Tuesday, November 24, 2009

కార్బన్‌ ట్రేడింగ్‌పై విమర్శలు

పర్యావరణ కాలుష్యాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సృష్టించిన సామాజిక సంక్షోభంగా చూడాలి. శతాబ్దాలపాటు పారిశ్రామిక ఉత్పత్తిలో లాభార్జనే పరమావధిగా విచక్షణా రహితంగా వినియోగించిన శిలాజ ఇంధనాలు(ఫోసిల్‌ ఫ్యూయల్స్‌), అడవుల నరికివేత కలుషిత వాయువిడుదలలకు ప్రధాన కారణాలు. ప్రస్తుత దశకంలో ప్రపంచవ్యాపిత విద్యుదుత్పత్తిలో 80% శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంది. వీటిలో చమురు భాగం 34%. ప్రపంచవ్యాపిత పారిశ్రామిక ఉత్పాదకతతో శిలాజ ఇంధనాలు బ్రహ్మముడి వేసుకొని ఉన్నాయి. వీటి వినియోగాల్ని తగ్గించటమంటే పారిశ్రామిక ఉత్పాదకతను, ఆర్ధికాభివృద్ధిని కుదించటంగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అందుకనే క్యోటో ఒప్పందంలో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపుకంటే కలుషిత వాయువిడుదలల సర్దుబాటుపై ఎక్కువ దృష్టి సారించాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో కార్బన్‌ ట్రేడింగ్‌ మాన్యతపై పర్యావరణవేత్తల కొన్ని విమర్శల్ని పరిశీలిద్దాం.

1. శిలాజ ఇంధనాల వినియోగాన్ని కార్బన్‌ ట్రేడింగ్‌ తగ్గించలేదు: కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో పారిశ్రామిక దేశాలు ఉత్పత్తి స్థానంలో కలుషిత వాయు విడుదలల్ని తగ్గించటం లేదు. వర్ధమాన దేశాలు కార్బన్‌ నిల్వల్ని పెంచటానికి పెట్టుబడులుపెట్టి వారి వాయువిడుదలల్ని సర్ధుబాటు చేసుకుంటున్నారు. ఆర్థిక దృక్కోణంలో కార్బన్‌వాయు విడుదలల సర్దుబాటు కాలుష్యాన్ని నివారించినట్లు కనిపించినా పర్యావరణ దృక్కోణంలో ఉత్పత్తి స్థానంలో శిలాజ ఇంధనాల వినియోగం, కలుషిత వాయు విడుదలల తగ్గింపే శాస్త్రీయమైన కాలుష్యనివారణ అవుతుంది. పర్యావరణ కాలుష్య సమస్యను కార్బన్‌ ట్రేడింగ్‌ పరిష్కరించలేకపోతుంది.

2. కార్బన్‌ ట్రేడింగ్‌ అసమానతల ప్రాతిపదికపై నిర్మించబడింది: పర్యావరణ పరిరక్షణ సూత్రాలననుసరించి పర్యావరణాన్ని ఏమేరకు కలుషితమొనరిస్తున్నారో, ఆ మేరకు కాలుష్యకారకులు సమానత ప్రాతిపదికన నష్టాన్ని భరించాలి. పారిశ్రామిక దేశాలు తాము కలుషితం చేస్తున్న పర్యావరణ విలువ కంటే అతితక్కువ వ్యయంతో కలుషిత వాయు విడుదలల్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం వర్ధమాన దేశాలలో అడవులు, తోటల పెంపకానికి అయ్యే ఖర్చుకంటే 50 నుండి 200 రెట్లు అధికంగా సంపన్న దేశాలలో వారు సృష్టించిన కాలుష్యాన్ని తగ్గించటానికి వ్యయమవుతుంది. లాభాలనార్జిస్తూ పర్యావరణ కాలుష్య హక్కులను పారిశ్రామిక దేశాలు పొందుతుంటే, తాము కారణం కాని వర్ధమాన దేశాల పేద ప్రజానీకం కాలుష్య నష్టాలను అనుభవిస్తూ, కాలుష్య నివారణా బాధ్యతను మోయాల్సివస్తుంది.

3. కాలుష్య నివారణను నీరుకార్చటమే కార్బన్‌ ట్రేడింగ్‌ లక్ష్యం: కాలుష్యరంగంలో మార్కెట్‌ను సృష్టించటం సామాజిక దృక్కోణంలో అనైతిక చర్య. పర్యావరణ పరిరక్షణకు ప్రధానంగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని అడ్డుకోవాలి. కాని వాటిని వాణిజ్య సరుకుగా మార్చి, ఆ సరుకు లాభదాయకమైతే పెట్టుబడిదారీ వ్యవస్థలో వాటి ఉత్పత్తి నిరాఘాటంగా కొనసాగింపబడుతుంది. డచ్‌ జాతీయ ప్రజారోగ్యం, పర్యావరణ సంస్థ అంచనాల ప్రకారం కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా గ్రీన్‌హస్‌ వాయువిడుదలల్ని 2012 నాటికి 0.1% మించి తగ్గించలేరన్నారు. క్యోటో ఒప్పంద లక్ష్యమైన 5.2% గగనకుసుమమైంది. అందువల్ల కార్బన్‌ట్రేడింగ్‌ వల్ల కాలుష్య నివారణను వాయిదావేయటం లేదా నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది కాని కాలుష్య నివారణ సాధింపబడదు.

4. వాతావరణ ప్రైవేటీకరణ - కార్బన్‌ ట్రేడింగ్‌ మార్గం: పౌరులకు స్వచ్ఛమైన గాలిని, పర్యావరణ భద్రతను అందిచాల్సిందిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వాతావరణంపై సర్వహక్కుల్ని కార్బన్‌ట్రేడింగ్‌ ధారాదత్తం చేస్తుంది.

5. నయా ఉదారవాద మానసపుత్రిక కార్బన్‌ట్రేడింగ్‌: కలుషిత వాయు విడుదలల్ని నిర్మూలించాలనే నైతికమైన, పర్యావరణ పరమైన సామాజిక సమస్యను బిలియన్‌ డాలర్ల సంపదను పోగుచేసుకోగలిగే వాణిజ్య వనరుగా కార్బన్‌ట్రేడింగ్‌ మార్చింది. 'అనిశ్చితిని' సరుకుగా మార్చేది నయాఉదారవాద స్ఫూర్తి. కార్బన్‌ నిల్వల గిరాకీ-సరఫరాలలోని అనిశ్చితిని అసరాగా చేసుకొని కార్బన్‌మార్కెట్‌లలోకూడా డెరివేటీవ్‌ల్ని అమలు చేశారు. వాటి ప్రభావంగా మానవాళి మనుగడను సవాలు చేస్తున్న పర్యావరణ కాలుష్యం యొక్క నివారణ ప్రక్రియలలో జూదప్రవృత్తి పెరిగింది. కార్బన్‌ నిల్వలు కార్బన్‌వలయం(కార్బన్‌ సైకిల్‌)లో కాకుండా వాల్‌స్ట్రీట్‌లో పరిభ్రమిస్తున్నాయి.

6. కార్బన్‌ ట్రేడింగ్‌లో దుశ్చర్యలు: శీతలీకరణ వాయుఉత్పత్తిలో విడుదలయ్యే ట్రైక్లోరోమీథేన్‌ను చౌకగా నాశనం చేసి అత్యధిక లాభాలనార్జించటం, అడవులు వనాల పెంపకంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను విడుదల చేసే మోనోకల్చర్‌ సాగును ప్రోత్సహించటం, కార్బన్‌ క్రెడిట్‌ లెక్కింపులలో కుంభకోణాలకు పాల్పడటం కార్బన్‌ ట్రేడింగ్‌లో దుశ్చర్యలుగా బహుళ ప్రచారంలో ఉన్నాయి.


1 comment:

Unknown said...

mee blog chaalaa baagundi. . . manchi samaachaaraanni ichharu.
kritajnatalu
kiranmai (www.vedakiran.blogspot.com)