Tuesday, November 24, 2009

కార్బన్‌ ట్రేడింగ్‌ ఎంత ప్రయోజనకరం?

మానవాళి మనుగడకు విఘాతమై, ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమౌతూ, పర్యావరణ కాలుష్యాలైన గ్రీన్‌హౌస్‌ విషవాయువుల నియంత్రణకు భూగోళంలోని ఉత్తర దేశాలు(ధనిక దేశాలు) కార్బన్‌ట్రేడింగ్‌ను ప్రధాన సాధనంగా ఎంచుకున్నాయి. కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా ఉత్తరదేశాల కాలుష్యవాయు విడుదలల అదుపుకు దక్షిణ దేశాలు (వర్దమాన దేశాలు) కార్బన్‌ నిల్వల స్థావరాలై, కార్బన్‌ మార్కెట్ల విక్రయదారులయ్యాయి. క్యోటో ఒప్పందంలో 170 దేశాల ఆమోదంతో సాధికారత పొందిన కార్బన్‌ ట్రేడింగ్‌ అంతర్జాతీయంగా సామాజిక కార్యకర్తలలోనూ, పర్యావరణ వాదులలోను తీవ్రమైన చర్చనీయాంశమైంది. కార్బన్‌ వాయు విడుదలల అదుపుకు అనువైన మార్గంగా మద్ధతుదార్లు వాదిస్తుంటే, పర్యావరణ కాలుష్యాన్ని మరింతగా కాలుష్య పరచటానికి కాలుష్యదారులకు లైసెన్స్‌ ఇవ్వటంగా పర్యావరణవాదులు విమర్శిస్తున్నారు.

చెప్పబడుతున్న ప్రయోజనాలు: 1) క్యోటో ఒప్పందం ఆమోదించిన వాయువిడుదలల ప్రక్రియలో 'పరిమితి-వాణిజ్యం' (క్యాప్‌ అండ్‌ ట్రేడ్‌) విధానం కీలకమైంది. ఈ విధానానికి లోబడి అభివృద్ధి చెందిన దేశాలు/అందులోని పరిశ్రమలు నిర్ణీత కాలవ్యవధిలో అంగీకరించిన కోటాల మేరకు కాలుష్య విడుదలల్ని అదుపు చేయాల్సి ఉంది. ఈ కార్యసాధనలో కార్బన్‌ ట్రేడింగ్‌ సులభమైన పద్ధతులలో సులువుగా వాయువిడుదలల అదుపుకు తోడ్పడుతుంది.

2) క్యోటో ఒప్పందం ఏర్పరచిన 'కార్బన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం' కింద అనుబంధం-1 పరిధిలోని అత్యధిక వాయువిడుదల దేశాలు తమ వాయువిడుదలలను సర్దుబాటు చేసుకోవటం కోసం, అనుబంధం-1 కిందకు రాని అత్యల్ప వాయువిడుదలల దేశాల నుండి కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్‌లు కొనుగోలు చేసుకునే వీలుకల్పించింది. తమ దేశాలు వాయువిడుదలల అదుపుకు సంబంధించిన నిర్వాహణ వ్యయం అత్యధికంగా ఉన్న కారణంగాను ప్రకృతి వనరుల లభ్యత కొరత ఉన్న కారణంగాను తక్కువ ఖర్చుతో వర్దమాన దేశాల నుండి కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లు(సర్టిఫికెట్‌ ఆఫ్‌ కార్బన్‌ రిడక్షన్‌) కొనుక్కోవటం ఉత్తర దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇందుకోసం కార్బన్‌ విడుదలల సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయటం, కార్బన్‌ నిల్వలు పెంచటంలో దక్షిణ దేశాలకు గణనీయమైన నిధులు, పరిజ్ఞానం లభ్యమౌతాయి. వీటితో ఆయా దేశాలు ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే పేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాల పెంపుకు అవసరమయ్యే నిధుల కొరతను తేలిగ్గా అధిగమించవచ్చును. 3) కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో వర్ధమాన దేశాలలో కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల అభివృద్ధికి చేపట్టే ప్రధాన చర్యలైన వన పరిరక్షణ, అడవుల అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నిర్వాహణల వల్ల కాలుష్య నియంత్రణ కోసం అంతర్జాతీయంగా వెచ్చించే అధిక వ్యయం ఆదా అవుతుంది.

దీనిని ఆర్ధిక అభివృద్ధిలో మరొక రంగంలో వినియోగించుకోవచ్చును. 4) అడవులు అభివృద్ధితో వన్యప్రాణుల రక్షణ పెరుగుతుంది. 5) కార్బన్‌ ట్రేడింగ్‌లో కార్బన్‌ నిల్వల్ని సరుకుగా పరిగణించిన కారణంగా మార్కెట్‌ శక్తులకు సరుకుల వాణిజ్యంలో ఉన్న అనుభవం దృష్ట్యా కార్బన్‌ వాణిజ్యం తేలికైయ్యింది. కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లు కార్బన్‌ రిడక్షన్‌ సర్టిఫికెట్‌ల రూపంలో ఉండటం మూలకంగా స్టాక్‌మార్కెట్‌ పద్ధతుల్ని ఈ విక్రయంలో అమలు చేయటం తేలికయ్యింది. వర్ధమాన దేశాలలోని పరిశ్రమలు కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల ఆర్జన కోసం తమ పరిశ్రమల్ని అల్పవాయు విడుదలల పరిజ్ఞానానికి మార్చుకోవటం మూలకంగా పర్యావరణంపై మరింత భారం తగ్గుతుంది.

6) కాలుష్య వాయువిడుదలల కంపెనీల ఉత్పత్తులపై వేసే పన్నును కార్బన్‌ టాక్స్‌ అంటారు. కార్బన్‌ టాక్స్‌ ఆర్థిక వ్యవస్థలో పన్ను భారాల్ని పెంచేదృష్ట్యా దీనికంటే కార్బన్‌ క్రెడిట్‌ పద్ధతి మెరుగైనదని అంటున్నారు. తాజాగా చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన కార్బన్‌టాక్స్‌ ఒక ఉదాహరణ.

భారతదేశంలో కార్బన్‌ ట్రేడింగ్‌: ప్రపంచ కార్బన్‌ ట్రేడింగ్‌ మార్కెట్‌లో చైనా 73%, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ఒక్కొక్కటి 8% మార్కెట్‌ షేర్‌ కలిగి ఉన్నాయి. కానీ కార్బన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం ప్రాజెక్టులలో అత్యధికం మన దేశానివి. 2009 సం||లో ఐరోపాలో కార్బన్‌ ట్రేడింగ్‌ వాణిజ్యం 64 బిలియన్‌ డాలర్లు(కార్బన్‌ ధరలు తగ్గిన కారణంగా) ఉండగా మన దేశం 5 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ వ్యాపితంగా కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రాజెక్టులలో 72% కార్బన్‌ పీల్చుకునే వనాలు, అడవుల పెంపకం సంబంధించినవి కాగా, 21% బయోమాస్‌, 2% పునరుద్ధరించగలిగే ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి.

లక్ష హెక్టార్లు కొత్త అడవులు 10 లక్షల టన్నుల కార్బన్‌ నిల్వల్ని పెంచుతాయని అంచనా వేస్తున్నారు. ఒక హెక్టార్‌లోని యూకలిప్టస్‌ చెట్లు సాధారణంగా 5 టన్నుల కార్బన్‌ని నిల్వ చేస్తుందంటున్నారు. కార్బన్‌ ట్రేడింగ్‌లో వీటన్నింటికీ టన్నుకు ఒక యూనిట్‌ చొప్పున కార్బన్‌ క్రెడిట్‌లు ఇవ్వబడతాయి. ఈ మధ్య కాలంలో సుబాబుల్‌, యూకిలిప్టస్‌ చెట్ల సాగు భారీగా పెరగటానికి ఈ విధానాలే కారణం. అందుకోసమే ప్రపంచబ్యాంకు విధానాల అమలులో వనసంరక్షణ, చెట్ల పెంపకం ముఖ్య షరతు అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పడింది. మన దేశంలో ఈ ప్రాజెక్టుల కింద అనేక వనసంరక్షణ, చెట్ల పెంపక పథకాలు వెలిశాయి. ధనిక దేశాలలో కాలుష్య నివారణకు, పెట్టుబడిదారుల అధిక లాభాల పరిరక్షణకు వర్దమాన దేశాల భూమి అడవుల పెంపకంలోనూ, వనసంరక్షణలోనూ ప్రధాన వనరయ్యింది.

ప్రపంచ పర్యావరణ కాలుష్య అదుపుకు స్థావరంగా మారిన భారతదేశంలో కాలుష్య వాయువిడుదలల స్థాయి అంతకంతకు పెరుగుతున్నది. వాయువిడుదలల స్థూలపరిమాణంలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న జపాన్‌ను మన దేశం ఇప్పటికే అధిగమించింది. ప్రపంచ సగటు వాయువిడుదలలో భారతదేశం రెట్టింపయ్యింది. 2005 సం|| గణాంకాల ప్రకారం భారతదేశంలో కాలుష్యవాయువిడుదలలు విద్యుత్‌రంగంలో 55%, ట్రాన్స్‌పోర్టు 9%, పరిశ్రమలలో 31%, ఇతరాలు 5%గా ఉన్నాయి. ప్రైవేటు వాహనాల పెరుగుదలల వల్ల కాలుష్యవాయు విడుదలలు మనదేశంలో 5.6 రెట్లు పెరగగా చైనాలో 3.4 రెట్లు మాత్రమే పెరిగింది.

వాహన కార్బన్‌కాలుష్య అదుపుకు మన కార్లరంగంలో యూరో-1/ఇండియా 2000, యూరో-2/భారత్‌-2, యూరో-3/భారత్‌-3, యూరో-4/భారత్‌-4 ప్రమాణాలు పాటిస్తున్నాము. యూరో ప్రమాణాలు యూరప్‌ దేశానివి. ఐ.ఎస్‌: 1460-2000 మరియు ఐ.ఎస్‌: 2796-2000 డిజిల్‌, పెట్రోల్‌ ఇంధనాల గుణాత్మక విలువలు. ఇది భారత్‌-2కి సమానమైనవి. భారత్‌-3 ప్రమాణాలు 2010లోగా దేశమంతటా అమలు చేయాల్సి ఉండగా భారత్‌-4/యూరో-4 ప్రమాణాల్ని 2010నాటికి 10 మెట్రో నగరాలలో అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల చేకూరే కార్బన్‌ వాయు విడుదలల అదుపు ఆ కంపెనీలకు కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లను సంపాదించి ఇస్తాయి.

ముగింపు: హిల్లరీ క్లింటన్‌ ఇటీవలి భారత్‌ పర్యటనలో వాయువిడుదల కాలుష్యంలో అమెరికా చేసిన తప్పును భారతదేశం చేయవద్దని హితవు పలికింది. ఇంతవరకు కాలుష్యవాయు విడుదలలపై ఏ రకమైన పరిమితులు వర్తించని భారతదేశం ఇక నుండి పరిమితుల్ని అంగీకరంచాలనేదే ఆవిడ అంతరంగం. అందుకోసంగా మన ఆర్థిక అభివృద్ధిని ఫణంగా పెట్టాల్సిఉంది.

No comments: