Tuesday, November 24, 2009

చరిత్రలో మానవ వలసలు

ప్రపంచవ్యాపితంగా మానవ వలసల ధోరణులలోని మూడు కీలకాంశాలను మానవాభివృద్ధి నివేదిక 2009 గుర్తించింది. 1) మానవ స్థితిగతుల్ని మెరుగుపర్చుకోవలసిన మానవ అవసరమే మానవ వలసలకు చోదక శక్తిగా ఉంది. 2) మానవ వలసల సమగ్రాభివృద్ధికి ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాల విధానపరమైన అడ్డంకులు, ఆర్థికపరమైన అవాంతరాలు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఈ అడ్డుగోడల్ని అధిగమించలేని పేద ప్రజానీకం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ మానవ వలసల ప్రయోజనాలను పొందలేకున్నారు. 3) భవిష్యత్తులో ఎదురుకానున్న విభిన్న ఆర్థిక, భౌగోళిక పరిణామాలు మానవ వలసల ప్రవాహాన్ని పెంచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని నివేదిక అంచనా వేసింది.

19వ శతాబ్ధంలో మానవ వలసల స్వేచ్ఛా సమాజం:

అతి పురాతనమైన మానవ వలసలకు బైబిల్‌(పాతనిబంధనలు), ఖురాన్‌ లాంటి మత గ్రంథాలు గౌరవ స్థానమిచ్చాయని, వలస ప్రజలను మౌళిక వసతులతో ఆదరించాలనే మత ప్రభోధాలను నివేదిక ప్రస్తావించింది. ప్రాచీన కాలంలో నాగరికతలలో ఎన్ని మనస్పర్ధలున్నా వలస ప్రజలతో సహజీవనం చేయటం సమాజ లక్ష్యంగా ఉండేది. ఇబేరియన్‌ పాలనలో అమెరికా ఖండానికి లక్షలాది స్పేనియన్‌లు, ఆంగ్లేయులు వలస పోవటం, 15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు శ్రమ శక్తి కొరత తీర్చటం కోసం కోటి 20 లక్షల మంది ఆఫ్రికన్లను క్రూరపద్ధతులలో బానిసలుగా తీసుకువెళ్ళటం, 23 లక్షల చైనీయులు, 13 లక్షల మంది ఇండియన్లు ఈశాన్య ఆసియా దేశాలకు కాంట్రాక్టు కార్మికులుగా వెళ్ళటాన్ని నివేదిక పేర్కొన్నది. బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం గ్రామ సీమల నుండి పట్టణాలకు వలసల వేగాన్ని పెంచింది. ఇదే కాలంలో బ్రిటన్‌ న్యూయార్క్‌ల మధ్య తగ్గిన రవాణా ఖర్చులు, స్వీడన్‌ ఐరిష్‌ దేశాల నుండి వలస వెళ్ళిన ప్రజల వేతనాలు సంపన్న దేశాల స్థాయిలో ఉండటం మానవ వలసలకు ప్రోత్సాహకర వాతావరణం ఏర్పరచిందని నివేదిక చెప్పింది. అర్జెంటీనా వంటి దేశాలు వలస వెళ్ళే ప్రజలకు కల్పించిన ప్రయాణ సబ్సిడీలు, బ్రెజిల్‌ లాంటి దేశాలు వలస వచ్చిన ప్రజలకు ఉచితంగా అప్పగించిన భూములు, 1924వరకు అమెరికాలో శాశ్వత నివాసమేర్పరచుకోటానికి వలస ప్రజలకు ఆంక్షలు లేని వాతావరణం, 19వ శతాబ్ధంలో చరిత్రలో నిలిచిన మానవ వలసల స్వేచ్ఛా సమాజాన్ని ప్రస్తావిస్తూ, సమకాలీన కాలంలో మానవ వలసలలోని నూతన కోణాల్ని చూడటానికి ఈ చరిత్ర ప్రాతిపదికను అందించిందని నివేదిక చెప్పింది. ఈ నాటికంటే ప్రపంచవ్యాపితంగా 19వ శతాబ్ధంలో మానవ వలసల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం.

మానవ వలసలపై ఆంక్షల్ని ప్రారంభించిన 20వ శతాబ్దం:

పారిశ్రామికాభివృద్ధి పెరుగుతూ నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, పౌరపాలనలో సరిహద్దులు, సంరక్షణ అనే భావన పెరిగింది. అభివృద్ధి చెందిన వివిధ దేశాలు శ్రమశక్తి కొరతగా ఉన్నప్పుడు విదేశాల నుండి మానవ వలసల్ని ప్రోత్సహించటం, కరువుకాటకాలు, ఆర్థిక సంక్షోభకాలాల్లో మానవ వలసలపై ఆంక్షలు విధించటం రివాజుగా మారిపోయిందని నివేదిక అభిప్రాయపడింది. మానవ శ్రమశక్తి మారకానికి వివిధ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 1942లో మెక్సికన్‌ ఫారమ్‌ లేబర్‌(బ్రాసరో) ఒప్పందం క్రింద అమెరికా 22 సం||లపాటు 4.6 మిలియన్ల కాంట్రాక్టు కార్మికులను మెక్సికో నుండి తమ దేశానికి అనుమతించింది. దీనిని 1964లో రద్దు చేసింది. 1947లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన అసిస్టెడ్‌ ప్యాసేజ్‌ అగ్రిమెంట్‌, గెస్ట్‌ వర్కర్‌ ప్రోగ్రామ్‌లాంటి యూరోపియన్‌ యూనియన్‌ కార్మిక సంఘాల ఒప్పందాలు ఈ దిశలో ప్రాచుర్యాన్ని పొందాయి. 1970వ సం||లో ప్రపంచ దేశాలను కుదిపిన ఆయిల్‌షాక్‌తో ఈ ఒప్పందాలు రద్దయ్యాయి. అదే సందర్భంలో గల్ఫ్‌ దేశాలలో ఆయిల్‌ వాణిజ్యం ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశాలకు మానవ వలసలు ఎక్కువయ్యాయి. ఇన్ని ఆంక్షలు ఉన్నా 1960 ప్రపంచ జనాభాలో 2.7శాతం ఉన్న వలస ప్రజలు 2010 నాటికి 2.8శాతం ఉండటం వలస ప్రజల సంఖ్య స్థిరత్వాన్ని తెలియచేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభాలో 5 శాతం నుండి 12 శాతానికి, గల్ఫ్‌ దేశాలలో 5 శాతం నుండి 39 శాతానికి వలస ప్రజలు పెరిగారు. మిగిలిన ప్రపంచంలో వలస ప్రజల శాతం స్థిరంగానూ, కొన్ని దేశాలలో తక్కువగానూ ఉన్నాయి.

పెరుగుతున్న పట్టణీకరణ-సవాళ్ళు:

వివిధ దేశాల్లో అంతర్గత వలసల స్థాయి పెరుగుతుంది. నివేదిక పరిశీలించిన 18 దేశాలలో 11 దేశాలలో ఈ వలసల స్థాయి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామాల నుండి పట్టణాలకు వచ్చే వలసలు పెరుగుతున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాపితంగా ఉండే పట్టణ ప్రజలు ప్రస్తుత పట్టణ జనాభాకు రెట్టింపు ఉంటారని నివేదిక అంచనా వేస్తుంది. ఈ పెరుగుదల ఆఫ్రికా దేశాలలో 40 నుండి 60 శాతం వరకు ఉండవచ్చు. 2030 నాటికి పట్టణ ప్రజలలో 40శాతం(20లక్షలమంది) మురికివాడల్లో నివసిస్తారని, పట్టణీకరణకు నూతన సవాళ్ళు ముందున్నాయిని నివేదిక హెచ్చరిస్తుంది.

వలసలలోని రకాలు:

వలసలలను శాశ్విత వలసలు, తాత్కాలిక వలసలు, అక్రమ వలసలుగా వర్గీకరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తాత్కాలిక వలసలు లేదా స్వల్పకాలిక వలసలలో ప్రజల సంఖ్య అధికంగా ఉంది. సంపన్న దేశాలలో 83శాతం విదేశీయులు కనీసం 5 సం||లు నివసిస్తున్నట్లు నివేదిక చెప్తున్నది. వివిధ కారణాల రీత్యా శాశ్వత వలసలు తాత్కాలిక వలసలుగానూ, తాత్కాలిక వలసలు శాశ్వత, అక్రమ వలసలుగానూ, అక్రమ వలసలు శాశ్వత వలసలుగానూ రూపాంతరం చెందటం ప్రపంచవ్యాపితంగా ఉన్న పరిణామం. అమెరికా జనాభాలో 4 శాతం అక్రమ వలస ప్రజలే. ఆ దేశ వలస ప్రజలలో వీరు 30శాతం. శ్రమశక్తి కొరతను అధిగమించటానికి సంపన్న దేశాలు అక్రమ వలసల్ని చూసీచూడనట్లుగా ఉన్నాయి. 2007వ సం||లో జరిపిన సర్వేలో 78శాతం ప్రభుత్వాలు ఆయా దేశాలలో వలసల స్థాయి సంతృప్తికరంగా ఉందని, 17శాతం ప్రభుత్వాలు వలసల స్థాయి ఎక్కువగా ఉన్నాయని, 5శాతం ప్రభుత్వాలు వలసల స్థాయి తక్కువగా ఉన్నాయని తెల్పుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది.

No comments: