Sunday, November 8, 2009

మన్నికయ్యే అభివృద్ధి

పెట్టుబడిదారీ ప్రపం చీ కరణ సృష్టించిన ఆర్థిక, సామాజిక అసమాన తలకు తోడుగా, పర్యావరణ మార్పు దుష్ప్రభావాలు ప్రపంచ మానవ జాతిని వణికిస్తున్న నేపథ్యంలో ''వివిధ అభివృద్ధి నమూనాల'' చర్చలు తెరపైకి వస్తున్నాయి. యుయన్‌డిపి నేతృత్వం లోని ''మానవాభివృద్ధి భావన''(హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌), యూరప్‌ నమూనాగా ప్రాచుర్యం పొందిన ''ఇముడ్చు కోగలిగే అభివృ ద్ధి''(ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌), విశ్వమానవ సిద్ధాంతంగా పిలవబడుతున్న ''సమానత్వ అభివృద్ధి''(ఇక్విటబుల్‌ డెవలప్‌మెంట్‌) సరసన, కొపెన్‌హగెన్‌ ''పర్యావరణ పరిరక్షణ'' చర్చల ప్రభావంతో ''మన్నికయ్యే అభివృద్ధి''(సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌) ప్రాధాన్యతను సంతరించుకున్నది.

చారిత్రక నేపథ్యం: ఐక్యరాజ్య సమితి నియమించిన ''పర్యావరణ మరియు అభివృద్ధి'' ప్రపంచ కమీషన్‌ బ్రన్డ్‌ట్లాన్డ్‌ కమీషన్‌గా 1987లో ''మన సమిష్టి భవిష్యత్‌''పేర ''అభివృద్ధిపై పర్యావరణ ప్రభావాలను'' విశ్లేషిస్తూ నివేదికను సమర్పించింది. అంతర్జాతీయ అసమానతలు, పేదరిక మూలాల్ని స్పృశించకుండా పర్యావరణ దుష్ప్రభావాలను నివారించే ప్రయత్నాలు వ్యర్ధమని చెప్తూ, నివేదిక ''మన్నికయ్యే అభివృద్ధి'' భావనను మొదటిసారిగా పరిచయం చేసింది. 1992లో నిర్వహించబడ్డ ''రియో భూగోళ సదస్సు''లో, పర్యావరణ మార్పు ముప్పుతో అభివృద్ధిపై వ్యక్తమవుతున్న వివిధ దేశాల భయాందోళనలను నివారించే ప్రయత్నంలో భాగంగా ''మన్నికయ్యే అభివృద్ధి'' సాధనకు ఒక కమీషన్‌ నియమింపబడింది. అప్పటి నుండి పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలు అంతర్జాతీయ పర్యావరణ చట్టాల్లో చోటు చేసుకోవటంతోపాటు, 2002లో జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ భూగోళ సదస్సు ''మన్నికైన అభివృద్ధి''పై ప్రత్యేకంగా చర్చించి, కార్యాచరణల్ని రూపొందించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ''మన్నికయ్యే అభివృద్ధి ప్రపంచ కమీషన్‌'' ఈ కార్యాచరణల్ని వార్షికంగా సమీక్షిస్తుంది. ఈ కమీషన్‌ 17వ సమావేశం మే 2009లో న్యూయార్క్‌లో జరిగింది.

మన్నికైన అభివృద్ధి అంటే?: పైన పేర్కొన్న వివిధ సదస్సుల్లో రూపొందిన భావనను బట్టి సారాంశంగా ''భవిష్యత్తరాల అవసరాలు తీర్చగలిగే సామర్ధ్యాలపై ఎటువంటి రాజీ లేకుండా, ప్రస్తుత తరాల అవసరాల్ని తీర్చగలిగే అభివృద్ధే'' మన్నికైన అభివృద్ధిగా నిర్వచిస్తున్నారు. మన్నికను విస్తృతార్ధంలో భరించగల సామర్ధ్యంగా చెప్పుకుంటాం. అందువలన పర్యావరణ పరిరక్షణ, సామాజిక, ఆర్ధికాభివృద్ధులు ''మన్నికయ్యే అభివృద్ధి''కి మూడు మూలస్థంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరాధారితాలై, వాటి సమన్వయ సాధనే మానవ మనుగడ లక్ష్యాలుగా మారుతున్నాయి. మన్నికయ్యే వ్యవసాయం, మన్నికయ్యే పరిశ్రమలు, మన్నికయ్యే ఆర్ధికాభివృద్ధులు, పర్యావరణ పరిరక్షణకు లోబడి జరిపే సమిష్టి సాధనే ''మన్నికైన అభివృద్ధి'' అవుతుంది.

అవాంతరాలు: మన్నికయ్యే అభివృద్ధి కార్యాచరణ రూపొందినా పెట్టుబడిదారీ విధాన చట్రంలో ఆచరణలో అది సఫలీకృతమవటం లేదు. ఒక వైపు ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యంలోని నయా ఉదారవాద విధానాలు సామాజిక, ఆర్ధిక అంతరాల్ని తీవ్రంగా పెంచుతుండగా, మరోవైపు శిలాజ ఇంధనాల విచక్షణా రహిత వినియోగం పర్యావరణ ముప్పుకు కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని పెంచుతున్నది. లాభార్జనే ధ్యేయంగా సంపన్న దేశాలు, సంపన్న వర్గాలు బాహాటంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియల మూలకంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ఇంధన సంక్షోభం, ద్రవ్య సంక్షోభం, ఆర్ధిక మాంద్యం, పర్యావరణ సంక్షోభాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 కోట్ల జనాభా పెరుగుతూ, 96.3 కోట్ల మంది ఆకలితో, పౌష్టికాహార లేమితో అలమటిస్తున్నారు. మన్నికయ్యే అభివృద్ధిలో వ్యవసాయాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి సముచిత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం అనివార్యమయింది.

No comments: