటకు చేర్చగలిగే వాహకాలుగా వున్నాయి. . హైవేలను నిర్మించటానికి ఎవ్వరూ కార్ల కంపెనీనిగాని, బస్సులకంపెనీనిగాని ఆశ్రయించరు. హైవేలను  నిర్మించితే,వాహనాలు వాటంతటవే తప్పనిసరిగా వస్తాయి. గూగుల్,ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు ఖచ్చితంగా బ్రాడ్ బ్యాండ్ హైవేలను నిర్మించవు. అదేకాకుండా మౌలిక సదుపాయాల నిర్మాణం వాళ్ళ వృత్తి కాదు. టాటా మోటార్స్, మారుతి కంపెనీలు రోడ్లను నిర్మిస్తాయా? ఈ మౌలిక సదుపాయాలను భారతదేశం దానంటతదే నిర్మించు కోవాలి. మరెవ్వరు చేయరు.
జపాన్,జర్మనీ దేశాల్లో 86శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. అలాగని ఆ దేశాదినేతలందరూ ఈ కంపెనీలను కలువలేదు. మొబైల్ ఫోన్లు,ఇంటర్ నెట్ వినియోగదారులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వున్న చైనా, తమ దేశాన్ని డిజిటల్ చైనాగా మార్చటంకోసం గూగుల్,ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్ కంపెనీలను ఆశ్రయించలేదు. గూగుల్,ఫేస్ బుక్,యు ట్యూబ్,ట్విట్టర్ లాంటి  కంపెనీలను తమ దేశం లోకి అనుమతించక పోవటమే కాకుండా, గూగుల్ కు బదులుగా ఇతర సెర్చ్ ఇంజెన్ లను చైనీయులు వాడుతున్నారు. చైనా ప్రజలు వినియోగిస్తున్న ఇంటర్నెట్,ఇ-మెయిళ్ల సమాచారాన్ని చైనా యేతర ప్రపంచానికి  గూగుల్ అందజేస్తుందనేది చైనా లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం. స్నోడెన్ అమెరికా సమాచార వ్యవస్థ బండారాల్ని బయట పెట్టిన తర్వాత గూగుల్, ఫేస్ బుక్, మైక్రిసాఫ్ట్ సేవలను పొందుతున్న ప్రజానీకం పై నిఘా వుంచేందుకు, వారి సమాచారం మొత్తాన్ని అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి అందించేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ , ట్విట్టర్ లను వినియోగించకుండా డిజిటల్ ప్రపంచంలో చైనా ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నది- అందరి ముందున్న పెద్ద ప్రశ్న? గణాంకాలరీత్యా ఈ రంగంలో చైనా పనితీరు చాలా బాగున్నది. సామాజిక మాధ్య  వినియోగదారులలో  అమెరికాలో  ఉత్పత్తి అవుతున్న ఫేస్ బుక్ కు 118కోట్ల వినియోగదారులు కలిగి మొదటి స్థానంలో వున్నది. క్యూక్యూ 83కోట్ల వినియోదారులు కలిగి రెండవ స్థానంలో, క్యూ జోన్ 63కోట్ల వినియోగదారులు కలిగి మూడవ స్థానంలో వున్నాయి. ఈ రెండుసంస్థలు చైనాలో ఉత్పత్తి చేయబడి ప్రధానంగా చైనాప్రజలచే వినియోగింపబడుతున్నాయి. చైనా ఇంటర్నెట్ వినియోగదారులు సగటున రోజుకు 2.7 గంటలు ఆన్ లైన్ లో వుంటారని, ఈ సంఖ్య అమెరికా యేతర అభివృద్ది చెందుతున్న దేశాలకంటే  ఎక్కువగాను, అమెరికా జపాన్ లతో సమానంగానో లేదా ఎక్కువగానో వున్నట్లు ఒక బోస్టన్ కన్సల్టేన్సి బృందం అధ్యనంలో తేలింది.  మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లకు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ కంపెనీలతో అవసరం లేదన్న విషయం మోడీ కి బాగా తెలుసు. కాని ఆయన కార్యాన్ని ఆయన సాధించుకున్నారు. ఆయన మీడియా ప్రచారాన్ని చేజిక్కించుకొని, ఈ ప్రఖ్యాత కంపెనీల సాయంతో తాను ప్రఖ్యాత భారతదేశాన్ని నిర్మిస్తున్నానని కొందరిని నమ్మబలుకుతున్నారు. మౌలిక సదుపాయ కల్పనలో కొంత భాగాన్నిఅందిస్తామని ఆ కంపెనీల ద్వారా చెప్పిస్తున్నారు. మొత్తం దేశానికిఅవసరమైన  మౌలిక సదుపాయ కల్పనలో ఈ కంపెనీలు చివరి అంచున కల్పించే మౌలిక సదుపాయ కల్పన అరకొర లాంటిది. ఈ కంపెనీలు వాగ్దానం చేసిన అంశాల్ని రేఖా మాత్రంగా చూద్దాము. వాళ్ళు చేస్తున్నది వాగ్దానం మాత్రమే,అదికూడా ఖచ్చితంగా ఖరీదు కట్టే వుంటుంది.  


సిలికాన్ వ్యాలిలో ఆయన పర్యటన సందర్భంగా గూగుల్ భారత దేశంలో 500 రైల్వే స్టేషన్లను దత్తత తీసికొని వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని, ఇందుకోసం కొంత మౌలిక సదుపాయ కల్పన చేస్తామని ప్రకటించింది. దీన్ని గూగుల్ ఎలా చేస్తుంది?అని పరిశీలిస్తే, రైల్వేలలో ఇప్పటికే అందుబాటలో వున్న” రైల్ టెల్ “ ఆప్టిక్ ఫైబర్ సమాహారాన్ని తప్పనిసరిగా వినియోగించుకుంటుంది. పెద్ద హైవేల సమీపంలో వుండే ఇళ్ళకు చేరటానికి  కలిపే చిన్న రోడ్లతో ఈ పరిస్ధితిని పోల్చ వచ్చును. అదేకాకుండా గూగుల్ వైఫై పరిజ్ఞానంలో నిష్ణాతులేమీకాదు. వైఫై పరిజ్ఞానంలో నిపుణులైన ఇతర కంపెనీలు చాలా వున్నాయి. మన దేశంలోని కొన్ని విమానాశ్రయాలలో ఉచితంగా వైఫై సదుపాయాన్ని అందిస్తున్నారు. అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. భారత దేశంలో వైఫై కల్పించే కంపెనీలు చాలా వున్నాయి. సాధారణంగా వైఫై  కల్పనకు ఎవ్వరూ గూగుల్ని పిలవరు. ఎందుకంటే అది వాళ్ళ పని కాదుగాబట్టి. భారత దేశ గ్రామాలన్నింటికి  టెలివిజన్ ప్రసార మయ్యేటట్లు వీలుకల్పించటానికి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సుముఖతను వ్యక్తంచేసింది. పెట్టుబడులు పెట్టడమంటే భారత ప్రభుత్వ మద్దతుతో  మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాల వ్యాపారం చేయటమని అర్ధం. మైక్రోసాఫ్ట్  యాజమాన్య సాఫ్ట్ వేర్ మరింతగా వాడటం మూలకంగా మనం లెక్కకుమించిన వ్యయాన్ని ఖర్చు పెట్టాల్సిన విష వలయంలో పడతాము. మైక్రోసాఫ్ట్ కూడా మన దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అది అమెరికా జాతీయ సెక్యురిటి ఏజెన్సీ తో ఒప్పందం కలిగివున్నందున,ఈ డేటా సెంటర్లలో పోగుపడిన సమా చారాన్ని అనివార్యంగా అమెరికా జాతీయ సెక్యురిటి ఏజెన్సీకి తెలియ చేస్తుంది. ఫేస్ బుక్ కూడా తన ఇంటర్నెట్ ను మనకు అందించటానికి తన సంసిద్ధతను వ్యక్త పరిచింది.  దాని ఇంటర్నెట్ పరిమితమైన ఇంటర్నెట్ గానే గుర్తించాలి. ఇంటర్నెట్ లో మనం ఏమి చూడాలో ఫేస్ బుక్ నిర్ణయిస్తుంది. “”తటస్థ నెట్ విధానానికి ఇది వ్యతిరేకం. ఈ కంపెనీ లేమీ మనదేశంలో  చెప్పుకోదగ్గ ఉద్యోగాల్నికల్పించలేవు. కల్పించగలమని వాళ్ళూ చెప్పడం లేదు.  


డిజిటల్ ప్రపంచంపై గుత్తాధిపత్యం
సిలికాన్ వ్యాలికి మోడి సందర్శనను ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి వి మోహన్ దాస్ పాయ్  ప్రస్తుతిస్తూ,”మొత్తం ప్రపంచాన్ని డిజిటల్ గా స్వంతం చేసికోవటం కోసం మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్, గూగుల్ మరియు యాపిల్ లు  కన్నకలలకు మోడీలో సమాధానం దొరికింది.”అని ఆయన సరిగ్గానే చెప్పారు. ఆయన మాటల్లో రెండు సత్యాలున్నాయి. ఒకటి.ఈ కంపెనీలన్నీ డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసంగా వాళ్ళు ఇతరులెవరిని  ఈరంగంలోకి అడుగు పెట్టనివ్వరు. కాని ఈ స్వప్నాన్ని నిజం చేసికోవటానికి వాళ్ళు ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసివుంది. ప్రపంచం లో అతి పెద్ద మార్కెట్ కలిగిన చైనా ఇతరులను  తమ దేశంలోకి అడుగు పెట్టనీయటం లేదు. కొన్ని దేశాల్లో యాజమాన్య సాఫ్ట్ వేర్ వినియోగానికి బదులుగా ఫ్రీ సాఫ్ట్ వేర్,  స్వేచ్చా సాఫ్ట్ వేర్ వినియోగం పెరిగింది. చైనా తర్వాత భారతదేశం రెండవ అతి పెద్ద మార్కెట్ గా వున్నది.అందువల్ల బహుళ జాతి కంపెనీలు ఈ మార్కెట్ పై ఆసక్తిగా వున్నాయి. బహుళజాతి ఐటికంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు పొంద కలుగుతున్నాయి.  మొదటగా భారతదేశం యాజమాన్య సాఫ్ట్ వేర్ వినియోగంలో ఆధిపత్యం కలిగివుంది. ఆచరణలో ప్రభుత్వం, ఐటి దిగ్గజాలు యాజమాన్య సాఫ్టవేర్ కు ఇచ్చినంత ప్రాధాన్యతను   స్వేచ్చా/ఫ్రీ సాఫ్ట్ వేర్ లకు  ఇవ్వటం లేదు.  రెండవ అంశం. భారతదేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీలకు అత్యధిక ఆదాయం అవుట్ సోర్సింగ్ ద్వారానే వస్తుంది. అందువల్ల సాధారణంగా వాళ్ళకు దేశీయ మార్కెట్ పై ఆసక్తి వుండదు. అయినప్పటికీ  అవుట్ సోర్సింగ్ కు వినియోగించే సాఫ్ట్ వేర్ నిర్మాణం అనేక సందర్భాలలో అంత తేలికైన పని కాదు. భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కే ఆ నైపుణ్యం వుంది.కాని మనదేశంలో  నూతన  ఉత్పత్తుల నిర్మాణానికి పెద్ద ప్రోత్సాహం లేదు. బయట నుండి ఎగుమతి అవుతున్న సాఫ్ట్ వేర్  ఉత్పత్తుల స్థానంలో భారతదేశ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకు స్థానం కల్పించాలన్న సంకల్పం భారత ప్రభుత్వానికి లేదు.అవుట్ సోర్సింగ్ ద్వారా పొందకలిగే సత్వర ఆదాయాన్ని   ప్రైవేట్ ఐటి కంపెనీలు నూతన ఉత్పత్తుల ద్వారా పొందలేక పోవటం మూలంగా వాటి ఉత్పత్తిలో ఆసక్తి కనబరచటం లేదు. మూడవ అంశం.ఇతర దేశాల లాగా కాకుండా, బహుళజాతి సాఫ్ట్ వేర్ దిగ్గజాల సహకారంతో  అమెరికా సాగిస్తున్న నిఘా చర్యల్ని స్నోడేన్ బట్టబయలు చేసినప్పటికీ, భారత దేశం వాటినేమీ పట్టించు కోవడం లేదు. చివరి అంశం. భారత ప్రస్తుత  ప్రధాన మంత్రి,  పర్యవసానాలేమైనా భారత మార్కెట్ ను సాధ్యమైనంత త్వరగా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పటానికి సిద్దమయ్యారు. బహుళజాతి ఐటి కంపెనీలకు భారత మార్కెట్, భారత ప్రధాన మంత్రి ప్రీతి పాత్రమైయ్యాయి. అమెరికన్ బహుళజాతి ఐటి కంపెనీల కలలకు మోడీ లో సమాధానం చూడ కలిగారన్న మోహన్ దాస్ పాయ్ ప్రకటనలో రెండవ సత్యం ఇక్కడ దొరుకుతుంది. అమెరికన్ కంపెనీల ప్రయోజనాలకు కొమ్ముగాస్తున్నాయి.  మోడీని అమెరికన్ మీడియా ఆనందంతో కీర్తించటం సర్వ సాధారణమైనది. మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో అదే జరిగింది. కాని మోడీ తన పర్యటనలో ఏమి చేసి ఉండాల్సింది ? దానికి బదులు ఆయన  అనంతమైన  విజ్ఞానాన్ని అందించకలిగే విద్యా సంస్థలు, అపారసంపదను పెట్టుబడిగాపెట్టగలిగే వెంచర్ పెట్టుబడిసంస్థలు,కేంద్రీకరింపబడ్డ నైపుణ్యసమూహాలన్నింటి  పరస్పర సమన్వయంతో అంకుర పరిశ్రమలు వారి ఆవిష్కరణలతో  సిలికాన్ వ్యాలిలో ఎలా వృద్ది కాగలిగాయో అధ్యయనం చేసి వుండాల్సింది. ఆయన సిలికాన్ వ్యాలీ చరిత్రను పరిశీలించి వుంటే, ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేయటంలో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన పాత్ర తెలిసి వుండేది. సాధారణంగా భారత కంపెనీలు నూతన ఆవిష్కరణలకు విముఖంగా వున్న ప్రాంతంలో  నూతన ఉత్పత్తుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు పాత్రకు తగిన ప్రణాళికను మోడీ రచించకలిగే వారు. ఆ దిశలో మోడీ ఏమీ చేయటం లేదు. అనేక సందర్భాలలో మోడీ “భారత్ లో తయారీ”పై ప్రసంగిస్తుండే వారు. అనేక ఆవిష్కరణలు సిలికాన్ వ్యాలిలో చిన్నచిన్న  అంకుర పరిశ్రమల ద్వారానే సాధ్యమైందన్న వాస్తవాన్ని ఆయన అధ్యయనం చేస్తే అర్ధమయ్యేది. “భారత్ లో తయారీ” ప్రణాళిక విజయసాధనకు అటువంటి అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వవలసి వుంది. ఆ రకమైన ప్రోత్సాహాన్ని అందించటానికి తగిన ప్రభుత్వం విధానాలను ఆయన రూపొందించ వలసివుంది.  భారత దేశ ఐటి పరిశ్రమలలో మనం చూస్తున్న అభివృద్ది, సాఫ్ట్ వేర్ పార్క్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్భవించిన ఐటి పరిశ్రమ అనుకూల భారత ప్రభుత్వ పన్నుల విధానం ద్వారానే సంభవించింది.సాఫ్ట్ వేర్ పార్క్ ఆఫ్ ఇండియా క్రింద నమోదైన ఐటి కంపెనీ, అది చిన్నదైనా పెద్దదైనా, భారత్ లో వున్నా లేక పోయిన,అది ఎగుమతులు చేయకలిగితే పన్ను రాయితీలకు అర్హమైవుంటుంది. ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందిన అనేక చిన్న కంపెనీలు భారీ కంపెనీలుగా పరిణామం చెందాయి( ఉదాహరణకు టి సి ఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైనవి). గత యుపియే ప్రభుత్వం ఈ పన్ను రాయితీలను ఉపసంహరించుకుంది. ఈ పరిణామం చిన్న ఐటి కంపెనీలపై అధిక పన్ను భారాన్ని మోపుతూ అసమాన పోటీకి దారితీస్తుండగా, పెద్ద ఐటికంపెనీలు  అధిక పన్ను మినహాయిపులు,అనేక ఇతరరాయితీలను  అందిస్తున్న “ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు” తరలిపోయి అధిక ప్రయోజనాలు పొందకలుగు తున్నాయి.   ఒక్క చిన్న కంపెనీ కూడా ప్రత్యేక ఆర్ధిక మండలిలో 25 ఎకరాల కనిష్ఠ భూమిని కొనకలిగే స్థితిలో లేదు.డి ఎల్ ఎఫ్, షాపూర్జి పల్లోంజీ లాంటి  పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రత్యేక ఆర్ధిక మండళ్లలో కొంత స్థలం అద్దెలకు ఇస్తున్న, వారు డిమాండు చేస్తున్న అత్యధిక అద్దెలు భరించే స్థితిలో చిన్న కంపెనీలు లేవు. ఈ నేపధ్యంలో మోడీ ప్రభుత్వం గత యుపియే ప్రభుత్వం తీసికున్న చర్యలను రద్దు చేసి అంతకు ముందున్న స్థితిని పునరుద్దరిస్తుందా? లేదా భారీ, చిన్న కంపెనీలకు ఒకే రకమైన ప్రభుత్వ రాయితీలను పొందేటట్లు విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా?? లేదు ఆయన అలా చేయరు. కాంగ్రెస్, బిజెపి లది ఒకే రకమైన ఆర్ధిక విధానం. బిజెపికి ఎన్నికలనిధి ఇవ్వకలిగే స్తోమత చిన్న కంపెనీలకు లేదు. అందువల్ల బిజెపి చిన్న కంపెనీలను ప్రోత్సహించే ప్రశ్నే ఉదయించదు. మోడీ ప్రకటించిన “భారత్ లో తయారీ” నినాదం ఆయన ప్రసంగాలలో తప్ప ఆచరణలో లేదు.


మోడీ సిలికాన్ వ్యాలి పర్యటన ఒక ఇచ్చి పుచ్చుకునే ప్రణాళిక. ప్రభుత్వ మద్దతుతో భారత దేశంలో తమ వ్యాపారాన్ని చేసికోమని బహుళజాతి ఐటి కంపెనీలకు మోడీ ఆహ్వానించారు. వాళ్ళు ఆయనకు అత్యధిక ప్రచార హోరును కల్పిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ తమ దగ్గరున్న డేటాను/సమాచారాన్ని అమెరికా జాతీయ నిఘా సంస్థకుఎప్పడికప్పుడు అందచేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా మోడీకి  ఇంటర్నెట్ లో సామాజిక మాధ్యమంలో అత్యధిక ప్రచారాన్ని ఇస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవటం లేదా  ఆలస్యం చేయటం చేస్తున్నారు( తమకు కావలసినది 8 సెకండ్లలో రాక పోతే వినియగాదారులు మరో సైట్ కు మరలిపోతారు).  భారత దేశ  భారీఐటి కంపెనీలకు భారత్ మార్కెట్ కంటే అవుట్ సోర్సింగ్ పై  ఆసక్తితో ఉన్నందున, వాళ్ళు విదేశీ కంపెనీలతో సంబంధ బాంధవ్యాలను పెంచుకొని మనదేశం వెలుపల వారి మార్కెట్ ను విస్తరించుకుంటున్నారు. తమకు సంబంధబాంధవ్యాలున్న బహుళజాతి కంపెనీలను  మోడీ  భారతమార్కెట్ కు ఆహ్వానించటం సహజంగా భారతదేశ  భారీఐటికంపెనీలకు ఆనందంగా ఉంటుంది. ఇందుకోసం భారతదేశంలోకార్పొరేట్లు,కార్పోరేట్ మీడియా ల మద్దతు పొందటంలో మోడీ కి ఎటువంటి సమస్యా లేదు. నరేంద్ర మోడీ కి స్వంత ప్రచారానికి మించి, మన దేశం యొక్క నిజమైన అభివృద్ది సాధన ఆయన ఎజెండాలో వుండే ప్రశ్నే లేదు.

స్వేచ్చానువాదం : కొండముది లక్ష్మీ ప్రసాద్
డిసెంబర్ 2015 మార్కిస్టు సంచికలో ప్రచురింప బడింది  



Saturday, October 31, 2015

రూపాయిని కదిలించే దెవరు?
లోకేశ్వరి ఎస్ కె   
విదేశీ మదుపుదారు’లని వెంటనే మీరనవచ్చు. “వాణిజ్య సమతుల్యత” రూపాయిని అంతకు మించి ప్రభావితం చేస్తుంది.  
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రూపాయి విలువ  ప్రతి వారిని ఉత్కంటకు గురిచేసింది. ఆగస్టు 2013 లో అతి కనిష్టం గా వున్న డాలరుకు రూపాయి విలువ  68 రూపాయలకు జారి పోతుందోనన్న అందోళనను కల్గిస్తూ, పతనం 67రూపాయిల దగ్గర పతనం  ఆగింది. .
పై రెండు సందర్భాలలో పైకి మాత్రం  ప్రపంచవ్యాప్త ఆర్ధిక వ్యవస్థలలొని ఇబ్బందుల వల్ల ఈదుస్థితి ఏర్పడిందనిపిస్తుంది.  అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరిమాణాత్మక సడలింపు కార్యక్రమంలో భాగంగా  వడ్డీ రేటును పెంచుతానని 2013నుండి చేస్తున్న బెదిరింపు అందులో ఒకటి. దీనికి తోడు చైనా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త ఆర్ధిక మందగమనం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
అంతర్జాతీయ మదుపుదారులు ప్రపంచవ్యాప్త పరిణామాలకు అనుగుణంగా మార్కెట్లో అంతర్జాతీయ రాగాలతో తమ పెట్టుబడుల క్రీడలో  రూపాయిని నర్తింపచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాని వాస్తవంలో అది సరి కాదు. రూపాయి చలనానికి,విదేశీ పెట్టుబడుల మధ్య వున్న సంబంధాన్ని విశ్లేషిస్తే, రూపాయివిలువను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయటంలో విదేశీ పెట్టుబడులకు  దీర్ఘకాలిక పాత్ర లేదని బోధపడుతుంది. వాస్తవంలో రూపాయివిలువపై చమురుదిగుమతి ధరల్లో హెచ్చుతగ్గులు, ఎగుమతులవృద్ది లాంటి వాణిజ్య సమతుల్యత కు సంబంధించిన  అంశాలు  అత్యధిక ప్రభావాన్ని కలిగిస్తాయి.
రూపాయి, విదేశీ పెట్టుబడులు
రూపాయివిలువ, సెన్సెక్స్ ల భవితవ్యాన్ని నిర్ణయించేది విదేశీ పెట్టుబడులని కూడా గట్టిగా నమ్ముతుంటారు. కాని ఇది నిజం కాదు. స్వల్పకాలికంగా కరెన్సీ మార్కెట్ సెంటిమెంటు పై విదేశీ నిధుల ప్రభావం వున్నా, వాటిపై దీర్ఘకాలిక ప్రభావం వుండదు. విదేశీ మదు పుదారులైన విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి దారులు, ప్రవాస భారతీయులు గత 5 సంవత్సరాలుగా మన దేశంలోకి గణనీయమైన విదేశీ నిధుల్ని చొప్పిస్తున్నారు. కాని వీటన్నింటి ప్రభావంతో రూపాయి దక్షిణం దిక్కుకే నడుస్తున్నది. 2009 నుండి అనేక సంవత్సరాలలో విదేశీ నిధుల ప్రవేశం భారీగా వుంది. దీని కారణంగా సెన్సెక్స్ భారీగా విజ్రుంభించింది కాని, ఈ కాలంలో రూపాయి విలువ పడి పోయింది.
2014 సంవత్సరంలో మనదేశం అత్యధికంగా విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడుల క్రింద రూ4200కోట్ల డాలర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల క్రింద రూ3400కోట్ల డాలర్లు, ప్రవాస భారతీయుల బ్యాంకు డిపాజిట్ల ద్వారా రూ1100కోట్ల డాలర్ల నిధుల్ని పొంద కలిగింది. సెన్సెక్స్ అత్యధిక స్థాయికి ఎగబ్రాకి, గత సంవత్సరం కంటే 29శాతం వృద్దిని సాధించింది. కాని రూపాయి దాని విదేశీ మారక విలువలో 2.7 శాతం విలువను కోల్పోయింది. 2009 సంవత్సరంలో 1800కోట్ల డాలర్ల విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులు భారత ఈక్విటీ షేర్ ధరలను అతి తక్కువ స్థాయి నుండి పైకి పెంచ కలిగితే,రూపాయి దాని  విలువలో 4శాతానికి మించి పెరగలేదు.       .    
2014లో రూపాయి విదేశీ మారక విలవకు, సెన్సెక్స్ కు మధ్య వున్న సంబంధం +0.01 కాగా,అది 2013లో నెగటివ్ విలువకు దిగజారింది. సెన్సెక్స్,రూపాయి విలువలు రెండూ  పరస్పర ఆధారితాలు కావాని మనం గమనించాలి. విదేశీ నిధులు,రూపాయి విలువల మధ్య వున్న బంధం చాలా బలహీనమైంది.
విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులకు, రూపాయికి మధ్య వున్న సహ సంబంధం 2014, 2013 లలో 0.5 కంటే తక్కువగానే వుంది. దీనర్ధం- భారత దేశం తన ఆర్ధిక వృద్ది, ఆకర్షణీయమైన నిజ వడ్డీ రేట్ల మూలకంగా విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రీతికరమైన గమ్యస్థలంగా  మనగలుగుతున్నది కాని, ఇవేమీ రూపాయివిలువను పెంచేందుకు  దోహదపడటం లేదు. .  
రూపాయి,వాణిజ్య లోటు
అందువల్ల రూపాయి విలువకుకి వచ్చే రోగాలన్నింటిని విదేశీ పెట్టుబడులే నయం చేస్తాయని భావించరాదు. మనం 50సంవత్సరాల రూపాయి చరిత్రను పరిశీలిస్తే అది వ్యవస్థీకృతంగా పతనధోరణిలోవుండి, నికరంగా తక్కువ స్థాయి లోనే కొనసాగు తున్నది.  1973లో 7. రూపాయలకు అమెరికన్ డాలరు ను కొనకలిగేవారం. ఆ రోజుల్లో మార్కెట్లోని గిరాకి సరఫరా లకు అనుగుణంగా రూపాయివిలువను మారనిచ్చే వాళ్ళు కాదు . 90లలో భారత ఆర్ధిక వ్యవస్థను బాహ్య ప్రపంచానికి తలుపులు తెరిచినప్పటి నుండి రూపాయి విలువ భారీ పతనానికి లోనైంది. భారత దేశం యొక్క  వాణిజ్య లోటు నికరంగా కొనసాగటమే, రూపాయివిలువ యొక్క వ్యవస్థీకృత బలహీనతకు ప్రధాన కారణమైంది. వాణిజ్య లోటు లోని మూడు పార్శ్వాలు  రూపాయి విలువలో కదలికను ప్రభావితం చేస్తున్నాయి. అవి 1.చమురు ధరలు  2.బంగారం దిగుమతులు 3. భారీగా పెరుగుతున్న నికర దిగుమతులు.
1. అందులో చమురు ధరలలో మార్పు  గురించి ముందుగా చెప్పుకోవాలి. మన దిగుమతులలో చమురు మూడవ వంతును ఆక్రమిస్తుంది. దీనికి తోడు మనదేశంలో చమురు గిరాకి నికరంగా తగ్గక పోవటం, చమురు ధరలలో భారీగా ఏర్పడుతున్న హెచ్చుతగ్గులు రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
2008-09లో ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగిన కారణంగా చమురు దిగుమతుల విలువ 17శాతం పెరిగిన కారణంగా రూపాయి విలువ భారీ పతనాలల్లో ఒక రికార్డ్ ను  నమోదుచేసింది. 2011-12 లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 46 శాతం పెరిగినప్పుడు, రూపాయి విలువ 6.4 శాతం పతనమైంది. మరోప్రక్క 2013-14నుండి చమురు ధరల్లో సవరణల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినందువల్ల రూపాయి విలువలో పతనం కట్టడిచేయబడింది. పెట్రోలియం,వాటి ఉత్పత్తుల ధరలు 2009లో 93 డాలర్ల నుండి ఇటీవలి 2015 లో 138 డాలర్లకు పెరిగి, రూపాయివిలువ పై మళ్ళీ వత్తిడిని పెంచినాయి.
2. మనదేశ విదేశీ వాణిజ్యంలో బంగారం ధరలు రూపాయి విలువను ప్రభావితం చేయకలుగుతాయి. 2008 సంక్షోభం ఫలితంగా బ్యాంకు డిపాజిట్లు మరియు స్థిర ఆదాయ మదుపులపై  పై తిరోగమన   ఆదాయాలు  రావడంతో, భారతీయులు తమ మదుపును బంగారం లాంటి భౌతిక ఆస్తులల్లో పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు. దీని ఫలితంగా భారతదేశ బంగారం దిగుమతులు 2008-09 లో 2100కోట్ల డాలర్ల నుండి 2012-13లో 5700కోట్ల డాలర్లకు పెరిగాయి. ఈ కాలంలో అత్యధికంగా పెరిగిన  బంగారంరేట్లు దిగుమతుల విలువలను పెంచేశాయి.
2013 కరెన్సీ సంక్షోభం రగలటానికిగల 2012లో 5600 కోట్లకు తీవ్రంగా పెరిగిన బంగారం దిగుమతులు, భారీగా పతనమైన రూపాయి విలువ లు కూడా దోహదపడ్డాయి. పెట్రోల్ కంటే బంగారం వినియోగాన్ని కట్టడి చేయటం తేలికైనందున, 2013లో ప్రభుత్వం బంగారం దిగుమతుల నియంత్రణకు సత్వరం పూనుకోకలిగింది. మళ్ళీ బంగారం దిగుమతుల పై ఆంక్షలు సడలించటంతో,మళ్ళీ బంగారం దిగుమతులు ఊపందుకుంటున్నాయి.
3. ఆర్ధిక సంస్కరణల తొలి సంవత్సరాలలో పెరుగుతున్న దిగుమతుల్ని,ఎగుమతులు కొంతమేరకు సర్దుబాటు చేయకలిగేవి. ఎగుమతుల వృద్ది మందగించటంతో ఈ మధ్య కాలంలో ఇది సాధ్యం కావటం లేదు. వాణిజ్య ఎగుమతుల వృద్ది 2010-11లో వున్న 40శాతం నుండి పడిపోతూనే వుంది. 2015-16లో ఇప్పటివరకు వాణిజ్య ఎగుమతుల విలువ కుంచించుకు పోతున్నది. సర్విస్ రంగంలోని ఎగుమతులు కూడా ఇదే ధోరణిలో వుండి గత 3 సంవత్సరాల మందగమనం తర్వాత 2015-16లలోమరింత  కుంచించుకు పోతున్నాయి. చమురు,బంగారం ధరల్లో కొంత ఉపశమనం వున్నా, గత రెండు సంవత్సరాలుగా రూపాయి విలువ నత్త నడక నడుస్తునేవుంది . విధాన కర్తలు,’భారత్ లో తయారి ‘ప్రచారకులకు  ఈ పరిణామాల పర్యవసానాల ప్రభావం  తీవ్రంగా వుంటుంది. .
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో  కొనసాగుతున్న మందగమన ప్రభావం మన ఎగుమతుల వృద్ది పై తీవ్రంగా వున్నది. భారత  దేశం యొక్క వాణిజ్య ఎగుమతుల్ని పెంచేందుకు ఎంతో చేయాల్సి వుంది.
చమురు,బంగారం ధరలను నియంత్రించ కలిగే అవకాశం వున్నప్పుడు,రూపాయికి కొంత ఉపశమనం వుంటుంది. ఎగుమతుల వేగం తగ్గటం రూపాయి కి బలహీనత గానే భావించాలి. ద్రవ్యోల్బణ దీర్ఘకాలిక చలనం రూపాయి విలువపై ప్రభావాన్ని కలిగి వుంటుంది.టోకు ధరల సూచీ రెండు సంవత్సరాల క్రితం వరకు ప్రభావాన్ని కల్గిస్తునే వుంది. ఈ సూచికి సంబంధించి అనేక సంవత్సరాల సమాచారాన్ని కలిగి ఉన్నాము.టోకు ధరల సూచీ ప్రాతిపదికన ద్రవ్యొల్బణం లో పెరుగుదల  90లలో 20శాతం వద్ద వున్నా, తదనంతర కాలంలో అంతకంటే తక్కువ స్థాయిలోనే  నిర్వహింపబడుతున్నది. 2008,2010లలో సూచీ 19శాతాన్ని తాకినా,అప్పటి నుండి తక్కువ స్థాయిలో వుంటూ,ఒక దశలో ‘0.’కి పతనమై, 2015 లో ప్రతి ద్రవ్యోల్బణ దిశకు చేరేటట్లుంది.అత్యధిక ద్రవ్యోల్బణం కరెన్సీ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. రూపాయిని పటిష్టపరిచే అంశాలలో పతనమవుతున్న ద్రవ్యోల్బణ మొకటి.కరెన్సీ వాణిజ్య పోటీలో ద్రవ్యోల్బణ పతనం రూపాయి విలువను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి, విదేశీ కరెన్సీ తో పోల్చి కొలిచే రూపాయి విలువను ‘వాస్తవంగా ప్రభావితమయిన విదేశీ మారక రేటు(రియల్ ఎఫెక్టివ్ ఎక్ష్చెంజ్ రేటు)’అంటాము. దీన్ని రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తుంది. సెప్టెంబర్ ఆఖరుకు దీని విలువ 110. ప్రస్తుతానికి  10శాతం రూపాయి విలువ పెరిగిందని దీనర్ధం. కాని వాస్తవంగా’ ప్రభావితమయిన విదేశీ మారక రేటు(రియల్ ఎఫెక్టివ్ ఎక్ష్చెంజ్ రేటు)ను, రూపాయి పోటితత్వాన్ని టోకు ధరల సూచీ ప్రాతిపదికన కొలుస్తారు. అందువల్ల దీన్నిప్రామాణికమైన  కొలమానం గా పరిగణించ లేము.  
డాలర్ బంధం
రూపాయి విలువ కదలికల్ని నిర్దేశించే అంశాలలో డాలర్ పటిష్టత మరొక ముఖ్యమైన అంశం. రూపాయి విలువకు సంబందించిన ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే జూలై 2011 నుండి రూపాయి విలువలో తీవ్రమైన తాజా తరుగుదల మొదలైంది. ఈ తరుగుదల, ఎస్ అండ్ పి రేటింగ్ సంస్థ  అమెరికా క్రెడిట్ రేటింగ్ ను ఎఎఎ కంటే దిగువకు తగ్గించి, డాలర్ సూచీ  73 కు పతనమైన సమయంలో సంభవించింది. యూరోజోన్  సభ్యులు బలహీన పడటం వల్ల యూరో బలహీనంగా ఉండటం, అమెరికా ఆర్ధిక వ్యవస్థ వృద్ది లో మెరుగుదల సాధించటంతో డాలర్ మళ్ళీ పుంజుకుంది.అమెరికాలోని  ‘దాదాపు సున్న ‘వడ్డీ రేటు డాలర్ రుణాలకు గిరికీని పెంచింది. ఫలితంగాఅమెరికా మదుపు దారులు  ఇతర దేశాలలో ఆస్తులు కొనడం మొదలెట్టారు ఆగస్టు 2011 తొలినాళ్ళలో డాలర్ సూచీ 30శాతం పుంజుకోగా, ఈ సమయంలో డాలరుకు రూపాయి విలువ  44నుండి 65శాతం వరకు పోగొట్టుకుంది. డాలర్ విలువ పుంజుకోవటం,రూపాయి విలువ తరుగుదలను ప్రభావితం చేస్తుంది.
ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను పెంచటం మొదలెట్టితే డాలర్ అత్యధిక విలువను పొందటం వల్ల రూపాయి మరింతగా విలువను పోగ్గొట్టుకునే ప్రమాదం వుంది
విదేశీ పెట్టుబడుల దిశ నిర్దేశం లో రూపాయి చలనాన్ని అంచనా వేయటం వృధా ప్రయాస. ఈ పరిణామాల దృష్ట్యా ఆస్తుల ధరల్లో తాత్కాలిక ఒడుదుడుకు లున్నప్పటికీ, కరెన్సీ విలువలు ప్రధానంగా విదేశీ వాణిజ్య గణాంకాల పై, ప్రధాన సరుకుల దిగుమతులపై  అత్యధికంగా ప్రభావిత మౌతుంటాయి.
చమురు ఉత్పత్తి దిగ్గజాలు రకరకాల ఎజెండాలతో వున్నకారణంగా కొంత కాలంపాటు చమురు ధరలు మందంగానే వుండవచ్చు. దీనివల్ల రూపాయి కొంత ఉపశమనం పొందాలి. ఈ సంవత్సరంలో తట్టుకోగలిగిన కరెన్సీలలో రూపాయి ఒకటిగా వుంది. చమురు ధరల పతనం వల్ల పొందిన ప్రయోజనంతోనే ఇది సాధ్యమైంది. ఈ కాలంలో బంగారం యొక్క గిరాకి కూడా తగ్గింది. భారత దేశంలో నగలబంగారం గిరాకి పై నిరంతర నిఘా ఉంచాల్సినప్పటికి, బంగారం ధరలు పెరిగే అవకాశాలు అంతగా లేవు. అదుపులో వున్న ద్రవ్యోల్బణం రూపాయికి అనుకూలంగా వుండి ,దాన్ని పటిష్ట పరుస్తుంది కాని, కొనసాగుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనం వల్ల ప్రభావితమయ్యే మన ఎగుమతులు  ప్రస్తుతానికి రూపాయికి ఇబ్బంది కరంగానే వుంటాయి.
అంతర్జాతీయ వాణిజ్యం లో మనం మనలేని పరిస్థితులు ఏర్పడి, అమెరికా ఫెడరల్ రిజర్వు  వడ్డీ రేటు పెంపు ప్రతిపాదనలు అమలైతే , దేశంలోని విదేశీ పెట్టుబడులు భద్రమైన అమెరికన్ డాలరు తో అనుసంధానమైన ఆస్తులకు భారీగా మళ్ళినప్పుడు  రూపాయి ఎదుర్కొనే ఇబ్బందుల్ని సర్దుబాటు చేసికోవటం పెద్ద సవాలుగా వుంటుంది. . అటువంటి స్థితిలో డాలరుకు రూపాయి విలువ  72- 75 కు పడిపోయే ప్రమాదముంది. అదృష్ట వశాత్తు ఇది సంభవించక పోతే, వచ్చే సంవత్సరంలో డాలరుకు రూపాయి విలువ 60-70 మధ్య వుండవచ్చు .  
  (బిజినెస్ లైన్ 18,10.2015 సంచిక నుండి స్వీకరణ)

స్వేచ్చానువాదం :కొండముది లక్ష్మీప్రసాద్  

Tuesday, October 20, 2015

మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటన-
 ప్రచార హోరు కోసం డిజిటల్ వలసవాదానికి ఆహ్వానం 

ప్రబీర్ పురకాయస్థ 

అమెరికా  హైటెక్ ఐటీ పరిశ్రమ కు జన్మస్థలమైన సిలికాన్ వ్యాలీని ఇటీవల సందర్శించినప్పుడు, లాస్ఏంజెల్స్ నందలి శాప్  సెంటర్లో మోడీ  తన స్వంత ట్రేడ్ మార్క్ కల్గిన  హావభావ ప్రదర్శనను అందించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా కంపెనీల సియీఒ ల సమావేశాన్ని, ఫేస్ బుక్ సంస్థాపక అధినేత మార్క్ జుకర్బెర్గ్ టౌన్ హాల్ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ఈ ప్రదర్శన తో ఆయన జతచేశారు. అభాసు పాలైన ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ నమూనాకు  కొత్తరూపమిస్తూ ఫేస్ బుక్  డిజిటల్ ఇండియా కు మద్దతు  క్యాంపెయిన్ సృష్టించటం, భారతదేశంలో గ్రామాలను బ్రాడ్ బ్యాండ్ తో  అనుసంధానిస్తామని మైక్రోసాఫ్ట్  ముందుకు రావటం, 500ల భారత రైల్వే స్టేషన్లలో వైఫై సేవల నందిస్తామని గూగుల్ వాగ్దానం చేయటం' మోడీ పర్యటన మహత్తర విజయాలుగా  భారతదేశంలో వార్తాపత్రికలు మొదటి పేజి హెడ్ లైన్స్ పెట్టాయి. కాని భారతదేశ  డిజిటల్ మార్కెట్ ను హస్తగతం చేసికోవాలనే  ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్,గూగుల్ లాంటి సంస్థల ఆకాంక్షల నంగీకరిస్తూ ఈ పర్యటన సందర్భంగా  మోడీ వేసిన రాజముద్రను ఈ ప్రచార హోరు మరుగున  పెట్టింది.

భారత దేశానికి బ్రిటిష్ వాళ్ళు రాగానే,ఇక్కడి రాజులు,నవాబులు ఎంతో ఉత్తేజితులైనారన్న  వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. ధన సంపాదనకు రెడీమేడ్ వనరు దొరికిందని వారు భావించారు. వాళ్ళ విలాసవంతజీవితంకోసం, క్షీణిస్తున్న జీవన విదానంమార్పు కోసం వాళ్లకు అప్పులివ్వటానికి బ్రిటిష్ వర్తకులు, ఈస్టిండియా  కంపెనీ  స్థానికులతో పోటీ  పడ్డారు.కంపెనీ నుండి తీసికున్న అప్పుల్ని తిరిగి కట్టాల్సిన అవసరంలేదని బహుశా వాళ్ళు భావించి వుంటారు.కాని అంతిమంగా  వాళ్ళ జీవితాలతో పాటు భారత  దేశాన్నే బ్రిటిష్ వాళ్ళకు అప్పగించాల్సి వచ్చింది.

బ్రిటిష్ వాళ్ళు మహా సాగరాలనే అదుపు చేయగలిగి యున్నందున,  రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించకలిగారు.ఈ రోజుల్లో డిజిటల్ మహా సాగారాల్ని నియంత్రించ కల్గిన వాళ్ళు ప్రపంచాన్నే శాసించగలరు. కొద్ది గంటల పాటు కొనసాగే భారతదేశ మీడియాలో 'వైభవం' కోసం గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లాంటి అమెరికా బహుళజాతి సంస్థలకు మోడీ అందిస్తున్న  బహుమానమిదే.
ఇది ఇంతటితో ఆగలేదు. గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ మరియు ఇతర టెలికం కంపెనీలు నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ లోను, పంచ నేత్రాల (యుఎస్,యుకె, కెనడా,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్) ప్రపంచ నిఘా సమాహారంలో పూర్తి భాగమన్న వాస్తవాన్ని స్నోడేన్ ప్రకటనలు తెలియచేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ టెలికం బహుళజాతి సంస్థలైన ఎటి &టి, వేరిజోన్ లతో సహా అమెరికన్ నిఘా ఏజెన్సీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటాయి. ఈ సంస్థల దగ్గర వున్న సమాచారం  మొత్తాన్ని,  అమెరికా నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ  వచ్చే 50సంవత్సరాలపాటు సర్చ్ చేయటానికి,సార్ట్ చేయటానికి,తమ డేటా బ్యాంకుల్లో స్టోర్ చేసికోవటానికి వీలుకల్పించాయి. అందువల్ల అమెరికా బహుళజాతి సంస్థలకు మన సమాచారాన్ని ఇవ్వటమంటే,అతి ప్రధానమైన ఆర్ధిక మూలాధారాలను వాళ్ళకు అప్పగించటంతో పాటు , మన దేశం లోని  ప్రస్తుత,భవిష్యత్ విధాన కర్తలను అమెరికా అతి సన్నిహితంగా పర్యవేక్షించ వీలుకల్పించట మౌతుంది.  

ప్రజోపయోగ సాధనంగా ఇంటర్నెట్ 
అనేక అంతర్జాతీయ వేదికలపై ఇంటర్నెట్ ను ప్రజోపయోగ  సాధనంగా పరిగణిస్తూ భారతదేశం విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. మన దేశ ఇంటర్నెట్ వెన్నెముకను అభివృద్ది చేయటానికి జాతీయ ఆప్టికల్ ఫైబర్ సమాహారం కోసం ఇప్పటికే మనం రూ70,000 కోట్లు ఖర్చు చేసివున్నాం.  బి ఎస్ఎన్ ఎల్ మరియు ఇతరులచే ఇప్పటికే నిర్మించబడ్డ మౌలిక వనరులలోఇది  ప్రధానమైంది. భారత రైల్వే ఇప్పటికే నిర్మించిన ఫైబెర్ ఆప్టిక్ సమాహారమైన రైల్ టెల్ ను గూగుల్,  విస్తృతమై అమలులోవున్న ఫైబర్ ఆప్టిక్ మౌళిక అవసరాలకు,  రైల్వే స్టేషన్లలో స్థాపించే వైఫై అవసరాలతో పాటు,  తమ స్వంత అవసరాలకు  ఉపయోగించ పోతున్నట్లుంది. ప్రజలు ఇంటర్నెట్ ను తమ మొబైల్లకు,కంప్యూటర్లకు కనెక్ట్ చేసికునే చివరి అంచు కనెక్టివిటీ అయిన బ్రిడ్జి ని  మాత్రమె అందించటానికి  ప్రస్తుతం గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లు సిద్ధంగా వున్నాయి. ఇంటర్నెట్ వెన్నెముక నిర్మాణానికి అవసరమైన  అత్యధిక వ్యయాన్ని భారత ప్రభుత్వం భరిస్తుంటే, గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ లు చివరి అంచు కనెక్టివిటీని అందిస్తూ,  భారత ఇంటర్నెట్ మౌళిక సదుపాయాలపై ఉచితంగా స్వారి చేయపూనుకున్నాయి. ఈ సదుపాయం మూలంగా వాళ్ళుఉచిత సేవలు అందించే పేర మన వ్యక్తిగత డేటాలో చొరబడటానికి, వినియోగించు కోవటానికి,అమ్ముకోవటానికి వీలుకల్పించే కీలక స్థానాన్ని  పొంద కలుగుతారు. 

దీనికి భిన్నంగా చైనాలో గూగుల్, మైక్రో సాఫ్ట్,ఫేస్ బుక్ తదితరుల్ని వాళ్ళ మార్కెట్లకు దూరంగా వుంచారు. అమెరికా నుండి కాకుండా పై 10 ప్రపంచ వ్యాప్త ఐ టి కంపెనీలలో 3 చైనా కంపెనీలైన చైనీస్ సర్చ్ ఇంజన్  చైనీస్ బైదు, టెన్ సెంట్స్ మరియు ఆలి బాబా.అమెరికా ప్రత్యర్దులంత ప్రగతి సాధించలేక పోయినప్పటికీ  తన దేశీయ మార్కెట్ ను పరిరక్షించుకుంటూ,ఇంటర్నెట్ మరియు మొబైల్ వ్యాపారాన్ని చైనా సృష్టించ కలిగింది.  చైనా లాంటి ఇంటర్నెట్ లభ్యత కలిగిన మొబైల్ మార్కెట్ కలిగిన దేశాలన్నిటికి, ఆ దేశం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించ కలిగింది. 

మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయసందర్శన  ఒక భాగం. ఫేస్ బుక్ అధినేత జుకర్బెర్గ్ తో కలిసి ఆయన ఇంటర్నెట్ ఆధారిత టౌన్ హాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చేయటం మూలంగా ఆయన ఫేస్ బుక్ ప్రతిపాదనలకు కు సూచనప్రాయంగా ఆమోద ముద్ర వేసినట్లయింది. ఫేస్ బుక్ కూడా ప్రతిస్పందనగా  ఫేస్ బుక్ పేజికి రంగులు మార్చి డిజిటల్ ఇండియాను ఆమోదిస్తూ ప్రజల స్పందనలను అంగీకరించింది.ఫేస్ బుక్ పర్యవేక్షణలో కుదించిన ఇంటర్నెట్ ఏర్పాటుకు జుకర్బెర్గ్ చేసిన ప్రతిపాదనలను టెలికం అధికారులు పరిశీలిస్తున్న సమయంలో, ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ క్యాంపెయిన్ కు నియమ నిబంధనల నెత్తివేయడంతో పాటు, మోడీ, జుకర్బెర్గ్ ల బహిరంగ 'సరసోల్లాసాల' ప్రభావం ఎలా వుంటుందో?చూడాలి.  అంత అత్యున్నత స్థాయి పర్యటనలో, ఫేస్ బుక్ యొక్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ను ట్రాయ్, టెలికం,కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు పరీక్షిస్తున్నసమయంలో , భారత ప్రధాని  భారత టెలికం రూల్స్ ను ఉల్లంఘించటం , నియంత్రణ ప్రక్రియను నీరికార్చటం కాదా?

 జుకర్బెర్గ్ పేదలను  ఇంటర్నెట్ తో అనుసంధానించి వాళ్ళను పేదరికం నుండి బయట వేస్తానంటున్నాడు. ప్రపంచంలో వున్న 100కోట్ల వెబ్ సైట్లలో పేదలు చూడతగ్గవి కొద్ది సంఖ్య మాత్రమే నని, వాళ్ళు ఏమి చూడాలో తాము నిర్ణయిస్తామని, వాళ్లకు కాపలా దారులుగా వ్యవహరిస్తామని ఫేస్ బుక్ యొక్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ప్రతిపాదిస్తున్నది. ఈ సేవలందించి నందుకు గాను, వాళ్ళను  నెట్ న్యూట్రాలీటి  పరిధి నుండి మినహాయించాలిట. ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వేదికను ఫ్రీ సర్వీసెస్ డాట్ ఆర్గ్ గా తిరిగి పేరు మార్చారు.

తమ వేదికను ప్రభుత్వ సేవల వాహకంగా మార్చాలన్న ఫేస్ బుక్ ప్రతిపాదన చాలా అపాయకరమైనది. మరో మాటలో చెప్పుకుంటే ఈ-గవర్నెస్ ఫేస్ బుక్ ద్వారా జరుగుతుంది. అటువంటి ప్రభుత్వ సర్వీసులు మనకు కావాలంటే మనం  ఫేస్ బుక్ దగ్గర నమోదు చేసికొని, మన వ్యక్తిగత డేటాలో చొరబాటుకు ఫేస్ బుక్ కు  వీలుకల్పిస్తూ, వాటి ప్రత్యేక నిఘా సాఫ్ట్ వేర్ ను మన మిషన్ల మీద పెట్టుకోవాలి. ఇకనుండి భారతదేశం, ఫేస్ బుక్ రిపబ్లిక్ కు సామంత రాజ్య మౌతుంది. 

యూజర్ డేటాను సరుకుగా మార్చటం 
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని(యూజర్ డేటా) ప్రకటనదార్లకు (అడ్వెర్టైజర్లు) విక్రయించడమే ఫేస్ బుక్ వ్యాపార నమూనా. అందువల్ల ఎక్కువ డేటాను పొందకలిగితే ఎక్కువ ఆదాయాన్ని ఫేస్ బుక్ పొందకలుగుతుంది. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడి నుండి అది 12.76 డాలర్ల ఆదాయం పొందుతున్నది. 2017 నాటికి ఈ ఆదాయం 17.5 డాలర్లకు పెరుగుతుందని ఆశిస్తుంది. వినియోగదారుల నమోదు ఉత్తర ప్రపంచాన గరిష్టానికి చేరటంతో,  ఫేస్ బుక్ తమ తదుపరి ఇంటర్నెట్ వినియోగ దారుల సమూహం కోసం  తన కేంద్రీకరణను దక్షిణ ప్రపంచానికి మళ్లిస్తున్నది.

మన సమాచారంలో చొరబాటు ఫేస్ బుక్ ప్రధాన అవసరమైంది. అదే దాని వ్యాపారానికి కీలకమైన వనరు. ఫేస్ బుక్ వేదిక పై నిర్వహింపబడే ప్రతి వెబ్ సైట్ లేదా సేవ తన వినియోగదారు సమాచారాన్ని విధిగా ఫేస్ బుక్ కు అందించాల్సివుంటుంది. అందువల్ల ఈ సమాచారాన్ని అది ప్రకటనదార్లకు అమ్మకలుగుతుంది. అటువంటి వేదిక పై  వినియోగదార్ల సమాచారానికి పూర్తి చొరబాటు కలిగివున్న కారణంగా వినియోగదారుల వివరణాత్మక దృశ్యాన్ని పొందకలిగి ఫేస్ బుక్,  వ్యాపార ప్రకటనలను సంపూర్ణంగా శాసించ కలుగుతుంది. ఫేస్ బుక్ పొందే ఆదాయంతో పోల్చుకుంటే, ఆ  వేదిక పై వున్న ఇతరులు పొందే వ్యాపార ప్రకటనల ఆదాయం చిల్లర పైసలే. 


ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ కు సంబంధించి,  ఫేస్ బుక్ సేవా నమూనా లో దాని వినియోదారులకు అతి తక్కవ భద్రత వుంటుంది. మన డేటాను తాజాపరచటం కోసం ఎప్పడికప్పుడు మనం చేస్తున్న దంతా  ఫేస్ బుక్ కు తెలియాల్సిన అవసరం వుంది. అందువల్ల బ్యాంక్ ఖాతాల నిర్వహణలో గోప్యంగా వుంచే పాస్ వర్డ్ లతో సహా అన్నిరకాల భద్రతా చర్యలన్నింటిని అది  దాట వేస్తుంది. ఇంటర్నెట్ లో అధికంగా నిర్వహించే వ్యాపార లావాదేవీలలో మన డేటా పూర్తి భద్రత కోసం పాస్ వర్డ్ లాంటి డేటా భద్రతా చర్యల్ని విధిగా గోప్యంగా వుంచాల్సి వస్తుంది. ఫేస్ బుక్ వేదికలు, బ్యాంకులతో,ఇతర పేమెంట్ గేట్ వే లతో ప్రత్యక్షంగా నిర్వహించే అటువంటి భద్రతా లావాదేవీలను అనుమతించదు. అటువంటి లావాదేవీలను నిర్వహించే వేదికగా అది వున్నప్పుడు, ప్రతి లావాదేవీ మధ్య అది తప్పని సరిగా వుంటుంది.దీనిమూలంగా "ఎ మ్యాన్ ఇన్ మిడిల్ ఎటాక్" లాంటి కంప్యూటర్ ఫిషర్ ఎటాక్ కు వీలుకల్పించబడి, ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఒకే ఒక్క చోట కుప్పకులే ప్రమాదముంటుంది. 

సి ఈ ఓ ల బహిరంగ ప్రకటనలకు ప్రత్యుపకారంగా రైల్వే స్టేషన్లను గూగుల్ కు, గ్రామాలను మైక్రో సాఫ్ట్ కు, భారత దేశ పేదలను  ఫేస్ బుక్ కు అప్పచేప్తూ, మోడీ వినియోగదారుల సమాచారాన్ని సరుకుగా మార్చే వ్యాపారానికి దోహదపడుతున్నారు. అమెరికా బహుళజాతి సంస్థలకు మన వ్యక్తిగత సమాచారం లో చొరబడటానికి ప్రత్యేక హక్కులివ్వడ మంటే మన సమాచారాన్నివాడుకోవటానికి  అమెరికన్ నిఘా ఏజెన్సీలకు  పూర్తీ స్వేచ్చ నివ్వటమే. ఈ దేశాన్ని పాలించటం కంటే మీడియా సూర్యుడిలో ఎండ గాచుకోవటానికి ఇష్టపడే ప్రధాన మంత్రి తన నిష్ఫల వైభవం కోసం ఇదంతా చేస్తున్నట్లుంది. వ్యక్తిగత సమాచారాన్ని సరుకుగా మార్చే ప్రక్రియ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను నడిపించటమే కాకుండా డిజిటల్ వలస పాలనను సుగమం చేస్తుంది.
స్వేచ్చానువాదం: కొండముది లక్ష్మీ ప్రసాద్  

Monday, September 14, 2015

"మేము లొంగం
2002 గుజరాత్ దాడులకు బాధ్యులైన 120మందిని శిక్షార్హుల్నిచేసి  న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న తీస్తా సేతల్వాద్  తో "ఫ్రంట్ లైన్" అనుపమ కటకం ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలు   
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో తీవ్రమైన ఇబ్బందులకు గురౌతున్న వ్యక్తి  తీస్తా సెతల్వాద్.  జ్వలించే కార్యకర్తగా,న్యాయవాదిగా 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయ మందించటం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న  తీస్తా సెతల్వాద్  ఇటీవలి నెలలలో తీవ్రమైన కక్ష్య సాధింపు వేటకు గురౌతున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రధాన నిందితుడుగా వున్న"జాకియా జెఫ్రి కేసు"కు సంబంధించిన  వాదనలు గుజరాత్ హైకోర్టులో  తుది స్థాయికి చేరటంతో తనపై దాడులు ఉధృత మౌతున్నాయని తీస్తా సెతల్వాద్  విశ్వసిస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అయినప్పటికీ, ఇటీవలి కాలంలో సంభవించిన భయంకరమైన మతహింసలో తనపై పడ్డ మచ్చను ఆయన  విజవంతంగా   తుడిపించుకోగలిగినప్పటికీ,  2002 మతహింస బాధితులు కనుమరుగు కాకుండా నిలబెట్టడంలో తీస్తా సెతల్వాద్  నిర్వహిస్తున్న  బృహత్తర ప్రయత్నాలు  నరేంద్ర మోడీ కి కంటకంగానే వున్నాయి. తనను హింసించటం ద్వారా మత ఘర్షణల కేసుల్ని నీరు కార్చడానికి  బాహాటంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. 

మత సామరస్యం కోసం కృషి చేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ అయిన' సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్(సి జె ఐ )" ను ఆమె, ఆమె భర్త జావేద్ ఆనంద్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆ దంపతుల పైన గుజరాత్ పోలిస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)లు అనేక అభియోగాల్ని మోపింది. 
ఇతర అంశాలతోపాటు మత ఘర్షణల సాక్షులను ట్యూటర్ చేస్తున్నారని, గుల్బెర్గ్  సొసైటీ బాధితుల నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు వారిపై బనాయింప బడ్డాయి. 
జూలై నెల తొలిరోజుల్లో నిధుల దుర్వినియోగం కేసులో సిబిఐ ఆమె ఇంటిని, ఆఫీసును సోదా చేసింది. ఫిబ్రవరి నెలలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమెను,ఆమె భర్త ఆనంద్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నించింది. ఆమె ముంబై హైకోర్టు నుండి ముందస్తు బైలును పొందింది. అది సుదీర్ఘ మైన,కష్టతరమైన పోరాటమని ఆమెకు తెలుసు. మోడీ ప్రధాన మంత్రి హోదాలో కేంద్ర ఏజెన్సీల సహకారంతో తనను బాధించ గలడని ఆమె అంటుంది. 
మత ఘర్షణలు జరిగిన గత 13 సంవత్సరాల నుండి  తీస్తా సెతల్వాద్  ,ఆనంద్ కలసి 68 కేసుల్లో పోరాడి 120 మందికి శిక్షలు పడేటట్లు కృషి చేశారు. ఆమె ఎదుర్కొంటున్ననిర్బంధంతో  పాటు, ఆమెకు వివిధ వర్గాల నుండి  మద్దతు వెల్లువెత్తింది. న్యాయం కోసం నినదించే ఏ నిరసనైనా,నినాదమైనా జాతి వ్యతిరేకంగా పరిగణింప బడుతున్నఈ  రోజుల్లో, పౌర బృందాలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మాజీ బ్యూరోక్రట్లు ఆమె తరఫున బహిరంగంగా మాట్లాడుతున్నారు. 
ఫ్రంట్ లైన్  తీస్తా సెతల్వాడ్ తో సంభాషించింది. . తన బాటను విడనాడేది లేదని  ఆమె వ్యక్తం చేసిన కృత నిశ్చయాన్ని ఆమె మాటలలోనే  చూద్దాం
జనవరి 2014 లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ప్రధమ సమాచార నివేదిక(ఎఫ్ ఐ ఆర్) దాఖలు చేసినప్పటి నుండి మీరు నిరంతరం అరెస్ట్ బెదిరింపులను ఎదుర్కొన్నారు, మీ అకౌంట్స్ స్తంభింప బడ్డాయి, మిమ్మల్ని లక్ష్యం చేసికోవటంలో ఉద్దేశ్యాన్ని ఏమని  అనుమానిస్తున్నారు? 
గుల్బెర్గ్  సొసైటీ ఉచకోతలో బ్రతికి బైట పడ్డవారు తమ వ్యక్తిగత ఆస్తుల్ని సముచిత ధరకు అమ్ముకోలేని కారణంగా, దాదాపు 2007-8లోగుల్బెర్గ్  సొసైటీ లో ఒకమెమోరియల్ నిర్మాణం  కోసం నిధుల్ని సమీకరించటానికి  ప్రయత్నించాలని సమిష్టిగా నిర్ణయింప బడింది. సబ్రంగ్ ట్రస్ట్-సిజెపి చెందిన మేము రూ. 4.6లక్షల నిధుల్ని సమీకరించడం తప్ప, మాకు మెమోరియల్ తో ఏ రకమైన సంబంధం లేనందువల్ల, 2012లోసొసైటీ సభ్యులకు ప్రాజెక్ట్ సాధన సాధ్యంకాదని చెప్పాల్సి వచ్చింది.ఏ విధమైన ఒప్పందం పై సంతకాలు చేయబడలేదు, ఏ రకమైన ఆస్తి లేదా దస్తావేజులు చేతులు మారలేదు. ఏ రకమైన కిరాయి కుదర్చబడలేదు, డబ్బులు చేతులు మారలేదు. భారత దేశ సంతతికి చెందిన ఒకరితో సహా, భారతీయులందరూ కలసి రూ.4. 6లక్షల విరాళాలు అందచేశారు.ఆ సొమ్ము  ఇంకా వినియోగింప బడకుండా అట్లానే  వుంది. 
జనవరి 2013 లో మొట్టమొదటగా ఫిర్యాదు చేయబడింది. జనవరీ 2014లో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరమైనా ఇంతవరకు ఛార్జి షీట్ దాఖలు చేయబడలేదు. మా దృష్టిలో ప్రధమ సమాచార నివేదిక ద్వేషపూరితంగా ప్రేరింప బడింది. దీన్ని ఫిరోజ్ సయీద్ ఖాన్ చే దాఖలు చేయబడింది. ఫిరోజ్ సయీద్ ఖాన్ గుల్బెర్గ్ కేసు లో ప్రత్యక్ష సాక్షి సోదరుడు మరియు సొసైటీ నివాసి. కానీ ఊచకోత జరిగిన సందర్భంలో సంఘటన స్థలంలో ఆయన లేడు . సి జె పి మాజీ  ఉద్యోగి ని అదికార వర్గాలు ప్రణాళికా బద్ధంగా వినియోగించుకొన్నారు. ఆయన  నాపై 5 కేసులు బనాయించారు. ఆయన క్రైమ్ బ్రాంచ్ సాక్షి కూడ. 
గుజరాత్ ప్రభుత్వం మమ్మల్ని అగౌరవ పరుస్తూ, పోలిస్ అదుపులో నిర్భందిస్తూ పనికట్టుకొని మమ్మల్ని అపఖ్యాతి పాల్జేస్తున్నట్లుంది.  క్రైమ్ బ్రాంచ్ పరిశోధనాదికారి 2015పిబ్రవరి 2015 న మా ఇంటి ముందు ప్రదర్శించిన పూర్తి స్థాయి తమాషా ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. క్రైమ్ బ్రాంచ్ తన అఫిడవిట్ లో పేర్కొన్న వాదనలకు  వేటికి డాక్యుమెంటరీ ఋజువులు లేవు. ఇంతవరకు ఏ విధమైన అభియోగ పత్రం(చార్జి షీటు) దాఖలు చేయబడలేదు. ట్రస్ట్ నిధులు కాకుండా, మా డబ్బును మేమెలా ఖర్చు పెట్టుతున్నమో తెలిసికొని, మాపై అసభ్యకర ప్రచారానికి పూనుకొని   మా జీవితాల్లో జోక్యం చేసికోవాలనుకునే కుటిల యత్నమిది.  తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్ ముఖ్య నేత హేమంత్ కర్కరేను ఇదే విధంగా హింసించి 2008 నవంబర్ 28న భయంకరంగా చంపేశారు. 
మమ్మల్ని న్యాయపరమైన  చిక్కుల్లోకి స్పష్టంగా నెట్టి, మరో ప్రక్క భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా నిలబెట్టుతూ,  ప్రభుత్వం యొక్క సైదాంతిక చట్రాన్ని సవాలు చేస్తున్న మా ప్రయత్నాలను స్థంబింప చేయటమే వాళ్ళ  ఉద్దేశ్యంగా వుంది. 
సి బి ఐ   మిమ్మల్ని జనవరి 2013 నుండి విచారిస్తూనే వుంది. ఇటీవలవారు మిమ్మల్ని  "జాతికే ఉపదవ్రం" గా అభివర్ణిస్తున్నారు 
 మత సామరస్యం,శాంతి  కోసం కృషి చేసే వారంతా "జాతికి ఉపద్రవం" కల్గించే వారనుకుంటే, మేమూ అటువంటి వారమే. మా పోరాటం,ఆరాట మంతా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిలబెట్టడమే. మన రాజ్యాంగ మౌళిక విలువల్ని నిలబెట్టడం కోసమే మేము కృషి చేస్తున్నాం. జాతికి ముప్పుగా మేము చూడబడటం లేదు. వారసత్వంగా రాజ్యాంగ వ్యతిరేక ప్రాపంచిక దృక్పధం కల్గిన  ఆర్ ఎస్ ఎస్ సారధ్యంలోని  పాలకులకు మాత్రం మేము  ముప్పు గా కనబడుతున్నాం.  విచ్చిన్నకర,ద్వేష రాజకీయాలను విశ్వసిస్తున్న వారికి  మేము ముప్పుగానే వున్నాం. ఈ శక్తులేన్నడూ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఉన్నతమైన నిబద్ధతా నియమాలతో వారికి సంబంధం లేదు. 
మీపై మోపబడ్డ అభియోగాలేమిటి? మీరు ప్రతి అంశంలోనూ సహకరించామని చెప్తున్నారు, కాని వాళ్ళు మీ ఇంటిని/ఆఫీస్ ను దాడిచేసి  సోదా చేశారు. న్యాయపరమైన దృక్కోణంలో ఆలోచిస్తే, ఇవ్వన్నీ చేయటానికి వారికి అధికారం వుందా?
దాడులు,సోదాలతో వారు న్యాయ ప్రక్రియను అతిక్రమించారు. సోదా వారంట్  ను పొందటంలో పోలిస్ అనుసరించిన చర్యల్ని మేము దాన్ని  జారీచేసిన మేజిస్ట్రేట్ ముందు సవాలు చేశాము (సోదాలు జరిపిన 2 రోజుల తర్వాత జూలై 17న వారంట్ జారీ చేసారు), మిమ్మల్ని తప్పుదోవ పట్టించారని మేజిస్ట్రేట్ కు చెప్పాము. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 192-193 కు అనుగుణంగా సి బి ఐ ఎటువంటి చర్యలు అమలు చేయలేదు. రాజ్యంగ హక్కుల పూర్తి ఉల్లంఘన జరిగిందని మేము నమ్ముతున్నాం. మా అభ్యర్ధన పై ఒక నోటీస్ ఇవ్వబడింది. ఆగస్ట్ లో దానిపై విచారణ జరుగుతుంది. మా మీద అనేక అభియోగాలు మోపబడ్డాయి. వాటన్నింటిని ఖండిస్తూ సమాధానాలిచ్చాం. సాధ్యమైనంత వరకు సహకరిస్తూనే వున్నాం. దాదాపు 24000పేజీల పత్రాల్ని మేము సి బి ఐ కి అందించాం. 
సంస్థాపక పత్రాలను బట్టి  సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్","సబ్రంగ్ ట్రస్ట్ "ల ఆశయాలు ఆదర్శాలు విశాల ప్రాతిపదికన విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహించ కలిగేటట్లుగా వున్నాయి. అయినప్పటికీ 2002లో  సి జె పి స్థాపన నుండి సామూహిక నేరాలకు బలైన  బాధితులకు న్యాయ సహాయం అందించట దాని ముఖ్య కర్తవ్యంగా వుంది.  స్కూళ్ళలో ఖోజ్(బహుళ జన భారతానికి విద్య నందించే వేదిక) కార్యకలాపాలకు, ఘర్షణల నివారణ మరియు శాంతి స్థాపనలపై సబ్రంగ్ ట్రస్ట్ ప్రధానంగా కేంద్రీకరిస్తున్నది. గుల్బెర్గ్  మెమోరియల్ విషయంలో నేను ఇంతకు ముందు చెప్పినట్లు నిధులు వసూలు చేయబడ్డాయి. కాని కేవలం రూ4.6లక్షలు మాత్రం వసూలైనందున .ప్రాజెక్ట్ సాధన సాధ్యం కాదని సొసైటీ సభ్యులకు తెలియచేశాం. ఆ డబ్బు కదిలించకుండా ఆట్లానే వుంది. 
న్యాయ సహాయానికి నిధులు వసూలు చేయటం,కార్యక్రమాలు నిర్వహించటానికి సంబంధించి, గుజరాత్ మారణ హోమ బాధితులకు న్యాయ సహాయం అందించటం కోసం  సి. జె.పి భారత దేశం లోనే అపూర్వమైన పాత్రను  నిర్వహించింది. పాలన వ్యవస్థ శత్రుపూరితంగా వున్నప్పటికీ, విచారణ సందర్భంగా బాధితులకు  రక్షణను, స్థైర్యాన్ని కల్పిస్తూ  120 మంది నిందితులకు శిక్షలు పడేటట్లు చూడటం ప్రధానమైంది.  
నాకు,జావేద్ ఆనంద్ కు చెల్లించిన లావాదేవీలన్నీ 'ఫోర్డ్ ఫౌండేషన్', 'ఐక్య రాజ్య సమితి హింసా బాధితుల ఐచ్చిక నిధి'ల  బడ్జెట్ ప్రతిపాదనలకు,అంగీకారాలకు ఖచ్చితంగా లోబడే  వున్నాయి.  
సిజేపి, సబ్రంగ్ ట్రస్ట్లు తిరిగి చెల్లించిన మా వంతు ఖర్చులు ఆ ట్రస్టీలు వివిధ సందర్భాలలో ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా వున్నాయి. జావేద్,నేనూ ఆ సమయాల్లో తీసికున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాము. 
మాకు చెల్లించిన పరిహారాల నుండి మాకు మేము ఖర్చు చేసికుంటున్నామన్న ఆరోపణ వ్యాఖ్యానించటానికే  తగనిది. 
సబ్రంగ్ ట్రస్ట్లు కళా ఖండాల వేలంద్వారా సమీకరించిన నిధులు ప్రారంభంలో చెప్పిన విధంగా మౌలిక కార్యక్రమాలు నిర్వహించటానికి ఉద్దేశింప బడ్డాయి. దీనికి వసూలు చేసిన నిధుల్ని బాధితులకు ఆర్ధిక సహాయంకోసం వినియోగిస్తామని ఎన్నడూచెప్పివుండ లేదు . మేము చేస్తున్న కృషిపై అత్యంత గౌరవం వున్నందున సుప్రసిద్ధ కళాకారులందరూ ఈ  ప్రయత్నాలకు ఉదారంగా  మద్దతునిచ్చారు. 
సిజేపి నిర్వహించిన న్యాయ సహాయ కృషికి లెక్కలు లేవన్న ఆరోపణను పరిశీలిస్తే, సిజేపి నిర్వహించిన న్యాయ సహాయ కృషి,అపూర్వ రీతిలో సాధించిన విజయాలు గుజరాత్ పోలీసులకు తప్ప దేశంలోనూ,విదేశాలలోని  ప్రతి ఒక్కరికి తెలుసు. సిజేపి వార్షిక ఖర్చుల్లో 80-90శాతం ఖర్చులు న్యాయ సహాయానికి, గుజరాత్ లో సిజేపి క్షేత్ర స్థాయి ఆఫీస్ కార్యకలాపాలకు సంబంధించి వున్నట్లు  ఇన్ కమ్ టాక్స్, చారిటి కమీషనర్, హొమ్ మంత్రిత్వ శాఖల అధికారులకు సమర్పించిన సిజేపి వార్షిక ఆడిట్ చేసిన అకౌంట్స్ తెలియ చేస్తున్నాయి. 
నిధుల సమీకరణ గురించి, ఫోర్డ్ ఫౌండేషన్ తో మీకుండే బాంధవ్యాన్ని వివరించగలరా ? 
స్పష్టంగా నిర్వచించుకున్న కార్యకలాపాల పొందిక ద్వారా కులం,మతతత్వం లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సబ్రంగ్ కమ్యునికేషన్స్, "కమ్యూనలిజం కంబాట్" అనే మాస పత్రిక ప్రచురణకు 2004,2006లలో ఫోర్డ్ ఫౌండేషన్ తో కన్సల్టేన్సిఒప్పందాన్ని కుదుర్చుకుంది.  కమ్యూనలిజం కంబాట్ పత్రికతో కాని, సంపాదక/ యాజమాన్య బాధ్యతల నిర్వహణకు జావేద్ ఆనంద్ కు,తీస్తా సేతల్వాడ్కు చెల్లించే పరిహారాలతో ఈ ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదు. న్యాయ నిపుణుల సలహా పొందిన తర్వాతే సబ్రంగ్ కమ్యూనికేషన్స్ కన్సల్టేన్సి ఒప్పదంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం  విదేశీ విరాళాల చట్టం సెక్షన్ 4 నుండి మినహాయింప బడటం వల్ల, దీని క్రింద  స్వీకరించే కన్సల్టేన్సి ఫీజు విరాళం క్రింద గాని, గ్రాంటు క్రింద కాని పరిగణింప బడకపోవటం మూలకంగా చట్ట ఉల్లంఘన క్రిందకు రాదు.
ఈ పరిణామాలు మీ సంస్థ కు, మీ కృషికి ఎంతటి నష్టాన్ని కలిగించాయి?
కొనసాగుతున్న ఒత్తిడి కాకుండా, ఈ పరిణామాలు మా విరాళాల దాతలను భయభ్రాంతుల్ని చేశాయి. అయినప్పటికీ మా మద్దతు దారులు పెరిగారు. పాలక వర్గం బహిరంగంగా మమ్మల్ని ఆహ్వానింప తగని వారుగా వర్గీకరిస్తే,అదొక సందేశాన్ని పంపింది. దాన్ని చాలామంది మౌనంగా స్వీకరించి, మాకు దూరంగా ఉంటున్నారు. దానర్ధం వాళ్ళు మమ్మల్ని ఏ మాత్రం నమ్మడంలేదని కాదు. వాళ్ళని వాళ్ళు రక్షించు కొంటున్నారు. 
లక్ష్యంగా చేయబడింది మీరు,జావేద్,మీ సంస్థే కాదు. గ్రీన్ పీస్, అణు వ్యతిరేక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా పాలక  వర్గ  దాడులకు గురౌతున్నారు  
అది వాస్తవం. ఇతరులపై కంటే మాపై దాడులు తీవ్రమైనవైనా, ప్రజాతంత్ర నిరసనను నోరు నొక్కాలనే విస్తృత ధోరణి లో అదొక భాగంగా వుంది.  మతోన్మాదానికి, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నవారిని ఒక ప్రక్క లక్ష్యం గా చేసికుంటుంన్నారు. మరో ప్రక్క ఫాసిస్ట్ తరహా అభివృద్ది నమూనాను, ప్రజా వనరులను అయినవారికి కట్టబెట్టే ధోరణులను ఎదుర్కొనే వారిని అమానుషంగా మట్టుబెడుతున్నారు. ఈ ఆగడాల్ని తీవ్రంగా ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది. 
సిబిఐ చర్యలు న్యాయ సాధనకు అవరోధంగా వున్నాయని మీరు మీడియా సమావేశంలో చెప్పారు. వివరించగలరా?
 మేము చట్టానికి అతీతులమని అనుకోము. కానీ సక్రమమైన  న్యాయ ప్రక్రియ కోసం ఒత్తిడి చేస్తాం. దుర్బుద్ధితో,దురుద్దేశ్య కరమైన దర్యాప్తులను ప్రశ్నించే హక్కును వుంచుకుంటూ మేము ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నాము. గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన ప్రధమ సమాచార నివేదిక లో ఆర్ధిక అవకతవకల్ని ఆరోపించారు. లిఖిత పూర్వకమైన సాక్ష్యాలను పరిశీలించి సిబిఐ చే దర్యాప్తు చేయించుకోవచ్చును. అటువంటప్పుడు పోలీస్ కస్టడిలోనే మమ్మల్ని విచారించాలని  వారు కోరటంలో అర్ధమేమిటి? 
మేము ఏ చట్టాలను ఉల్లంఘించ లేదు. మేమిక్కడ సహకరించేందుకే వున్నాము. మొట్టమొదట గుజరాత్ అధికారులు ,ఇప్పుడు కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ,సిబి ఐ ల త్రయం మా వ్యక్తిగత స్వేచ్చ లను పరిరక్షిస్తున్నట్లు  మమ్మల్ని పనిలో వుంచుతూ  గత 20నెలలు గడిచి పొయినాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ఇచ్చిన'క్లీన్ చిట్'ను సవాలు చేసినందువల్ల, మేజిస్ట్రేట్ ఆమోదం పొందిన జకియా జఫ్రి రివిజన్ కేసు వాదనల సందర్భంగా గుజరాత్ హైకోర్టు లో నా ప్రమేయాన్ని, నా వ్యక్తిగత హాజరును అడ్డుకునేందుకే  ఇటివల సి బి ఐ మాపై చేసిన అసాధారణమైన దాడి ఉద్దేశ్యింప బడింది. సిబిఐ పంజరంలో చిలకల వ్యవహరిస్తున్నది. రోజువారీ విచారణల తో మమ్మల్ని కట్టి వేసి జాకియా జఫ్రి కేసులో మా కృషి ని నివారించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. 
నిరాఘాటంగా జరిగే సాముహిక మతతత్వ నేరాలకుభారత దేశంలో శిక్షలు లేవని పెట్రేగుతున్న దుష్టసంస్కృతికి , భారత దేశ సుప్రీంకోర్టు నిరంతర పర్యవేక్షణలో, చట్టబద్ధ సంస్థల మద్దతుతో, సి జే పి సమిష్టి కృషితో వెన్ను విరువ బడింది. 1983 నెల్లి ఊచకోతలోగాని,1984 సిక్కుల మారణహోమంలో గాని, 1992-93 బొంబాయిహింస లో గాని మనం న్యాయాన్ని చూడకలిగామా? పటేల్ తెగకు సంబంధించిన  కొంత మంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో సహా 120 మంది ని శిక్షింప కలిగిన మా ప్రయత్నం చారిత్రకమైనది. ఈ విజయాలను మొరటుగా తలక్రిందులు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. 
జాకియా జఫ్రి కేసు తుది దశలో వున్నది. మీ పై జరిగిన దాడి సందర్భం కాకతాళీయమా?     
ఇది కాకతాళీయం కాదు. మేము మొట్టమొదట 2006లో ఫిర్యాదును దాఖలు చేసినప్పుడు జాకియా జఫ్రి పరిణామాలకు సాక్షిగా నిలిచి, దుశ్చర్యలకు నివ్వెర పోయిన ఒక మహిళ. గుల్బెర్గ్ ఊచకోత జరిగిన తర్వాత రాత్రంతా ఆమె పోలిస్ స్టేషన్ లోనే గడిపింది. 'అహమ్మదాబాదు కాల్తుంటే పోలీసులు సెలవులపై వున్నట్లుందని 'ఆమె నాతో అన్న మాటలు  నాకు గుర్తున్నాయి. జరిగిన దుశ్చర్యలు  ఉద్దేశ్యపూర్వకంగా బాహాటంగా చేసినవనే భావన ఆమె మనస్సులో నాటుకొనివుంది. క్రిమినల్ కేసు దాఖలు చేయటానికి ఆ భావన ఒక్కటే సరిపోదు. ఇప్పుడు ఆ దుశ్చర్యలను  ఋజువు చేయటానికి తిరుగులేని సాక్ష్యాలు కలిగి వున్నాము. 
మన దేశంలో గోధ్రా ఎక్కడైనా జరిగివుంటే, దానికి ప్రతీకారంగా మూడు,నాలుగు దాడులు నిస్సందేహంగా జరిగి వుండ వచ్చునని చెప్పగలను. కాని పాలన వ్యవస్థ నిర్వహించాల్సిన పాత్ర ఏమిటి? ప్రశాంతం గా,శాంతియుతంగా వుండమని, ప్రతీకారాలకు, రక్తపాతానికి పాల్పడ వద్దనే స్పష్టమైన అభ్యర్ధనలు ఏమైనా ఉన్నాయా? ఇదే మేము చెప్తుంది. దీనిచుట్టూనే మేము కేసును నిర్మించాము. 
ఈ వాదనలే ప్రజా క్షేత్రంలోకి తిరిగి  వస్తాయని మేము ఆశిస్తున్నాం.కాని అది పాలకులకు రుచించదు."మీరు పిలుచు కొనే "క్లీన్ చిట్" పై మీకంత విశ్వాసముంటే, గుజరాత్ హైకోర్టులో విచారణలో వున్న  క్రిమినల్ రివిజన్ అప్లికేషన్(205/2014) మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంద"ని మేము పాలక వర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అభద్రత గా వున్నారా?
న్యాయాన్వేషణ,కార్యశీలతలు బాహాటంగా  అణచివేతకు గురౌతున్నాయా? నిర్భయమైన కార్యశూరతకు మీరు ప్రతీకలౌతున్నారు. . 
అదే అనుకుంటుంటే, ఆ పిలుపును వినయంగా స్వీకరిస్తాను. న్యాయం కోసం పోరాడేశక్తులకు మేము చెప్పేదేమంటే, " మేము లొంగం". మన ప్రజాస్వామ్యాన్ని ఫాసిస్ట్ తరహా సిద్దాంత వశం కానివ్వమని పూరించే  శంఖారవమిది.  
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల కంటే భయానకంగా వున్నాయి. భారత రాజ్యాంగ  బద్ధ ప్రజాస్వామ్యాన్ని ఆశ్రిత కార్పోరేట్ సారధ్య హిందూ రాజ్యంగా మార్చాలన్న స్పష్టమైన అజెండా తయారయింది. పార్లమెంట్ లో 292 సీట్లున్నప్పటికి ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం విశిష్టమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. భారత  రాజ్యాంగమే అంతింమంగా విశిష్టమైనది. సమానత,సుపరిపాలన తో కూడిన రాజ్యాంగ సూత్రాలకు ఎన్నికలతో ఒనగూడిన  అధికారం యొక్క ఆటవిక ప్రదర్శన ఎన్నడూ ప్రత్యామ్నాయం కాజాలదు. జాతీయంగా కేవలం 31శాతం ప్రజలే ఈ నియంతృత్వ పాలనా వ్యవస్థను సమర్దిస్తున్నారన్న వాస్తవాన్ని మనం నిరంతరం గమనంలో వుంచుకోవాలి.  
గత కొద్ది నెలల నుండి మీకు మద్దతు వెల్లువెత్తు తుంది. కొంత  కాలం పాటు మిమ్మల్ని ఎలక్రానిక్ మీడియా పట్టించుకోలేదు 
 వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతుకు కృతజ్ఞులమై  వుంటాము. దీని ద్వారా  మా శక్తియుక్తులు పునరుజ్జీవనమౌతున్నాయి. అనేక ప్రజా సమూహాలు,సంఘాలు, రాజకీయ పార్టీలు మమ్మల్ని నికరంగా సమర్ధిస్తున్నాయి. మీడియా మమ్మల్ని భారీగా తోసేసింది. ఏక పక్షంగా నష్టం జరిగి పోయిన తర్వాతనైనా ప్రతిస్పందనలను ప్రచురిస్తూ పత్రికా రంగం కొద్ది మేరకు మెరుగ్గావున్నా, ఎలక్ట్రానిక్ మీడియా, పాలక వర్గ సారధ్యంలో కక్షసాధింపు వేటను కొనసాగించింది. ఆ పరిణామాల్ని వివరణాత్మకంగా అధ్యయనం చేయాలన్నా ఒళ్ళు గగుర్పొడుతుంది. సమతుల్యం లేని వార్తా ప్రసారాలు, ఋజువులు లేని ఆరోపణలు,  ఏక పక్ష కధనాలతో కార్పోరేట్ సారధ్య మీడియా  పాలక వర్గాలకిచ్చిన మూర్ఘమైన మద్దతుకు మేము బలిపశువుల మయ్యాం. 
మీరు న్యాయంకోసం పోరాడుతున్నా మన్నప్పుడు , దానర్ధం ఏమిటి?
మేము చేసేది వ్యక్తిగత పోరాటం కాదు, సామూహిక నేరాలకు జవాబుదారీతనం  కోరుతూ  చేస్తున్న పోరాటమిది. గోద్రా ఉదంతం జరిగిన మొదటి  72గంటలే కాకుండా వారాలు,నెలలపాటు రాజ్యంగా వ్యవస్థ కుప్పకూలి అధికారంలో వున్న ప్రభుత్వం చట్టపరంగా జవాబుదారీ అయి, 2002మే వరకు గుజరాత్ అట్టుడిగి పోతూ , కెపిఎస్ గిల్ ను మొదటి ఎన్డియేప్రభుత్వం  పంపేవరకు జరిగిన పరిణామాలు, ప్రజా న్యాయం కోసం జరిగిన పోరాటాలు కావా?
రాష్ట్ర నిఘా విభాగం తీవ్రమైన హెచ్చరికలు చేసినా, స్పందించని పొలీస్, పరిపాలన వ్యవస్థల వైఫల్యాలను , పోలిస్ కంట్రోల్ రూం, మద్దతు కోసం ఇచ్చిన సందేశాలను తిరస్కరించిన  సీనియర్ అధికారుల నిర్లక్ష్యాన్ని   ప్రశ్నించి నప్పుడు- ఇవన్నీ పౌరుల  ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం చేసే చట్టపరమైన చర్యలు కావా??  28.5. 2002 న మేము ఉపయోగించిన జాకియా జఫ్రి  దర్యాప్తు పత్రాలలో భాగమైన అహమ్మదాబాద్ పోలిస్ బ్రిగేడ్ ఇచ్చిన 47 సందేశాల్ని,  బాహాటంగా ఉద్దేశ్యపూర్వకంగా  త్రోసిపుచ్చినప్పుడు, తప్పొప్పులకు బాధ్యులైన పోలిస్ కమీషనర్ పి. సి.పాండే, అడిషనల్ పోలిస్ కమీషనర్ శివానంద్ ఝా ల వైఖరి మనకు ఏం చెప్తుంది? జవాబుదారితనం కోసం చేసే ఈ పోరాటాన్నివిరమించాలా??  మళ్ళీ ఎప్పుడూ చేయకూడదా ???
మీరు,మీ భర్త గడుపుతున్న కష్టతరమైన రోజులనుండి మ్మిమ్మల్ని,మీ భర్తని బయటపడి,రక్షణ పొందమని మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని ఎప్పుడైనా కోరారా? మీరలా చేస్తే ఏమవు తుందో ఆలోచించారా ?
ఇప్పటివరకు మా కాళ్ళ మీద మేమేనిలబడి, తీవ్రమైన వ్యక్తిగత నష్టానికి ఓర్చి  పోరాటం చేస్తున్నాము. మమ్మ్మల్ని నిలబెట్టిన ఈ స్థైర్యం  వీడదని  ఆశిస్తున్నాము. 

Saturday, July 25, 2015

గుజరాత్ కొమ్ముకాస్తూ దాచబడ్డ శిశు పౌష్టికాహార లోప సర్వే సమాచారం


-అమిత్  సేన్ గుప్తా 
వివాదాలతో, కుంభకోణాలతో గొంతు వరకు కూరుకుపోయిన ఎన్డియే ప్రభుత్వం అరుదైన మరో ఘన విజయాన్ని సాధించింది! కేంద్ర ప్రభుత్వ సహకారంతో యూనిసెఫ్(ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ శిశు అత్యవసర నిధి ) శిశుఆరోగ్యం పై నిర్వహించిన సర్వే పరిశీలనల్ని దాచటానికి ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుందని ఇటీవల 'ఎకనమిస్ట్' పత్రిక మొట్టమొదటగా  ప్రచురించింది . 2013, 2014సం. లకు సంబంధించిన  శిశు పౌష్టికాహార లోపం పై సమాచారాన్ని సేకరించదంకోసం యుపియే ప్రభుత్వం శిశువుల పై రాపిడ్ సర్వేకు(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్ -ఆర్ ఎస్ వొ సి ) ఆదేశించింది.

దాదాపు గత దశాబ్ద కాలంలో శిశు పౌష్టికాహారం పై మొట్ట మొదటగా నిర్వహిస్తున్న సర్వే కావటం వల్ల , సాధారణంగా విధాన నిర్ణయాలలో ఈ సర్వేసమాచారాన్ని  ఒక ముఖ్య సాధనంగా వినియోగించుకుంటాం .అప్పటివరకు 2005లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ )  పరిశీలనలు  శిశు పౌష్టికాహారం పై సమాచారం పొంద కలిగే చివరి వనరుగా వుండేవి. శిశు పౌష్టికాహార లోపంపై నిర్వహించిన యూనిసెఫ్ సర్వే  పరిశీలనల్ని దాచటంలో ఒక చమత్కారం వుంది. గత దశాబ్ద కాలంలో భారత దేశంలో పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లుగా ప్రశంసించ తగిన సమాచారాన్ని యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తెలియచేస్తున్నది. అక్టోబర్2014 లోనే సర్వే తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినప్పటికీ,  ఇంతవరకు ఆ నివేదికను ప్రభుత్వం బహిరంగ పరచలేదని 'ఎకనమిస్ట్' పత్రిక ఆరోపిస్తున్నది. 

శిశు పౌష్టికాహార లోపంలో తగ్గుదలను సూచిస్తున్నయూనిసెఫ్ సర్వే 
గత దశాబ్ద కాలంలోస్థూలంగా భారత దేశంలో శిశు పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లు  సర్వే తెలియచేస్తున్నది.
 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2005) లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల(5సం.లోపు)శాతం, వరుసగా 48,20,43 వుండగా, యూనిసెఫ్ సర్వే(2014) లో వరుసగా 39,15,29 గా వుంది. (మూలం: ఎకనామిస్ట్ పత్రిక )

1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వే ల మధ్య తగ్గిన తగ్గుదల కంటే యూనిసెఫ్ సర్వే లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 9,5,14 శాతం పాయింట్లగా  వుండి . 1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలోతగ్గుదల కంటే గణనీయంగా తగ్గాయి. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలో1998 నుండి 2005 మధ్య కాలంలో  గిడసబారిన(స్టంటింగ్) శిశువులు, బరువుతగ్గిన(అండర్ వెయిట్) శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 6, 3 శాతం పాయింట్లు వుండగా, ఇదే కాలంలోశుష్కించిన( వేస్టింగ్) శిశువులు  వాస్తవంలో 3శాతం పాయింట్లు పెరిగారు. పైన పేర్కొన్న ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేను, యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తో   పోల్చేటప్పుడు ఒక  హెచ్చరికను మనం గమనంలో ఉంచుకోవలసివుంది. ఈ రెండు సర్వేలు వైవిధ్యం కలిగిన  జనాభా పొందికలను,  లెక్కింపు ప్రక్రియలను కలిగి ఉన్నందున, వీటిని ఏ విధంగాను పోల్చలేము. అయినప్పటికీ యూనిసెఫ్ సర్వే సూచించిన గత దశకంలోని గణనీయమైన తగ్గుదల  పౌష్టికాహార లోపంలోని వాస్తవ తగ్గుదల రేట్లను సూచిస్తున్నది. 

గిడసబారటం(స్టంటింగ్), శుష్కించటం(వేస్టింగ్), బరువు తగ్గటం(అండర్ వెయిట్) లాంటి లక్షణాలు శిశువులలో పౌష్టికాహార లోప కొలమానాలుగా వుండి,  పౌష్టికాహార లోపం యొక్క మూలాలలోని  వివిధ అంశాల్ని వివరిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచికల ప్రభావాల్ని ఇలా వివరిస్తున్నది. స్టంటింగ్ అంటే గిడసబారటంగా పరిగణిస్తాము. దీనర్ధం వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం. శిశువుల పుట్టుక ముందు నుంచి వారిలో పేరుకున్న పౌష్టికాహార లేమిని, క్రిమిదోషకాల(ఇన్ఫెక్షన్) బారిన పడ్డ ప్రభావాన్ని, వారి తల్లులలో తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని శిశువులలో గిడసబారిన బాధితుల శాతం  తెలియచేస్తుంది.  శిశువులను పెరగనీయ కుండా దీర్ఘకాలంగా అదిమిపెట్టిన పెరుగుదల సామర్ధ్యాన్ని, కొనసాగుతున్న అధ్వాన్నపరిస్థితులకు  కొలమానంగా ఈ సూచికను పరిగణించ వచ్చును. శిశువులలో ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటాన్నిశుష్కించటం( వేస్టింగ్) అంటాము. శిశువులలో వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం(గిడసబారటం), ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటం  (శుష్కించటం )కలగలిసిన స్థితిని బరువు తగ్గటం(అండర్ వెయిట్) అంటాము. క్లుప్తంగా చెప్పుకుంటే, బరువు తగ్గట మంటే గిడసబారటం, శుష్కించటం ల కలగలిసిన లక్షణం. ఈ స్థితి తీవ్రమైన బరువు లోపాన్ని తెలియచేస్తుంది.'గిడసబారటం' తీవ్రమైన పౌష్టికాహార కొరతకు మెరుగైన సూచిక కాగా, ఇటీవలే తలెత్తిన ఆహార కొరత, తీవ్ర అస్వస్థల మూలంగా ఏర్పడ్డ పౌష్టికాహార లోపానికి 'శుష్కించటం' సూచికగా వుంటుంది.