Thursday, November 5, 2009

MIGRATION & INDIA

మానవ వలసల తీరుతెన్నులు

ప్రపంచవ్యాప్తంగా మానవ వలసలపై ఉండే ఆంక్షల్ని, అవరోధాల్ని సడలించాలనే ప్రతిపాదనను సమర్థించే దిశలో మానవాభివృద్ధి నివేదిక 2009 మరో రెండు కారణాలని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్త జనాభా విస్తరణ, పర్యావరణ మార్పుల ప్రభావాలు మానవ వలసల అనివార్యతను నొక్కిచెప్తున్నాయి.

1) జనాభా విస్తరణ: 2050లోగా ప్రపంచ జనాభా ఇప్పటికంటే 1/3వ వంతు పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరుగుదల అభివృద్ధి చెందిన దేశాలలో 2020 నాటికి గరిష్ట స్థాయికి చేరి, ఆతరువాత కాలంలో 7% పతనమయ్యే ప్రమాదమున్నదని నివేదిక చెప్తున్నది. ప్రపంచ జనాభాలో ఆఫ్రికా దేశాల్ని మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా 15 సం||ల లోపు పిల్లల కంటే, 60 సం||లు పైబడ్డ వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2050 నాటికి ప్రపంచంలో పని చేయగలిగే వారి సంఖ్య 1.1 బిలియన్‌లు పెరగవచ్చు. ప్రస్తుత వలసల స్థాయి కొనసాగితే 2050 నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో పని చేయలేని వారు 71% ఉండవచ్చునని, వలసలను నిరోధిస్తే ఈ శాతం 78కి పెరగవచ్చునని నివేదిక అంచనా వేస్తున్నది. దీన్ని అధిగమించటానికి ఎంత శాస్త్ర,సాంకేతికాభివృద్ధి సాధించినా, మానవ శ్రమశక్తి డిమాండ్‌ అనివార్యంగా పెరిగి, 19వ శతాబ్ధంలోలాగా వలసలకు ప్రోత్సాహకాలనివ్వాల్సిన అగత్యం ఏర్పడుతుందని నివేదిక హెచ్చరిస్తున్నది.

2) పర్యావరణ మార్పు: గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలలు సృష్టించే సవాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా రానున్న కాలంలో 200 మిలియన్‌ల నుండి 1 బిలియన్‌ వరకు ప్రజానీకం సమస్యాత్మక ప్రాంతాల నుండి రక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపధ్యంలో మానవ వలసలపై అంతర్జాతీయ సడలింపులు తప్పనిసరి అవుతాయని నివేదిక అభిప్రాయపడుతుంది.

వలసల వల్ల ప్రయోజనాలు పొందుతున్న వలస ప్రజలు, వారి దేశాలు: మానవాభివృద్ధి పరిశోధనల్లో సంపన్న దేశాలలోని వలస ప్రజల మానవాభివృద్ధి, వారి సొంత దేశాలలో మానవాభివృద్ధికంటే 24% ఉంది. వలస ప్రజలలో మహిళలు అత్యధిక నిధుల్ని స్వంత దేశాలకు పంపుతున్నారు. వలస ప్రజల వల్ల వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాల నుండి 2008లో 308 బిలియన్‌ డాలర్ల నిధి బదిలీ అయ్యింది.

ఆర్ధికమాంధ్యం కారణంగా 2009లో ఈ నిధులు 293 బిలియన్‌ డాలర్లకు పడిపోవచ్చు. అభివృద్ధి దేశాలకు తరలి వస్తున్న వలస ప్రజల విదేశీ మారక ద్రవ్యం ఆయా దేశాల 'అధికారిక అభివృద్ధి సహాయనిధి'కి 4 రెట్లు ఉంది. వలస ప్రజల కుటుంబాలలో బాల కార్మికుల సంఖ్య తగ్గటంతోపాటు శిశు మరణాల శాతం, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలలో డ్రాపౌట్‌ల శాతం తగ్గాయి. వలస ప్రజల కుటుంబాలు ప్రత్యేకించి మహిళలు స్థానిక సంస్థలలోను, రాజకీయ, సామాజిక రంగాలలోనూ భాగస్వామ్యం కావటం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో అంతర్గత వలసల వల్ల గృహసంబంధ పేదరిక రేటు 2001-02 నుండి 2006-07కు 50శాతంకు తగ్గింది. ఇండోనేషియాలో 50శాతం గృహాల్లో వలస ప్రజలు ఉన్నారు. వారిలో పేదరిక రేటు 34 నుండి 19 శాతానికి తగ్గింది. పై విధంగా వలస ప్రజలు కొన్ని కోణాల్లోనైనా అవకాశాల్ని పెంచుకొని ప్రయోజనాల్ని పొందుతున్నారు.

ఈ ప్రయోజనాలు అందరిలో సమానస్థాయిలో లేవు. వ్యక్తులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు, స్వదేశీ, ఆతిధ్య దేశాల్లోని ప్రభుత్వాల విధానాలు ఈ ప్రయోజనాల్ని తగ్గించేస్తున్నాయి. అసమానతలు పెరుగుతున్నాయి. ఘర్షణ, అక్రమ మానవ రవాణాల్లోని ప్రజలు ప్రపంచ వలస ప్రజల్లో అతిస్వల్ప సంఖ్యగా ఉన్నా ప్రపంచ సభ్యతకు ఈ పరిణామాలు కళంకంగానే ఉన్నాయి. వలస ప్రజల అభివృద్ధికి అవరోధాల్ని నివారించగలిగితే వలస ప్రజల మానవాభివృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించగలమని మానవాభివృద్ధి నివేదిక 2009 గట్టిగా నమ్ముతున్నది.

వలసల వల్ల ఆతిధ్యదేశాలు పొందుతున్న ప్రయోజనాలు: గత 50 సం||లుగా అభివృద్ధి చెందిన దేశాలలో వలస ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది. అతిథ్య దేశాల అభివృద్ధిలో వలస ప్రజల పాత్ర అనేక దశల్లో కీలకంగా మారింది.

వలస ప్రజల్లో 1 శాతం పెరిగితే, ఆ దేశ స్థూలదేశీయోత్పత్తి 1 శాతం పెరుగుతుందని నివేదిక విశ్లేషిస్తున్నది. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలలో వలస ప్రజలు ఆదేశ స్థూలదేశీయోత్పత్తిని పెంచటంలో ముందున్నారు. ప్రత్యేకించి ఖతర్‌ దేశంలో ప్రతి ఐదుగురిలో నలుగురు వలస ప్రజలే. ఆ దేశాభివృద్ధి వీరిపైనే ఎక్కువ ఆధారపడి ఉంది. 1950 నుండి 2000 వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న విదేశీయులు స్థానిక ప్రజల సృజనాత్మకతను దెబ్బతీయకుండా తలసరి పేటెంట్ల సాధనలో 15 శాతం అభివృద్ధిని సాధిస్తున్నారు. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 40 మిలియన్‌ల మంది వలస ప్రజలు నివశిస్తున్నారని నివేదిక చెప్తున్నది.

వలసలపై మానవాభివృద్ధి నివేదిక 2009 ప్రతిపాదించిన కార్యాచరణ-ఎజెండా: ఈ నేపథ్యంలో మానవాభివృద్ధి నివేదిక ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్‌లో కీలకంగా మారనున్న వలస ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చటం కోసం ఈ క్రింది ఎజెండాను ప్రపంచ దేశాల ముందు పరిశీలనకు సమర్పించింది.

అంశాలు:1) నైపుణ్య కార్మికులను తీసుకుంటున్న ప్రస్తుత స్థాయికి మించి అల్ప నైపుణ్య కార్మికుల్ని పనిలోకి వివిధ దేశాలు తీసుకోవాలి. 2) వలస ప్రజలందరికి ప్రతి దేశం విద్య, వైద్యం, ఓటు హక్కులాంటి ప్రాథమిక సేవలను పొందగలిగే ప్రాథమిక మానవహక్కులను కల్పించాలి. 3) వలస ప్రజల రవాణా, లావాదేవీల వ్యయాన్ని తగ్గించాలి. 4) అతిథ్య దేశాలకు, వలస ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలు వెతకాలి. 5) అంతర్గత వలసల ద్వారా పొందుతున్న ప్రయోజనాల్ని విస్తృత పర్చాలి. 6) వలసలు ఆయా సొంత దేశాల అభివృద్ధి వ్యూహాలలో ఒకటిగా చేర్చాలి.

వలసలు-భారతదేశం: మన దేశంలో 42 మిలియన్‌ల అంతర్గత వలస ప్రజలు ఉన్నారని నివేదిక చెప్తున్నది. వీరిలో 21 మిలియన్‌లు అభివృద్ధి పేర నిర్వాశితులైన ప్రజలే. మన దేశంలో విదేశీ వలస ప్రజలు మన జనాభాలో 0.5శాతమే. వీరిలో 48.6 శాతం మహిళలు. విదేశాలలో ఉన్న మన దేశ వలస ప్రజలు మన జనాభాలో 0.8 శాతం(2000-02). అంతర్జాతీయ మానవ చలనాలు 1.4 శాతం(2000-02)గా ఉన్నాయి. మన దేశం నుండి వెళ్ళిన వలస ప్రజలలో అత్యధిక మానవాభివృద్ధి దేశాల్లో 47.9శాతం, అధిక మానవాభివృద్ధి దేశాల్లో 20.4శాతం, మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాల్లో 30.7శాతం, అత్యల్ప మానవాభివృద్ధి దేశాల్లో 1శాతం ఉన్నారు.మన దేశం నుండి సంపన్న దేశాలకు వలస వెళ్ళిన వారిలో అధిక విద్యార్హతలు కలిగిన వారు 51.2 శాతం ఉన్నారు.

భారతదేశానికి వలస ప్రజల నుండి వస్తున్న ఆదాయం 35, 262 మిలియన్‌ డాలర్లు. ఇది స్థూలదేశీయోత్పత్తిలో 3.1శాతం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిష్పత్తిలో 1.5 ఉంది. ఈ నిధుల్లో 58.26శాతం ఆసియా నుండి, 26.9 శాతం ఉత్తర అమెరికా నుండి, 12.8 శాతం యూరప్‌ దేశాల నుండి వస్తున్నాయి.

ముగింపు: ప్రపంచ జనాభాలో అంతర్జాతీయ వలస ప్రజలు 3 శాతం ఉంటే మన దేశంలో 0.5శాతం ఉన్నారు. దీన్ని బట్టి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, విదేశీయులను ఆకర్షించగల స్థాయిలో మన దేశాభివృద్ధి లేదని విదితమవుతుంది. అదే సమయంలో మన దేశం నుండి విదేశాలకు వలస వెళ్ళే ప్రజల శాతం కూడా ప్రపంచ సగటు కంటే(3శాతం) తక్కువగా ఉంది. భారతదేశంలోని పేద ప్రజానీకం అంతర్జాతీయ వలస ప్రయోజనాల్ని పొందలేకపోవటంగా ఈ పరిణామం తెలియచెప్తుంది. అత్యధిక విద్యార్హతలు కలిగిన వారికి స్వదేశంలో అవకాశాల్లేక విదేశాలకు వెళ్ళటంగా పై గణాంకాలు తెలియచేస్తున్నాయి.

    No comments: