Tuesday, November 24, 2009

కార్బన్‌ ట్రేడింగ్‌ పరిచయం

సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో త్వరితమైన పారిశ్రామికీకరణ కీలకమైంది. విద్యుత్‌, స్టీల్‌, జౌళీ, ఎరువులు తదితర పరిశ్రమలలో వాడుతున్న బొగ్గు, సహజవాయువు, పెట్రోలియంలాంటి శిలాజ ఇంధనాలు, పెరిగిన వినిమయ సంస్కృతి, అడవుల నరికివేత కారణంగా భూ వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్‌(బొగ్గుపులుసు వాయువు), మీథేన్‌, నైట్రస్‌ఆక్సైడ్‌, హైడ్రో, ఫ్లోరో కార్బన్‌లాంటి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల(గ్యాస్‌ ఎమిషన్స్‌) మితిమీరింది. వీటి కారణంగా భూగోళం వేడెక్కి(గ్లోబల్‌ వార్మింగ్‌) మానవాళికి ముప్పు కలిగిస్తున్న ఎల్‌నినో, అకాల వర్షాలు, ఆమ్లవర్షాలు, దీర్ఘకాలిక కరువులు, భూగర్భ నీటి మట్టాలు తగ్గిపోవటం, మంచుకొండలు కరగటం, నదులు, సముద్రాలు పొంగటం లాంటివి సంభవిస్తున్నాయి.

గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలను అదుపు చేయటానికి 1990 మొదటి భాగంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సదస్సులో అంతర్జాతీయ ప్రయత్నాలు మొదలయ్యాయి. 1997లో 170 దేశాలు ఆమోదించిన క్యోటో ఒప్పందం(అమెరికా సంతకం చేయలేదు) గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించటానికి వివిధ దేశాలకు కోటాలు(క్యాప్స్‌) నిర్ణయించింది. 2008 నుండి 2012 సం||లలో 1990సం||లోని కార్బన్‌ వాయువుల స్థాయి నుండి 5.2% తగ్గించాలని నిర్ణయించారు.

తాజాగా 2009 జూలై 17న ఇటలీలో జరిగిన 17 దేశాల సదస్సు పార్రిశ్రామికీకరణకు ముందుగా వున్న ఉష్ణోగ్రత కంటే 2 సెల్సియస్‌ డిగ్రీలు మించి ఉష్ణోగ్రత ఉండరాదని నిర్ణయించాయి. 2050 నాటికి గణనీయంగా కార్బన్‌ వాయువిడుదలను నియంత్రించాలన్నాయి. క్యోటో ఒప్పందం చట్టబద్ధమైంది. ఈ ఒప్పందంలో భాగంగా కార్బన్‌ వాయువుల అదుపుకు వివిధ దేశాలకు విధించిన కోటాలను సాధించటం కోసం కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియను క్యోటో ఒప్పందం ఆమోదించింది.

కార్బన్‌ ట్రేడింగ్‌ అంటే : భూ వాతావరణంలో అత్యధిక స్థాయిలో కార్బన్‌ వాయువిడుదలలో అభివృద్ధి చెందిన దేశాల పాత్ర ప్రధానమైంది. ప్రపంచజనాభాలో అయిదుశాతంగా ఉన్న అమెరికా ప్రపంచ కాలుష్యంలో 26శాతానికి కారణ భూతమైంది. అంతర్జాతీయ ప్యానల్‌ లెక్కల ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువులు విడిచిపెట్టే దేశాలలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా 91వ స్థానంలోనూ, భారత్‌ 124వ స్థానంలోనూ ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండం తరువాత యూరప్‌ దేశాలు ప్రపంచ కాలుష్య స్థావరాల్లో ప్రసిద్ధికెక్కాయి.

క్యోటో ఒప్పందం ప్రకారం ఒక అభివృద్ధి చెందిన దేశంకానీ, దానిలోని పరిశ్రమకానీ(అధిక కార్బన్‌ వాయు విడుదలలు కలిగిన దేశం), తక్కువ కార్బన్‌ వాయు విడుదలలు కలిగిన దేశంతో కానీ దానిలోని పరిశ్రమలతోకానీ కార్బన్‌ వాయు విడుదలల మారక ఒప్పందం చేసుకోవచ్చు.

తక్కువ కార్బన్‌ వాయు విడుదలలను ''దృవీకరించబడ్డ కార్బన్‌వాయు విడుదలలు తగ్గింపు'' యూనిట్లు(సర్టిఫైడ్‌ ఎమిషన్‌ రిడక్షన్‌) అంటారు. అంటే ఈ యూనిట్లలో అధిక కార్బన్‌ వాయువిడుదల దేశాలు/కంపెనీలు పెట్టుబడులను పెట్టవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఒప్పందంలోని రెండు దేశాలు క్యోటో ఒప్పందం అంగీకరించిన దేశాలై ఉండాలి. క్యోటో ఒప్పందం కింద పై ప్రక్రియలో కార్బన్‌ వాయువుల నిల్వలను, తగ్గింపును ''క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం'' ద్వారా నిర్వహింపబడుతుంది. ఈ యంత్రాంగం నిర్వహణకు ఒక ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు ఏర్పాటు చేయబడింది. తక్కువ ఖరీదులో కార్బన్‌వాయువు అదుపు, కార్బన్‌ నిల్వలు పెంచటమే ఈ మెకానిజం ప్రధాన లక్ష్యం. ఈ మెకానిజం కింద కార్బన్‌వాయువు అదుపు చేసే సందర్భంలో ప్రతి ఒక్క మెట్రిక్‌టన్ను వాయువుకు ఒక యూనిట్‌ క్రెడిట్‌ ఇస్తారు. కార్బన్‌వాయువును ఏమేరకు అదుపుచేసి/నిల్వ చేయగలరో ఆ మేరకు క్రెడిట్‌ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది.(చెట్లు ఆక్సిజన్‌ను వదిలి కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోవటమే కార్బన్‌ నిల్వలు పెరగటం)

కార్బన్‌ క్రెడిట్స్‌ : ఇవి రెండు రకాలు కార్బన్‌ ఆఫ్‌సెట్‌ క్రెడిట్‌, కార్బన్‌ రిడక్షన్‌ క్రెడిట్‌. సంప్రదాయ ఇంధన ఉత్పత్తి పద్ధతులైన వాయు(విండ్‌), సూర్యరశ్మి(సోలార్‌), జల(హైడ్రో) మరియు బయోఇంధనాల ద్వారా అదుపు చేయబడ్డ కార్బన్‌ను కార్బన్‌ ఆఫ్‌సెట్‌ క్రెడిట్‌ కింద, అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం, మహా సముద్రాలలోనూ, భూగర్భంలోనూ కార్బన్‌ నిల్వలు పాతిపెట్టే పద్ధతులతో కార్బన్‌ను అదుపు చేయటం కార్బన్‌ రిడక్షన్‌ క్రెడిట్‌ క్రింద పరిగణిస్తారు. ఈ పద్ధతులలో ఆర్జించిన కార్బన్‌ క్రెడిట్లను క్యోటో ఒప్పంద పరిధిలో అభివృద్ధి చెందిన దేశాలతోకానీ లేదా ఆయా దేశాలలోని పారిశ్రామిక కంపెనీలతోకానీ మార్కెట్‌ ధరకు అమ్ముకోవచ్చు. లేదా పెట్టుబడులను స్వీకరించవచ్చు. ప్రపంచవ్యాపితంగా అత్యధిక కార్బన్‌ వాయువిడుదలల దేశాలు/కంపెనీలు ఈ మార్కెట్‌లో కార్బన్‌ విక్రయాలతో తమ కార్బన్‌ వాయువిడుదల రేటును తగ్గించుకుంటున్నాయి. ఈ విధమైన కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల వ్యాపారాన్ని కార్బన్‌ ట్రేడింగ్‌ అంటున్నారు. అత్యధిక కాలుష్యకారకులైన ధనికదేశాలు అత్యధిక లాభాలు పొందుతూ, కాలుష్యానికి కారణం కాని వర్ధమాన దేశాలతో కార్బన్‌ విడుదల అదుపు చేయించటమే కార్బన్‌ ట్రేడింగ్‌ సారాంశం.

కార్బన్‌ మార్కెట్‌ : కార్బన్‌ట్రేడింగ్‌ అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన వాణిజ్యంగా రూపుదిద్దుకుంది. 2006వ సం||లో ప్రపంచవ్యాపితంగా 30బిలియన్‌ డాలర్లు ఉన్న కార్బన్‌ మార్కెట్‌ ప్రస్తుతానికి 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా పరిణామం చెందింది. చైనా, భారతదేశం ఈ మార్కెట్‌లలోని కార్బన్‌ విక్రయాలలో ప్రముఖంగా ఉన్నాయి. యూరప్‌ దేశాలతో కార్బన్‌ ట్రేడింగ్‌ ఎక్కువగా నిర్వహింపబడుతున్నది. కార్బన్‌ మార్కెట్‌లో స్పాట్‌ మార్కెట్‌లు, డెరివెటీవ్‌ మార్కెట్‌లు అమలులో ఉన్నాయి. డెరివెటీవ్‌లలో ప్యూచర్‌లు, ఆక్షన్‌లు ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచబ్యాంక్‌తో సంయుక్తంగా పనిచేసిన ప్రైస్‌వాటర్‌కూపర్‌ అభిప్రాయంలో కార్బన్‌ ట్రేడ్‌ - కాపీరైట్‌, పేటెంట్‌, లైసెన్సింగ్‌ మరియు వాణిజ్య పారిశ్రామిక ట్రేడ్‌మార్క్‌ హక్కులతో సమానమైందన్నారు. నయాఉదారవాద విధానాలలో కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా భూవాతావరణం కూడా ప్రైవేటీకరించబడుతుందని పర్యావరణవాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫైనాన్షియల్‌ రంగంలో డెరివెటీవ్‌లు సృష్టించిన విలయాన్ని భవిష్యత్‌లో పర్యావరణ రంగంలో కార్బన్‌ ట్రేడింగ్‌ సృష్టిస్తుందని ప్రముఖ పర్యావరణవేత్త లారీలోV్‌ామన్‌ హెచ్చరిస్తున్నారు.

No comments: